రిలయన్స్ బోర్డుకు నీతా అంబానీ రాజీనామా; డైరెక్టర్లుగా ఇషా, ఆకాశ్, అనంత్ నియామకం
ఈ వార్తాకథనం ఏంటి
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) డైరెక్టర్ల బోర్డుకు ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ రాజీనామా చేశారు.
రిలయన్స్ కంపెనీ 46వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముకేష్ అంబానీ ఈ విషయాన్నిప్రకటించారు.
నీతా అంబానీ రాజీనామా నేటి నుంచే అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటనలో తెలిపింది.
నీతా అంబానీ రాజీనామాతో కంపెనీలో కీలక బాధ్యతలు వారి వారసులకు అప్పగించడానికి మార్గం సుగమం అయ్యింది.
అంబానీ వారసులు ఇషా, ఆకాష్, ఆనంద్ రిలయన్స్ బోర్డుల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇషా, ఆకాష్, ఆనంద్‌ను డైరెక్టర్లుగా నియమిస్తూ ఇప్పటికే బోర్టు ఉత్తర్వులు జారీ చేయగా, వాటాదారుల ఆమోదం తర్వాత వారి నియామకం అమల్లోకి వస్తుంది.
రిలయన్స్
రిలయన్స్ ఫౌండేషన్‌పై నీతా అంబానీ ఫోకస్
నీతా అంబానీ ప్రస్తుతం రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. రిలయన్స్ ఫౌండేషన్‌పై పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరించడానికి ఆమె బోర్టుకు రాజీనామా చేశారు.
అయితే నీతా రాజీనామా చేసినప్పటికీ అన్ని ఆర్ఐఎల్ బోర్డు సమావేశాలకు శాశ్వత ఆహ్వానితురాలిగా హాజరుకానున్నారు. అంతేకాకుండా అమె ఇచ్చే సలహాలను కూడా కంపెనీ స్వీకరించనుంది.
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్‌పర్సన్‌గా ఆమె నాయకత్వం వహించడాన్ని డైరెక్టర్ల బోర్డు ప్రశంసించింది.
ఇదిలా ఉంటే, అంబానీ వారసులు చాలా ఏళ్లుగా రిలయన్స్ వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్నారు. రిటైల్, డిజిటల్ సేవలు, ఎనర్జీ, వంటి కీలక వ్యాపారాలకు వారు నాయకత్వం వహిస్తున్నారు. కంపెనీలో కీలక బోర్టు డైరెక్టుర్లుగా వారు కొత్త పాత్ర పోషించబోతున్నారు.