Asian Games 2026: 'ఆసియా క్రీడల్లో మనోళ్ల జోరు.. పతకాలపై భారీ అంచనాలు
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో భారత్ నుంచి బరిలోకి దిగుతున్న తెలుగు క్రీడాకారుల్లో ఎక్కువ అంచనాలు ఆర్చర్లు ధీరజ్ బొమ్మదేవర, వెన్నం జ్యోతిసురేఖలపైనే ఉన్నాయి. ధీరజ్ ఇటీవల ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో స్వర్ణం గెలిచి, ఈఘనత సాధించిన తొలి భారత పురుష ఆర్చర్‌గా చరిత్ర సృష్టించాడు. విజయవాడకు చెందినఈ ఆర్చర్‌కు ఇవి రెండో ఆసియా క్రీడలు. నాలుగేళ్ల క్రితం రికర్వ్ టీమ్ రజతం సాధించిన భారత జట్టులో ధీరజ్ సభ్యుడిగా ఉన్నాడు. ఈసారి వ్యక్తిగత, టీమ్ విభాగాల్లోనూ అతడు పతకాలు సాధిస్తాడని అంచనాలున్నాయి. ఇక విజయవాడకే చెందిన వెన్నం జ్యోతిసురేఖపైనా భారీ ఆశలున్నాయి. ఆసియా క్రీడల్లో పాల్గొనడం సురేఖకు ఇది నాలుగోసారి. 2022 క్రీడల్లో ఆమె మూడు స్వర్ణ పతకాలు సాధించింది.
వివరాలు
పసిడి పతకాలు కైవసం
కాంపౌండ్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్, మహిళల టీమ్ విభాగాల్లో పసిడి పతకాలను కైవసం చేసుకుంది.
అంతకుముందు 2018లో మహిళల టీమ్ విభాగంలో రజతం, 2014లో మహిళల టీమ్ విభాగంలో కాంస్య పతకం జ్యోతిసురేఖ ఖాతాలో ఉన్నాయి.
తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన చికిత తానిపర్తికి కూడా ఆసియా క్రీడల్లో రాణించే సత్తా ఉంది. ఆమె కాంపౌండ్ విభాగంలో అండర్-21 ప్రపంచ యూత్ స్వర్ణం గెలిచింది.
ఈ ఏడాది జరిగిన ప్రపంచ అండర్-21 టోర్నీలో కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో పసిడి సాధించిన తిరుమూరు గణేశ్ మణిరత్నం కూడా ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు.
వివరాలు
సింధు ఏం చేస్తుందో..
సుదీర్ఘ కెరీర్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు రెండుసార్లు ఆసియా క్రీడల్లో పాల్గొంది. 2018లో సింగిల్స్‌లో రజత పతకం సాధించిన ఆమె.. 2014లో మహిళల టీమ్ విభాగంలో కాంస్యం గెలిచింది.
గాయం కారణంగా గత ఆసియా క్రీడలకు దూరమైన ఈ తెలుగమ్మాయి.. ఈసారి పతకంపై గురిపెట్టింది. మధ్యలో కొంతకాలం ఫామ్‌లో లేకపోయినా.. ఈ ఏడాది జులైలో జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచి సింధు మళ్లీ గాడిలో పడింది.
సింగిల్స్‌లో చాలాకాలంగా పెద్దగా రాణించలేకపోతున్న కిదాంబి శ్రీకాంత్‌కు కూడా ఆసియా క్రీడలు పరీక్షగా మారనున్నాయి.
గత ఆసియా క్రీడల్లో టీమ్ రజతం గెలిచిన భారత జట్టులో శ్రీకాంత్ సభ్యుడిగా ఉన్నాడు.
వివరాలు
దద
సింగిల్స్‌లో తరుణ్ మన్నెపల్లి కూడా బరిలోకి దిగుతున్నాడు.
పురుషుల డబుల్స్‌లో చిరాగ్ శెట్టితో జత కట్టిన సాత్విక్ సాయిరాజ్‌పై, మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీతో జోడీగా ఉన్న పుల్లెల గాయత్రి గోపీచంద్‌పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.
