Electricity: కేంద్ర విద్యుత్‌శాఖ నూతన నిబంధన.. వివాదం ఉన్నా కరెంటు కట్ చేయొద్దు!
ఈ వార్తాకథనం ఏంటి
విద్యుత్ వినియోగదారుల హక్కులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర విద్యుత్‌శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒక నెలలో కరెంటు వినియోగం గత ఆరు నెలల సగటుతో పోల్చితే ఐదు రెట్లు పెరిగినా లేదా ఐదో వంతుకంటే తక్కువకు పడిపోయినా ఆ విషయంపై డిస్కంలు తప్పనిసరిగా విచారణ జరపాలని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విచారణను నెల రోజుల్లోగా పూర్తి చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అయితే విచారణ జరుగుతున్నంతకాలం సంబంధిత విద్యుత్ కనెక్షన్‌ను నిలిపివేయడానికి వీల్లేదని కూడా స్పష్టం చేసింది.
Details
డిస్కంలు తప్పనిసరిగా అమలు
ఈ సమయంలో వినియోగదారుడు భారీగా నమోదైన యూనిట్లకు కాకుండా గత ఆరు నెలల సగటు వినియోగాన్ని ఆధారంగా తీసుకుని బిల్లు చెల్లిస్తే డిస్కంలు స్వీకరించాలని కేంద్రం సూచించింది. విద్యుత్ వినియోగదారుల హక్కుల నియమావళిలో సవరణలు చేస్తూ కేంద్ర విద్యుత్‌శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రతిపాదనలపై ఎవరైనా అభ్యంతరాలు ఉంటే వచ్చే నెల 11లోపు తెలియజేయాలని పేర్కొంది. వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
Details
సవరణలలోని ముఖ్య అంశాలు
కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలని లేదా ఇప్పటికే ఉన్న కనెక్షన్‌లో మార్పులు చేయాలని దరఖాస్తు చేస్తే నిర్దిష్ట కాలవ్యవధిలోగా ఇవ్వాలి. నగర కార్పొరేషన్ పరిధిలో 3 రోజుల్లో, మున్సిపాలిటీల్లో 7 రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో గరిష్ఠంగా 15 రోజుల్లో కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. రోజులో అత్యధిక విద్యుత్ వినియోగం ఉండే సమయంలో కరెంటు ఉపయోగిస్తే సాధారణ ఛార్జీలకన్నా 20 శాతం అదనంగా వసూలు చేయాలి. దీనిని 'టైమ్ ఆఫ్ డే టారిఫ్' (TOD) అని పిలుస్తారు. విద్యుత్ వినియోగం తక్కువగా ఉండే సమయంలో కరెంటు వాడితే 20 శాతం తక్కువ ఛార్జీలు విధించాలి. ఈ విధానంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్‌లో వచ్చే అనూహ్య హెచ్చుతగ్గులను తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది.
Details
ఒకరిని వినియోగదారుల ప్రతినిధిగా నియమించాలి
సౌర విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉండే సమయంలో విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు వినియోగదారులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించింది. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా, మున్సిపాలిటీ స్థాయిలో ప్రత్యేక వేదికలు (ఫోరమ్‌లు) ఏర్పాటు చేయడం తప్పనిసరి. ఇందులో ఒక ఛైర్మన్, ముగ్గురు సభ్యులు ఉండాలి. వీరిలో ఒకరిని వినియోగదారుల ప్రతినిధిగా నియమించాలి. వినియోగదారుల ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. సాధారణంగా ఒక నెలలోపే తీర్మానం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 45 రోజులు మించకూడదు. ఆ తీర్పుతో అసంతృప్తి ఉన్న వినియోగదారుడు 90 రోజుల్లోగా డిస్కం స్థాయిలో ఉన్న పైస్థాయి వేదికను ఆశ్రయించవచ్చు.