Loading...
Abhishek Sharma: 30 బంతుల్లో సెంచరీ.. అభిషేక్‌ శర్మ విధ్వంసం!
30 బంతుల్లో సెంచరీ.. అభిషేక్‌ శర్మ విధ్వంసం!

Abhishek Sharma: 30 బంతుల్లో సెంచరీ.. అభిషేక్‌ శర్మ విధ్వంసం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2026
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా జోరు కొనసాగింది. అఫ్గానిస్థాన్‌పై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన శ్రేయస్‌ సేన.. మూడో టీ20లోనూ ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ హీరోగా అభిషేక్‌ శర్మ నిలిచాడు. సిరీస్‌ ఆరంభం నుంచే అఫ్గాన్‌ బౌలర్లపై విరుచుకుపడుతున్న ఈ విధ్వంసకర ఓపెనర్‌.. చివరి మ్యాచ్‌లో మరింత దూకుడుగా ఆడాడు. ఫోర్లు, సిక్స్‌లతో ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోసిన అభిషేక్‌.. కేవలం 30 బంతుల్లోనే శతకం సాధించి భారత్‌కు భారీ స్కోరు అందించాడు. అనంతరం ఛేదనలో అఫ్గానిస్థాన్‌ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు.

వివరాలు

అఫ్గాన్‌పై భారత్‌ క్లీన్‌స్వీప్

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను టీమ్‌ఇండియా ఘనంగా ముగించింది.

అభిషేక్‌ శర్మ (108; 34 బంతుల్లో 9×4, 11×6) విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడటంతో.. గురువారం జరిగిన చివరిదైన మూడో టీ20లో భారత్‌ 127 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

అభిషేక్‌తో పాటు సంజు శాంసన్‌ (50; 35 బంతుల్లో 2×4, 4×6) కూడా రాణించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్గానిస్థాన్‌ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

భారత బౌలర్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి (3/25), రవి బిష్ణోయ్‌ (3/26), అక్షర్‌ పటేల్‌ (2/9) ధాటికి అఫ్గాన్‌ 14.1 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌటైంది.

వివరాలు

తేలిపోయిన అఫ్గాన్

భారీ లక్ష్య ఛేదనలో అఫ్గానిస్థాన్‌ ఆరంభం నుంచే తడబడింది. ఏ దశలోనూ భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయింది.

నాలుగో ఓవర్లో అక్షర్‌ పటేల్‌ వరుసగా గుర్బాజ్‌ (15), అటల్‌ (1)లను ఔట్‌ చేసి అఫ్గాన్‌కు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చాడు.

ఆ తర్వాత అఫ్గానిస్థాన్‌ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రసూలి (1)ని జస్‌ప్రీత్‌ బుమ్రా ఔట్‌ చేయగా.. ఇబ్రహీం జాద్రాన్‌ను యశ్‌ ఠాకూర్‌ పెవిలియన్‌కు పంపాడు.

దీంతో ఆరో ఓవర్‌ ముగిసే సమయానికి అఫ్గాన్‌ 47/4తో నిలిచింది. అప్పటికే ఆ జట్టు ఓటమి దాదాపు ఖాయమైంది. ఆ తర్వాతి ఆట అంతా ఓటమి అంతరాన్ని తగ్గించుకునే ప్రయత్నంగానే సాగింది.

ADVERTISEMENT

వివరాలు

దంచేసిన భారత్

నితీశ్‌ కుమార్‌ రెడ్డి, రవి బిష్ణోయ్‌ చకచకా వికెట్లు తీస్తూ అఫ్గానిస్థాన్‌ పతనాన్ని మరింత వేగవంతం చేశారు. చివరి ఆరు వికెట్లు వీరిద్దరి ఖాతాలోనే చేరాయి.

భారత్‌ సాధించిన 221/7 స్కోరు భారీదే. అయితే ఆరంభంలో టీమ్‌ఇండియా చూపించిన దూకుడును చూస్తే ఈ స్కోరు ఇంకా ఎక్కువగా ఉండాల్సిందని అనిపించింది.

అభిషేక్‌ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో తొలి 10 ఓవర్లలో పరుగుల వరద పారించిన భారత్‌.. ఇన్నింగ్స్‌ ద్వితీయార్ధంలో మాత్రం కాస్త ఊపు కోల్పోయింది.

సిరీస్‌లో తొలిసారి భారత్‌ మొదట బ్యాటింగ్‌ చేసింది. ఈ అవకాశాన్ని అభిషేక్‌ శర్మ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆకాశమే హద్దుగా అతడు చెలరేగాడు.

ADVERTISEMENT

వివరాలు

తొలి వికెట్ కు 142 పరుగుల భాగస్వామ్యం

సంజు శాంసన్‌తో కలిసి తొలి వికెట్‌కు కేవలం 59 బంతుల్లోనే 142 పరుగులు జోడించి భారత్‌కు సంచలన ఆరంభాన్ని అందించాడు.

అభిషేక్‌కు సంజు శాంసన్‌ కూడా చక్కటి సహకారం అందించాడు. ముజీబ్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన శాంసన్‌.. నబి ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు.

