
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంచలనం.. అండర్-19 వేదికపై రికార్డుల వేట
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న ఇండియా అండర్-19 జట్టు అద్భుత ఆటతీరుతో సంచలనాలు సృష్టిస్తోంది. తాజగా వర్సెస్టర్‌లోని న్యూ రోడ్ మైదానంలో ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరిగిన నాలుగో వన్డేలో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్రలో నిలిచిపోయే విధంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 52 బంతుల్లోనే శతకం నమోదు చేసి, అండర్-19 వన్డే క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 14 ఏళ్ల వయసులో ఓపెనింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన వైభవ్ తన ధైర్యం, ధృఢత, టైమింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొదట అతను కేవలం 24 బంతుల్లోనే అర్ధశతకం సాధించగా, మరో 28 బంతుల్లో శతకం పూర్తి చేశాడు.
Details
వేగవంతమైన సెంచరీతో రికార్డు
ఇంగ్లండ్ స్పిన్నర్ రాల్ఫీ వేసిన 19వ ఓవర్‌లో నాలుగో బంతికే సెంచరీ సాధించాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌లో 10 బౌండరీలు, 7 సిక్సర్లు బాదాడు. ఈ విజయవంతమైన శతకంతో అతను పాకిస్థాన్ ఆటగాడు ఖాసిం అక్రమ్ 2022లో శ్రీలంకపై 63 బంతుల్లో చేసిన వేగవంతమైన సెంచరీ రికార్డును అధిగమించాడు. భారత్ తరఫున ముందుగా 69 బంతుల్లో వేగవంతమైన సెంచరీ చేసిన రాజ్ అంగద్ బావా రికార్డునూ ఈ సందర్భంగా దాటి వెళ్లాడు. బీహార్‌కు చెందిన వైభవ్ ఈ సిరీస్‌లో ఇప్పటికే చక్కటి ఫామ్ కనబరిచాడు. తొలి వన్డేలో కేవలం 19 బంతుల్లో 48 పరుగులు చేసిన చేశాడు.
Details
55 పరుగుల తేడాతో గెలుపు
రెండో వన్డేలో 45 పరుగులు (34 బంతుల్లో), మూడో వన్డేలో నార్తాంప్టన్ వేదికగా అజేయంగా 86 పరుగులు చేశాడు. తాజాగా నాలుగో వన్డేలో 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్లతో 143 పరుగులు నమోదు చేసి ప్రపంచానికి తన క్రికెట్ ప్రతిభను చాటాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ అండర్-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 363 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్ అండర్-19 జట్టు 45.3 ఓవర్లలో 308 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత యువ జట్టు 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.