MS Subbulakshmi Biopic: తెరపైకి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితగాథ.. కమల్ హాసన్ చేతుల మీదుగా బయోపిక్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
భారతరత్న, ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత విశేషాలు త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానున్నాయి. ఆమె 110వ జయంతిని పురస్కరించుకుని ఈ బయోపిక్‌ను చెన్నైలో అధికారికంగా ప్రారంభించారు. 'ఎం.ఎస్: ఎ లెగసీ ఆన్ స్క్రీన్' (MS: A Legacy on Screen) అనే టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రను ప్రముఖ నటి రష్మిక మందన్న పోషించనున్నారు. 'జెర్సీ' తదితర చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.
వివరాలు
కమల్ హాసన్ తొలి క్లాప్
చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో జరిగిన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన తొలి క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి నిజమైన పాన్-ఇండియా సూపర్‌స్టార్ అని పేర్కొన్నారు.
తన గాన మాధుర్యంతో ఆమె దేశ ప్రజలను ఏకం చేశారని కొనియాడారు. సుబ్బులక్ష్మి వంటి మహోన్నత వ్యక్తి పాత్రను పోషించడం గొప్ప బాధ్యతతో కూడుకున్న విషయమని అన్నారు.
వివరాలు
రష్మికకు కమల్ ధైర్యం
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక నటించడం అనేది మైఖేల్ జాక్సన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి పాత్రను పోషించడంతో సమానమని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.
ఈపాత్రను పోషిస్తున్నరష్మికపై ఎంతో బాధ్యత ఉందని చెబుతూ ఆమెకు ప్రోత్సాహాన్ని అందించారు.
ఈఅవకాశం లభించడం పట్ల రష్మిక మందన్న కృతజ్ఞతలు తెలిపారు.ఎం.ఎస్. సుబ్బులక్ష్మి దైవిక స్వరానికి ఈ చిత్రం అందించే గౌరవంగా తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్,రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రాక్‌లైన్ వెంకటేశ్,బన్నీవాస్ వర్క్స్ పతాకంపై బన్నీవాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
త్వరలోనే ఇతర నటీనటుల వివరాలతో పాటు సినిమా విడుదల తేదీని కూడా వెల్లడిస్తామని చిత్ర బృందం తెలిపింది.