Crazy Kalyanam Review:'క్రేజీ కళ్యాణం'.. అనుపమ పరమేశ్వరన్ సినిమా ఎలా ఉందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
థియేటర్లలో దసరా సందడి మొదలైంది. ఈ పండగ సందర్భంగా నేరుగా తెలుగు నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో 'క్రేజీ కళ్యాణం' కూడా ఒకటి. అనుపమ పరమేశ్వరన్, నరేశ్, అఖిల్ రాజ్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి భద్రప్ప దర్శకత్వం వహించారు. తండ్రీకూతుళ్ల అనుబంధం, ప్రేమ, పెళ్లి చుట్టూ అల్లుకున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందించింది? కథ ఎలా సాగింది? నటీనటుల ప్రదర్శన ఎలా ఉంది? ఇప్పుడు మూవీ రివ్యూలో తెలుసుకుందాం.
వివరాలు
క్రేజీ కళ్యాణం కథేంటి?
పర్వతాలు (నరేశ్ వీకే)కి ఇద్దరు కూతుళ్లు ఉంటారు. తన అన్న చూసిన సంబంధం కావడంతో పెద్ద కూతురిని బాలరాజు (తరుణ్ భాస్కర్)కి ఇచ్చి ఘనంగా పెళ్లి చేస్తాడు.
అయితే పెళ్లి తర్వాత బాలరాజు తాగుడుకు బానిసైపోతాడు. ఊళ్లో కనిపించిన ప్రతి ఒక్కరి దగ్గర అప్పులు చేస్తూ, తరచూ గొడవలు పడుతూ కుటుంబానికి సమస్యలు తెచ్చిపెడుతుంటాడు.
దీంతో పర్వతాలు ఊళ్లో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో తన చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కి మంచి గుణగణాలు, ఆస్తిపాస్తులు ఉన్న అబ్బాయిని చూసి ఘనంగా పెళ్లి చేయాలని పర్వతాలు నిర్ణయించుకుంటాడు.
అలా చేస్తే గతంలో పోయిన తన పరువును తిరిగి నిలబెట్టుకోవచ్చని భావిస్తాడు.
వివరాలు
ఆసక్తికరంగా కథ
ఈ క్రమంలో తన అన్న కూతురికి వచ్చిన అమెరికా సంబంధాన్ని సైతం చెడగొట్టి, ఆ అబ్బాయితోనే తన కూతురి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తాడు.
కీర్తి ఆలోచనలు మాత్రం వేరుగా ఉంటాయి. స్వతంత్ర భావాలున్న ఆమె ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, తాను ప్రేమించిన ఉదయ్ (అఖిల్)ను పెళ్లి చేసుకోవాలని కలలు కంటుంది. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పినా పర్వతాలు అంగీకరించడు.
ఊళ్లో తన గౌరవ మర్యాదలే ముఖ్యమని భావిస్తూ, తాను చూసిన అమెరికా సంబంధాన్నే చేసుకోవాలని పట్టుబడతాడు.
పర్వతాలు కోరుకున్న అబ్బాయితోనే కీర్తి పెళ్లి జరిగిందా? లేక ఆమె ప్రేమించిన ఉదయ్ను పెళ్లి చేసుకుందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.
వివరాలు
సినిమా ఎలా ఉందంటే?
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తండ్రీకూతుళ్ల అనుబంధానికి ఓ ప్రేమకథను జోడించి, రూరల్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించే ప్రయత్నం చేశారు దర్శకుడు భద్రప్ప.
తన కూతురిని పెద్దింటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడమే గౌరవంగా భావించే తండ్రి ఒకవైపు.. చదువుకుని ఉద్యోగం సంపాదించి, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆశపడే కూతురు మరోవైపు. వీరిద్దరి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.
కూతురి పెళ్లి కోసం తల్లిదండ్రులు చేసే ఖర్చులో పదో వంతు ఆమె చదువు కోసం వెచ్చించినా జీవితాలు మెరుగుపడతాయనే సందేశాన్ని దర్శకుడు ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్నారు.
తమకూతుళ్ల భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలనే మంచి విషయాన్ని ఎంచుకున్నారు.
వివరాలు
భావోద్వేగాలు పెద్దగా పండలేదు
అయితే ఆ సందేశాన్ని తెరపైకి తీసుకొచ్చిన కథనం మాత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సినిమా ప్రథమార్ధం పర్వతాలు కుటుంబాన్ని, తాగుబోతు అల్లుడు బాలరాజు వల్ల అతడు ఎదుర్కొనే ఇబ్బందులను పరిచయం చేస్తూ సరదాగా మొదలవుతుంది.
ఆతర్వాత కీర్తి, ఉదయ్ల ప్రేమకథ తెరపైకి వస్తుంది. కానీ ఈ ప్రేమకథలో భావోద్వేగాలు పెద్దగా పండవు. కథలో కొత్తదనం కూడా కనిపించదు.