2022 ఆసియా క్రీడల్లో సాత్విక్ జోడీ డబుల్స్‌లో స్వర్ణ పతకం, టీమ్ విభాగంలో రజత పతకం సాధించింది.
వివరాలు
జ్యోతి వెలిగేనా..
అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకం అందించే సత్తా ఉన్న క్రీడాకారుల్లో జ్యోతి యర్రాజి ముందువరుసలో ఉంది.
మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఇప్పటికే పలుమార్లు జాతీయ రికార్డు నెలకొల్పిన జ్యోతి.. రెండోసారి ఆసియా క్రీడల్లో బరిలోకి దిగుతోంది.
2022 క్రీడల్లో రజత పతకం సాధించిన ఆమెపై ఈసారి కూడా మంచి అంచనాలున్నాయి. గాయం నుంచి కోలుకున్న విశాఖపట్నం స్ప్రింటర్.. గతేడాది ఆసియా అథ్లెటిక్స్ మీట్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది.
తాజాగా జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్ రేసును 12.99 సెకన్లలో పూర్తి చేసి పసిడి గెలిచిన జ్యోతి.. తన ఫామ్‌ను చాటుకుంది. కర్నూలుకు చెందిన అథ్లెట్ మొగిలి వెంకట రామ్‌రెడ్డి కూడా ప్రతిభావంతుడే.
వివరాలు
గురి కుదిరేనా..
ఆసియా క్రీడల్లో భారత్‌కు కచ్చితంగా పతకం వచ్చే క్రీడల్లో షూటింగ్ కూడా ఒకటి. ఈసారి ఈ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన షూటర్లు ఇషా సింగ్, కైనన్ షెనాయ్ బరిలోకి దిగుతున్నారు.
ఇషా సింగ్ ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చేసింది. మేలో జరిగిన ప్రపంచకప్‌లో 25 మీటర్ల పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఆమె.. ఇదే సీజన్‌లో హాంగ్జౌ ప్రపంచకప్‌లోనూ 25 మీటర్ల పిస్టల్‌లో మరో స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
ఈ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌గా కూడా నిలిచింది.
గత ఆసియా క్రీడల్లో వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో రజత పతకాలు గెలిచిన ఇషా.. ఈసారి పసిడిపై గురిపెట్టింది. ట్రాప్‌లో పోటీ పడుతున్న కైనన్ చెనాయ్ కూడా పతక రేసులో ఉన్నాడు.
వివరాలు
జోరు కొనసాగేనా..
టేబుల్ టెన్నిస్‌లో బరిలోకి దిగుతున్న ఆకుల శ్రీజ కూడా పతక రేసులో ఉంది.
2022 కామన్వెల్త్ క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం గెలిచి సత్తా చాటిన ఆమె.. 2024లో ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది.
ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ టీటీలో ఒక స్వర్ణంతో సహా మొత్తం నాలుగు పతకాలు సాధించి శ్రీజ అదరగొట్టింది.
తొలిసారి ఆసియా క్రీడల్లో బరిలోకి దిగుతున్న ఈ తెలుగు ప్లేయర్ ఎలా రాణిస్తుందో చూడాలి.
వివరాలు
కీలకమవుతారా..
2022 ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్లు స్వర్ణ పతకాలతో మెరిశాయి. అప్పటి జట్టులో సభ్యుడిగా ఉన్న తిలక్ వర్మ మరోసారి ఆసియా క్రీడలకు వెళ్తున్నాడు.
ఈసారి జట్టుకు అతడే వైస్ కెప్టెన్. బ్యాటర్‌గా తిలక్‌పై పెద్ద బాధ్యతే ఉంది. ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి తొలిసారి ఆసియా క్రీడల్లో ఆడుతున్నాడు.
గాయం నుంచి కోలుకున్న అతడు.. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంతితో రాణించాడు. అయితే బ్యాటింగ్‌లో లయ అందుకోవాల్సి ఉంది.
మహిళల జట్టులో సభ్యులైన స్పిన్నర్ శ్రీచరణి, పేసర్ అరుంధతి రెడ్డి తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్నారు. ప్రపంచ నంబర్‌వన్ టీ20 స్పిన్నర్‌గా ఎదిగిన శ్రీచరణిపై భారీ అంచనాలే ఉన్నాయి.