Pakistan: ఇంధన సంక్షోభం నేపథ్యంలో పాకిస్థాన్‌లో పొదుపు చర్యలు.. వాహనాల కొనుగోలుపై నిషేధం,వివాహ వేడుకల్లో వంటకాలపై ఆంక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, ఎర్ర సముద్రంలో అలజడి కొనసాగుతుండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక పొదుపు చర్యలను ప్రకటించింది. పెరుగుతున్న ఇంధన వ్యయం, దిగుమతి ఖర్చులు, ప్రభుత్వ వ్యయాలను నియంత్రించే లక్ష్యంతో కొత్త ప్యాకేజీని అమల్లోకి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 17న (గురువారం) కేబినెట్ డివిజన్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. కొన్ని ఆంక్షలు తక్షణమే అమల్లోకి రాగా, మరికొన్ని మూడు నెలలపాటు కొనసాగనున్నాయి.
వివరాలు
కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం
ప్రభుత్వం కొత్త వాహనాల కొనుగోలుపై పూర్తిస్థాయి నిషేధం విధించింది.
మన్నికైన వస్తువుల కొనుగోళ్లపైనా ఆంక్షలు విధించినప్పటికీ.. ఐటీకి సంబంధించిన కొనుగోళ్లు, అభివృద్ధి ప్రాజెక్టులకు మినహాయింపు ఇచ్చింది.
అధికారిక వాహనాలకు కేటాయించే ఇంధనాన్ని మూడు నెలలపాటు 50 శాతం తగ్గించింది.
అయితే సాయుధ దళాలు, పౌర సాయుధ దళాలు, శాంతిభద్రతల సంస్థలు, అత్యవసర సేవలు, ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎఫ్‌బీఆర్)కు చెందిన కార్యాచరణ వాహనాలకు ఈ ఇంధన కోత నుంచి మినహాయింపు ఇచ్చారు.
వివరాలు
ప్రభుత్వ శాఖల ఖర్చులపై కోత
ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధం లేని వ్యయాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలవారీగా 5 శాతం కోత విధించారు.
విదేశాల్లోని పాకిస్థాన్ రాయబార కార్యాలయాలు, అక్కడ పనిచేసే అధికారులకు కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయి. అయితే అద్దె, విద్యా రుసుములు, వైద్య ఖర్చులకు మినహాయింపు ఉంటుంది.
విదేశీ పర్యటనలపైనా ఆంక్షలు
విదేశీ పర్యటనలపై మూడు నెలలపాటు ఆంక్షలు విధించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలకు అనుమతి ఇవ్వనున్నారు.
మంత్రులు, సలహాదారులు, ఎంపీలు, అధికారులు ఇకపై ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించాల్సి ఉంటుంది.
అయితే స్కాలర్‌షిప్‌లు, అంతర్జాతీయ అభివృద్ధి భాగస్వాములు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలకు మినహాయింపులు ఉన్నాయి.
వివరాలు
వివాహ వేడుకల్లో ఒకే వంటకం
ప్రజలను నేరుగా ప్రభావితం చేసే నిర్ణయాల్లో భాగంగా వివాహ వేడుకల్లో ఒకే రకమైన వంటకాన్ని మాత్రమే వడ్డించాలని ప్రభుత్వం ఆదేశించింది.
అంతేకాకుండా దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ రాత్రి 9 గంటలకు మూసివేయాలి.
వివాహ వేదికలను రాత్రి 10 గంటలకు, రెస్టారెంట్లను రాత్రి 11 గంటలకు మూసివేయాల్సి ఉంటుంది.
అయితే ఫార్మసీలు, ఆసుపత్రులు, క్లినిక్‌లు, ఇంధన-సీఎన్‌జీ స్టేషన్లు, ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు, ఐటీ కంపెనీలు, కాల్ సెంటర్లకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.
వివరాలు
మార్చిలోనూ పొదుపు చర్యలు
మధ్యప్రాచ్య పరిణామాల ప్రభావంతో ఇంధన ధరలు, దిగుమతి వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం గత మార్చిలోనూ ఇలాంటి పొదుపు చర్యలు చేపట్టింది.
తాజా ప్యాకేజీతో ప్రభుత్వ ఖర్చుల నియంత్రణను మరింత విస్తరించింది.
ఇందులో వాహనాల కొనుగోళ్లు, కార్యాలయ వ్యయాలు, విదేశీ ప్రయాణాలతోపాటు వ్యాపార సమయాలు, వివాహ వేడుకలపైనా ఆంక్షలు విధించింది.