TGSRTC: ఆర్టీసీలో డబుల్ డ్యూటీకి సెలవులు బంద్.. నగదు చెల్లింపులే చేయాలి.. ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
డబుల్ డ్యూటీ చేసిన డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులు ఇవ్వకుండా, నగదు రూపంలోనే డబుల్ డ్యూటీ అడ్వాన్స్ చెల్లించాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఈ నెల 13న అన్ని ప్రాంతీయ మేనేజర్లకు ఉత్తర్వులు పంపించారు. డబుల్ డ్యూటీకి బదులుగా విశ్రాంతి సెలవులు ఇవ్వడం వల్ల డ్రైవర్లు, కండక్టర్లు విధులకు అందుబాటులో ఉండటం లేదని యాజమాన్యం పేర్కొంది. దీంతో షెడ్యూల్ సర్వీసుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది. డబుల్ డ్యూటీలు చేసిన సిబ్బందికి డబుల్ డ్యూటీ అడ్వాన్స్ మాత్రమే చెల్లించాలని, డీఆఫ్, సీఆఫ్ సెలవులు మంజూరు చేయకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
వివరాలు
ఆర్టీసీ ఉత్తర్వులను రద్దు చేయాలి: ఎస్‌డబ్ల్యూఎఫ్
డిపోల్లో అన్ని షెడ్యూల్ సర్వీసులను నడిపేందుకు అవసరమైన సంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ మేనేజర్లను ఆదేశించింది.
ఈ ఆదేశాలను అమలు చేసిన తీరుపై నివేదిక సమర్పించాలని సూచించింది. అయితే, యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఆర్టీసీలో కార్మిక చట్టాలను పదేపదే ఉల్లంఘిస్తున్నారని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) ఆరోపించింది.
డబుల్ డ్యూటీలు చేసే డ్రైవర్లు, కండక్టర్లకు మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ చట్టం-1961 ప్రకారం ఓవర్‌టైమ్ చెల్లించాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు.
అర్హత ఉన్న సిబ్బందికి నిబంధనల ప్రకారం డీఆఫ్, సీఆఫ్ సెలవులు కూడా మంజూరు చేయాలని కోరారు.
వివరాలు
ఆర్టీసీ ఉత్తర్వులను రద్దు చేయాలి: ఎస్‌డబ్ల్యూఎఫ్
డబుల్ డ్యూటీ చేసిన సిబ్బందికి సాధారణ వేతనానికి రెట్టింపు మొత్తం చెల్లించాలని చట్టంలో పేర్కొన్నట్లు ఎస్‌డబ్ల్యూఎఫ్ అధ్యక్షుడు వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి వి.ఎస్.రావు తెలిపారు.
అయితే, ప్రస్తుతం డబుల్ డ్యూటీ అడ్వాన్స్ పేరుతో కొంత మొత్తాన్ని మాత్రమే చెల్లిస్తున్నారని, ఓవర్‌టైమ్ కోసం క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించడం లేదని వారు విమర్శించారు.
చట్టంలోని నిబంధనల మేరకు ఓవర్‌టైమ్ చెల్లింపులతో పాటు విశ్రాంతి రోజులకు సంబంధించిన ప్రయోజనాలను కూడా సిబ్బందికి కల్పించాలని డిమాండ్ చేశారు.
డబుల్ డ్యూటీలకు సంబంధించి ఈడీ (ఆపరేషన్స్) జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ నేతలు కోరారు.
ఈ మేరకు ఆర్టీసీ ఎండీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించినట్లు వెల్లడించారు.