పర్వతాలు తన అన్న కూతురికి వచ్చిన ఎన్నారై సంబంధాన్ని తన కూతురికి ఖాయం చేయాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి కథలో కాస్త కదలిక మొదలవుతుంది.
తన ఉద్యోగ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడంతో పాటు, ప్రేమించిన వ్యక్తిని దక్కించుకునేందుకు కీర్తి తండ్రిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలనే ఆసక్తి కలుగుతుంది.
అయితే ఆ దిశగా ఆమె చేసే ప్రయత్నాలు అంతగా ఆకట్టుకోవు.
వివరాలు
స్లోగా ఫస్టాప్
విరామానికి ముందు వచ్చే భావోద్వేగ సన్నివేశాలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. ద్వితీయార్ధానికి వచ్చేసరికి కథనం పూర్తిగా గాడి తప్పుతుంది.
కూతురిని ఎన్నారైకి ఇచ్చి పెళ్లి చేయాలనే పర్వతాలు ప్రయత్నాల్లో కొంత సీరియస్నెస్ కనిపించినా, ఆ పెళ్లిని అడ్డుకునేందుకు హీరోహీరోయిన్లు చేసే ప్రయత్నాలు బలంగా ఉండవు.
దీంతో కథలో కీలకంగా ఉండాల్సిన సంఘర్షణ ఆశించిన స్థాయిలో పండదు. మధ్యలో నవ్వులు పంచేందుకు రూపొందించిన స్పోకెన్ ఇంగ్లిష్ క్లాస్ ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి కథ మళ్లీ భావోద్వేగాల బాట పడుతుంది.
ఒకవైపు కూతురి పెళ్లి ఆగిపోకూడదని పర్వతాలు పడే తపన మనసుకు హత్తుకుంటుంది. మరోవైపు పెళ్లి వేడుకలో జరిగే గొడవలు, బాలరాజు చేసే హంగామా కొంత ఉత్కంఠను పంచుతాయి.
వివరాలు
ఎవరెలా నటించారంటే?
క్లైమాక్స్ కాస్త గందరగోళంగా అనిపించినప్పటికీ, ఆడపిల్లల జీవితాల్లో చదువు ఎంత ముఖ్యమో చెప్పే సందేశంతో సినిమాను ముగించిన తీరు బాగుంది. మంచి సందేశాన్ని ఎంచుకున్నప్పటికీ, ఆసక్తికరమైన కథనం, బలమైన సన్నివేశాలు తోడై ఉంటే ఈ సినిమా మరింత మెరుగ్గా ఉండేది.
అనుపమ పరమేశ్వరన్
సొంత కాళ్లపై నిలబడాలని తపనపడే ఆత్మాభిమానం కలిగిన అమ్మాయి కీర్తి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ చక్కగా ఒదిగిపోయారు.
తెలంగాణ యాసను సహజంగా పలుకుతూ తన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా భావోద్వేగభరితమైన సన్నివేశాల్లో ఆమె నటన ప్రత్యేకంగా నిలుస్తుంది.
అఖిల్ రాజ్
కీర్తి ప్రేమికుడు ఉదయ్ పాత్రలో అఖిల్ రాజ్ నటన ఫర్వాలేదనిపిస్తుంది. అయితే పాత్రకు మరింత బలమైన సన్నివేశాలు ఉండి ఉంటే ఆయన నటనకు మంచి అవకాశం దక్కేది.
వివరాలు
నరేశ్ నటన ఎలా ఉందంటే
పర్వతాలు పాత్ర ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. కూతురి పెళ్లి కోసం తాపత్రయపడే మధ్యతరగతి తండ్రిగా నరేశ్ తన అనుభవాన్నంతా రంగరించారు.
కామెడీతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లోనూ తనదైన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ చిత్రంలో అసలైన హీరోగా ఆయనే కనిపిస్తారు.
తరుణ్ భాస్కర్
బాలరాజు పాత్రలో తరుణ్ భాస్కర్ తన ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, భిన్నమైన మేనరిజంతో నవ్వులు పంచారు.
కథలో ఆయన పాత్ర వినోదాన్ని అందించే కీలకమైన అంశాల్లో ఒకటిగా నిలుస్తుంది
వివరాలు
సాంకేతిక విభాగాల పనితీరు
దర్శకుడు భద్రప్ప ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోయినా, కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాలను బాగానే పండించారు.
అయితే కథనాన్ని మరింత ఆసక్తికరంగా నడిపించడంలో విఫలమయ్యారు. సురేశ్ బొబ్బిలి అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తుంది.
'అలచంద్ర వంక' పాట మినహా మిగతా పాటలు పెద్దగా ఆకట్టుకోవు. శ్యామ్ కెమెరా పనితనం మాత్రం బాగుంది.
పల్లెటూరి వాతావరణాన్ని, పెళ్లి వేడుకల సందడిని తెరపై అందంగా చూపించారు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.