Virupakshi: టీడీపీ కార్యకర్తలపై దాడి కేసు.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం విరూపాక్షిని చిప్పగిరి పోలీస్‌స్టేషన్ నుంచి ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు. శనివారం రాత్రి సంగాల, నేమకల్లు గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 15 మందిపై కేసు నమోదైంది. టీడీపీ కార్యకర్త శేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిప్పగిరి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
వివరాలు
ఏం జరిగిందంటే..
చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గురునాథ్, సంగాల గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త గిరి మధ్య ఫోన్‌లో వ్యక్తిగత దూషణలు చోటుచేసుకున్నాయి.
ఈ వివాదం క్రమంగా ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ విషయాన్ని వైసీపీ కార్యకర్త గిరి ఎమ్మెల్యే విరూపాక్షికి తెలియజేయడంతో, ఆయన తన అనుచరులతో కలిసి నేమకల్లు గ్రామానికి వెళ్లారు.
అక్కడ ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో టీడీపీ కార్యకర్త శేఖర్ తలకు తీవ్ర గాయాలు కాగా, నాగరాజు స్వల్పంగా గాయపడ్డారు.
మరోవైపు ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు శ్రీరాములు ఎడమ చేతికి గాయమైనట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.