Loading...
Tesla Roadster: దాదాపు 9 ఏళ్ల నిరీక్షణకు తెర.. రేపే టెస్లా రోడ్‌స్టర్‌ ఈవీ లైవ్ డెమో!
దాదాపు 9 ఏళ్ల నిరీక్షణకు తెర.. రేపే టెస్లా రోడ్‌స్టర్‌ ఈవీ లైవ్ డెమో!

Tesla Roadster: దాదాపు 9 ఏళ్ల నిరీక్షణకు తెర.. రేపే టెస్లా రోడ్‌స్టర్‌ ఈవీ లైవ్ డెమో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 16, 2026
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్‌ కార్ల ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టెస్లా నెక్స్ట్‌ జనరేషన్‌ రోడ్‌స్టర్‌ కారు మరోసారి వార్తల్లో నిలిచింది. దాదాపు తొమ్మిదేళ్ల నిరీక్షణ తర్వాత ఈ స్పోర్ట్స్‌ కారును ప్రత్యక్షంగా ప్రదర్శించేందుకు టెస్లా సిద్ధమైంది. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం వాకోలో, స్పేస్‌ఎక్స్‌ మెక్‌గ్రెగర్‌ పరీక్షా కేంద్రానికి సమీపంలో ఈ ప్రదర్శన జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఎక్స్‌ (X) వేదికగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. భారతీయ ప్రేక్షకుల కోసం ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌ అక్టోబర్‌ 16, 2026న ఉదయం 6:25 గంటలకు ప్రారంభం కానుంది. 2017లోనే టెస్లా ఈ ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ కారు ప్రోటోటైప్‌ను పరిచయం చేసింది. అప్పట్లో దీని ధరను 2 లక్షల డాలర్లుగా ప్రకటించింది.

వివరాలు

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 620 కిలోమీటర్లు

అంటే ప్రస్తుత మారకపు విలువను బట్టి సుమారు రూ.1.7 కోట్లకు పైగా ఉంటుంది. 2020లోనే డెలివరీలు ప్రారంభిస్తామని సంస్థ అప్పట్లో తెలిపింది.

అయితే ఆ గడువు దాటిపోయినా కారు మార్కెట్లోకి రాలేదు. ఇప్పటికీ దీని ధరను అధికారికంగా మార్చలేదు.

ఈ కారును ముందస్తుగా బుక్‌ చేసుకోవాలంటే 50,000 డాలర్లు అంటే సుమారు రూ.42 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త రోడ్‌స్టర్‌ పనితీరుపై టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ గతంలో పలు ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు.

2017లో నాలుగు సీట్లతో రూపొందించే ఈ కారు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 620 మైళ్లు (సుమారు 1,000 కిలోమీటర్లు) ప్రయాణించగలదని చెప్పారు.

2024లో ఈ కారును పూర్తిగా పునఃరూపకల్పన చేసినట్లు మస్క్‌ ఎక్స్‌లో వెల్లడించారు.

వివరాలు

ఒక్క సెకను కంటే తక్కువలో 100 కి.మీ. వేగం!

గంటకు 60 మైళ్ల వేగాన్ని (సుమారు 100 కి.మీ.) చేరుకోవడానికి ఒక్క సెకను కంటే తక్కువ సమయం పడుతుందని పేర్కొన్నారు.

ఈ వేగం సాధించడం కంటే కారులో ఇంకా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ప్రాజెక్టులో టెస్లాతో పాటు మస్క్‌ నేతృత్వంలోని రాకెట్‌ తయారీ సంస్థ స్పేస్‌ఎక్స్‌ కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలిపారు.

అయితే ఈ వేగం ప్రయాణ దూరం వంటి వివరాలు కంపెనీ గతంలో వెల్లడించిన లక్ష్యాలు, ప్రకటనలకు సంబంధించినవి.

వాణిజ్య ఉత్పత్తి వెర్షన్‌లో ఇవన్నీ ఏ స్థాయిలో అందుబాటులో ఉంటాయనేది అధికారిక వివరాలపై ఆధారపడి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు

టెస్లా వ్యాపారానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది?

టెస్లా ఆర్థిక పరిస్థితికి రోడ్‌స్టర్‌ పెద్దగా మార్పు తీసుకురాదని ఎలాన్‌ మస్క్‌ గతంలో అభిప్రాయపడ్డారు. 2023లో ఈ కారును ఆర్థికంగా పెద్ద ప్రభావం చూపని చిన్న ప్రాజెక్టుగా అభివర్ణించారు.

అయితే మార్కెట్‌ విశ్లేషకుడు సేథ్‌ గోల్డ్‌స్టీన్‌ మాత్రం ఈ కారుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు.

