Loading...
Tesla: చైనాలో టెస్లా యూజర్లకు షాక్.. భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను రీకాల్
చైనాలో టెస్లా యూజర్లకు షాక్.. భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను రీకాల్

Tesla: చైనాలో టెస్లా యూజర్లకు షాక్.. భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను రీకాల్

వ్రాసిన వారు Moogati Shabari
Aug 22, 2026
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాలో టెస్లా భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ కార్లను రీకాల్ చేస్తోంది. దాదాపు 30 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను వెనక్కి పిలిపించడానికి ప్రధాన కారణం కార్ల డోర్ హ్యాండిల్స్‌కు సంబంధించిన భద్రతా సమస్యలే. ఈ రీకాల్‌లో చైనాలో తయారైన కార్లతో పాటు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న టెస్లా మోడళ్లు కూడా ఉన్నాయి. ఇందులో మోడల్ 3, మోడల్ వై, మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ వాహనాలు ఉన్నాయి. చైనా మీడియా కథనాల ప్రకారం.. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద వాహన రీకాల్.

వివరాలు

దాచిన డోర్ హ్యాండిల్స్‌పై నిషేధానికి సన్నాహాలు..

చైనాలో భారీ రీకాల్‌కు సంబంధించిన ప్రకటన రావడానికి ముందే అక్కడి అధికారులు దాచిన డోర్ హ్యాండిల్స్‌పై నిషేధం విధించే ప్రణాళికలను ప్రకటించారు.

టెస్లా కార్లతో పాటు చైనాలో తయారయ్యే అనేక ఎలక్ట్రిక్ వాహనాల్లోనూ ఈ తరహా డోర్ హ్యాండిల్స్‌ను ఉపయోగిస్తున్నారు.

ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ప్రమాదాల్లో ఎలక్ట్రానిక్ డోర్ హ్యాండిల్స్ పనిచేయకపోవడంతో వాహనాల్లోని ప్రయాణికులు బయటకు రాలేకపోయిన ఘటనలు భద్రతాపరమైన ఆందోళనలకు కారణమయ్యాయి.

దీంతో దాచిన డోర్ హ్యాండిల్స్‌పై చైనా అధికారులు దృష్టి సారించారు.

వివరాలు

ప్రమాద సమయంలో బయటకు రావడం కష్టమే..

టెస్లా కార్ల డోర్ హ్యాండిల్స్‌తో సంబంధం ఉన్న భద్రతా ప్రమాదాలను చైనా నియంత్రణ సంస్థ గుర్తించింది.

ముఖ్యంగా తీవ్రమైన ప్రమాదం జరిగి కారులో విద్యుత్ వ్యవస్థ పనిచేయకపోతే.. డోర్ హ్యాండిల్స్ సరిగ్గా పనిచేయకపోవచ్చు.

దీంతో ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో త్వరగా కారు నుంచి బయటకు రావడం కష్టమవుతుంది.

అంతేకాదు.. బయట ఉన్న రక్షణ సిబ్బంది కారులోకి ప్రవేశించేందుకు కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది.

అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు కారులోనే చిక్కుకుపోయే ప్రమాదం ఉందని చైనా నియంత్రణ సంస్థ తన వెబ్‌సైట్‌లో విడుదల చేసిన నోటీసులో పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇవ్వనున్న టెస్లా..

ఈ రీకాల్‌లో భాగంగా తమ వాహనాలకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందించాలని టెస్లా నిర్ణయించింది.

లోపభూయిష్ట డోర్ హ్యాండిల్స్ కారణంగా తలెత్తే ప్రమాదాలను తగ్గించడమే ఈ అప్‌డేట్స్ ఉద్దేశం.

అయితే ఈ విషయంపై టెస్లా సంస్థ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

ADVERTISEMENT