Automatic work permit: ఆటోమెటిక్ వర్క్ పర్మిట్ పొడిగింపు నిలిపివేత.. భారత్‌పై ప్రభావం ఎంత?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ పర్మిట్ గడువు ముగిసినప్పటికీ, రెన్యువల్ దరఖాస్తు పెండింగ్‌లో ఉంటే ఉద్యోగం కొనసాగించేందుకు వీలు కల్పించే ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ సదుపాయాన్ని రద్దు చేసింది. ఈ మేరకు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) మంగళవారం కొత్త నిబంధనను ప్రకటించింది. బ్లూమ్‌బెర్గ్ లా కథనం ప్రకారం.. గతంలో అర్హులైన వలసదారులు వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత,పాత పర్మిట్ గడువు ముగిసినా మరో 540 రోజుల వరకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండేది. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వ హయాంలో ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు.
వివరాలు
భారతీయ ఉద్యోగులపైనా ప్రభావం
అయితే, ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది ఈ విధానంపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. తాజాగా ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్‌ను పూర్తిగా రద్దు చేస్తూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమెరికాలో పనిచేస్తున్న భారతీయ నిపుణులతో పాటు ఇతర దేశాల ఉద్యోగులపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
ముఖ్యంగా H-1B వీసాదారుల జీవిత భాగస్వాములు, వర్క్ పర్మిట్ ఆధారంగా ఉద్యోగాలు చేస్తున్నవారు, పర్మిట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న వలసదారులు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.
గతంలో అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (USCIS) రెన్యువల్ దరఖాస్తులను పరిశీలించడంలో ఆలస్యం చేసినప్పటికీ, అర్హులైన ఉద్యోగులు ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ద్వారా తమ ఉద్యోగాలను కొనసాగించేవారు.
వివరాలు
ఈ నెల 30 నుంచి కొత్త నిబంధన అమలు
ఇప్పుడు ఈ వెసులుబాటు తొలగిపోవడంతో రెన్యువల్ ఆమోదం ఆలస్యమైతే కొందరు ఉద్యోగులు తాత్కాలికంగా పని నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
ఫలితంగా ఉద్యోగాలకు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది.
ఈ నెల 30 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. ఆ తేదీన లేదా ఆ తర్వాత వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ సదుపాయం వర్తించదు.
అంటే, ప్రస్తుత వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ ఆమోదం వచ్చే వరకు ఈ సదుపాయం ఆధారంగా ఉద్యోగం కొనసాగించడానికి వీలుండదు.
వివరాలు
ఈ నెల 30 నుంచి కొత్త నిబంధన అమలు
అమెరికాలో వర్క్ పర్మిట్‌పై ఆధారపడి పనిచేస్తున్న భారతీయులు తమ పర్మిట్ గడువు, రెన్యువల్ దరఖాస్తు తేదీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
గడువు ముగియకముందే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసినంత మాత్రాన ఉద్యోగాన్ని కొనసాగించే హక్కు ఆటోమేటిక్‌గా లభించదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
కొత్త నిబంధనల ప్రకారం తమ ఉద్యోగ అర్హతపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ముందుగానే తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవడం అవసరం.