టెస్లా ప్రస్తుతం తన అత్యుత్తమ ఇంజినీరింగ్‌, సాంకేతికతను ప్రదర్శించే హైపర్‌ పర్ఫార్మెన్స్‌ లగ్జరీ కారును కలిగి లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

కొత్త రోడ్‌స్టర్‌ సంస్థకు ఒక 'హాలో కార్‌'గా నిలుస్తుందని వివరించారు. అంటే సంస్థ సాంకేతిక సామర్థ్యాన్ని, ప్రతిష్ఠను చాటిచెప్పే ప్రత్యేకమైన మోడల్‌గా ఇది ఉపయోగపడుతుందని విశ్లేషించారు.

గోల్డ్‌స్టీన్‌ అంచనా ప్రకారం టెస్లా ఏడాదికి సుమారు 2,000 రోడ్‌స్టర్‌ కార్లను విక్రయించే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

టెస్లా తొలి ఎలక్ట్రిక్‌ కారు కూడా రోడ్‌స్టరే!

గతేడాది సంస్థ విక్రయించిన 16 లక్షల వాహనాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ సంఖ్యే.

టెస్లా చరిత్రలో రోడ్‌స్టర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సంస్థ తొలి ఎలక్ట్రిక్‌ వాహనమైన ఒరిజినల్‌ రోడ్‌స్టర్‌ 2008లో మార్కెట్లోకి వచ్చింది.

2012 వరకు విక్రయాలు కొనసాగాయి. ఈ కారులో లోటస్‌ ఎలిస్‌ (Lotus Elise) ఛాసిస్‌ను ఉపయోగించారు.

ఎలక్ట్రిక్‌ కార్లు కూడా ఆకర్షణీయమైన డిజైన్‌, స్పోర్ట్స్‌ కార్ల స్థాయి పనితీరుతో రూపొందవచ్చని ప్రపంచానికి చాటిచెప్పడంలో తొలి రోడ్‌స్టర్‌ కీలక పాత్ర పోషించింది.

ఆ తర్వాత టెస్లా మోడల్‌ వై (Model Y), మోడల్‌ ఎక్స్‌ (Model X) ఎస్‌యూవీలతో పాటు మోడల్‌ ఎస్‌ (Model S), మోడల్‌ 3 (Model 3) సెడాన్‌లతో విస్తృత గుర్తింపు పొందింది.

వివరాలు

ఎలక్ట్రిక్‌ కార్ల నుంచి ఏఐ, రోబోటిక్స్‌ వైపు టెస్లా దృష్టి

రెండో తరం రోడ్‌స్టర్‌ ఆవిష్కరణకు సిద్ధమవుతున్న సమయంలో టెస్లా తన వ్యాపార ప్రాధాన్యాలను కూడా మార్చుకుంటోంది.

సంప్రదాయ కార్ల తయారీతో పాటు కృత్రిమ మేధస్సు (AI), స్వయంచాలక డ్రైవింగ్‌ సాంకేతికత, రోబోటిక్స్‌పై సంస్థ ఎక్కువగా దృష్టి సారిస్తోంది.

ఈ ఏడాది మోడల్‌ ఎస్‌, మోడల్‌ ఎక్స్‌ కార్ల విక్రయాలను నిలిపివేసి, ఆ తయారీ సామర్థ్యాన్ని ఆప్టిమస్‌ (Optimus) హ్యూమనాయిడ్‌ రోబోట్‌ల ఉత్పత్తికి వినియోగించాలని టెస్లా నిర్ణయించింది.

అలాగే సైబర్‌క్యాబ్‌ (Cybercab) పేరుతో రెండు సీట్ల రోబోట్యాక్సీని కూడా పరిచయం చేసింది.

వివరాలు

మానవ డ్రైవింగ్‌కు అవసరమైన నియంత్రణ పరికరాలుండవు

ఈ వాహనంలో స్టీరింగ్‌ వీల్‌, పెడల్స్‌, అద్దాలు వంటి సాధారణ మానవ డ్రైవింగ్‌కు అవసరమైన నియంత్రణ పరికరాలుండవు.

ఈ నేపథ్యంలో కొత్త రోడ్‌స్టర్‌ ఆవిష్కరణ టెస్లా భవిష్యత్తు వ్యూహంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

అత్యాధునిక వేగం, సుదీర్ఘ ప్రయాణ సామర్థ్యం, స్పేస్‌ఎక్స్‌తో సాంకేతిక భాగస్వామ్యం వంటి అంశాలతో ఈ కారు ప్రత్యేకతను చాటుకోవాలని సంస్థ భావిస్తోంది.

అయితే 2017లో ప్రకటించిన ప్రణాళికల తర్వాత పలుమార్లు ఆలస్యమైన ఈ కారు ఎప్పుడు వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

ADVERTISEMENT