ఓపెనర్ల జోరుతో భారత్‌ నాలుగో ఓవర్లోనే 50 పరుగుల మార్కును అందుకుంది. ఆ తర్వాత 6 ఓవర్లు పూర్తయ్యేసరికి స్కోరు 100కు చేరింది.

అయితే పదో ఓవర్లో అభిషేక్‌ శర్మ ఔట్‌ కావడంతో భారత్‌ భారీ భాగస్వామ్యానికి తెరపడింది.

ఆ తర్వాత పరుగుల వేగం గణనీయంగా తగ్గింది. తిలక్‌ వర్మ(2)రనౌట్‌ కాగా.. 34 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న సంజు శాంసన్‌ 14వ ఓవర్లో వెనుదిరిగాడు.

వివరాలు

అభిషేక్‌ బాదుడు.. హైలైట్స్‌ చూసినట్టే!

ఆ తర్వాతి బ్యాటర్లలో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (29; 20 బంతుల్లో 2×6) ఒక్కడే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫలితంగా భారత్‌ చివరి 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 79 పరుగులు మాత్రమే చేసింది.

భారత్‌ ఇన్నింగ్స్‌లో అభిషేక్‌ శర్మ విధ్వంసకర శతకమే ప్రధాన హైలైట్‌గా నిలిచింది.

టాస్‌ గెలిచి భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించినందుకు అఫ్గానిస్థాన్‌ తీవ్రంగా విచారించేలా చేశాడు ఈ ఓపెనర్‌.

అతడి బ్యాటింగ్‌ చూస్తుంటే లైవ్‌ మ్యాచ్‌ చూస్తున్నామా? లేక హైలైట్స్‌ చూస్తున్నామా? అనేంతలా సాగింది. అభిషేక్‌ చేసిన 108 పరుగుల్లో 102 పరుగులు ఫోర్లు, సిక్స్‌ల ద్వారానే వచ్చాయి.

దీన్నిబట్టి అతడు ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు.

వివరాలు

16 బంతుల్లో హాఫ్ సెంచరీ

రెండో ఓవర్లో అజ్మతుల్లా బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌ బాదిన అభిషేక్‌.. ఫారూఖీ బౌలింగ్‌లో వరుసగా 6, 6, 6, 4తో విరుచుకుపడ్డాడు.

తర్వాత నబి ఓవర్లో వరుసగా 6, 4, 6 కొట్టాడు. ఈ క్రమంలో కేవలం 16 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

అభిషేక్‌ అర్ధశతకం నుంచి శతకానికి చేరుకోవడానికి కేవలం మరో 14 బంతులు మాత్రమే తీసుకున్నాడు.

అర్ధశతకం పూర్తి చేసిన తర్వాత కూడా అతడి దూకుడు ఏమాత్రం తగ్గలేదు.

అఫ్గానిస్థాన్‌ బౌలర్లను పూర్తిగా నిస్సహాయులుగా మార్చేశాడు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6 బాదిన అభిషేక్‌.. మరో స్పిన్నర్‌ ముజీబ్‌ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టాడు.

వివరాలు

టీ20ల్లో అభిషేక్‌ శర్మకు ఇది మూడో శతకం

శతకం పూర్తయ్యాక కూడా రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో మరో సిక్స్‌ బాదాడు. చివరకు రషీద్‌ బౌలింగ్‌లోనే అభిషేక్‌ ఔటవడంతో అతడి విధ్వంసానికి తెరపడింది.

దీంతో వాన వెలిసినట్లుగా భారత్‌ ఇన్నింగ్స్‌ వేగం కూడా తగ్గింది. అభిషేక్‌ శర్మ శతకం కోసం కేవలం 30 బంతులు మాత్రమే ఆడాడు.

దీంతో టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన శాశ్వత సభ్య దేశం బ్యాటర్‌గా అతడు రికార్డు సృష్టించాడు.

ఇంతకుముందు న్యూజిలాండ్‌ బ్యాటర్‌ ఫిల్‌ అలెన్‌ దక్షిణాఫ్రికాపై, జింబాబ్వే బ్యాటర్‌ సికందర్‌ రజా గాంబియాపై 33 బంతుల్లో శతకాలు సాధించారు.

వీరిద్దరి పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును అభిషేక్‌ బద్దలు కొట్టాడు.

వివరాలు

ఫాస్టెస్ట్‌ సెంచరీ నమోదు

అలాగే భారత్‌ తరఫున టీ20ల్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ సాధించిన బ్యాటర్‌గానూ అభిషేక్‌ నిలిచాడు. గతంలో ఈ రికార్డు 35 బంతుల్లో శతకం సాధించిన రోహిత్‌ శర్మ పేరిట ఉంది.

మొత్తంగా అంతర్జాతీయ టీ20ల్లో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఈ జాబితాలో ప్రపంచ రికార్డు ఎస్తోనియాకు చెందిన సాహిల్‌ చౌహాన్‌ పేరిట ఉంది.

అతడు సైప్రస్‌పై కేవలం 27 బంతుల్లోనే శతకం సాధించాడు. తుర్కియే బ్యాటర్‌ ఫహాద్‌ బల్గేరియాపై 29 బంతుల్లో సెంచరీ చేసి రెండో స్థానంలో ఉన్నాడు.

ADVERTISEMENT