Loading...
Andhra Pradesh: రూ.5,912 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌.. 14 ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతి
రూ.5,912 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌.. 14 ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతి

Andhra Pradesh: రూ.5,912 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌.. 14 ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

పట్టణాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ (యూసీఎఫ్‌) రెండో దశలో చేపట్టనున్న 14 ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం మొత్తం రూ.5,912 కోట్లు. ఇందులో 25 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌గా అందించనుంది. మరో 50 శాతం నిధులను మున్సిపల్‌ బాండ్లు, పీపీపీ విధానం ద్వారా సమీకరించనున్నారు. మిగిలిన 25 శాతం నిధులను పట్టణ స్థానిక సంస్థలు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలు 

ప్రధాన ప్రతిపాదనలు ఇవే..

అమరావతి ఎకనమిక్‌ రీజియన్‌ పరిధిలోని 25 పట్టణ స్థానిక సంస్థల్లో మురుగునీటి, వరదనీటి కాలువల నిర్మాణ పనులకు రూ.1,800 కోట్లు ప్రతిపాదించారు.

తిరుపతి ఎకనమిక్‌ రీజియన్‌లోని 23 పట్టణ స్థానిక సంస్థల్లో మురుగు, వరదనీటి కాలువల నిర్మాణానికి రూ.1,231 కోట్లు కేటాయించాలని సూచించారు.

విశాఖపట్నం ఎకనమిక్‌ రీజియన్‌ పరిధిలోని 11 పట్టణ స్థానిక సంస్థల్లో ఇదే తరహా పనులకు రూ.867.70 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

విజయవాడలో వరదనీటి కాలువల నిర్మాణానికి రూ.600 కోట్లు ప్రతిపాదించారు.

నగర శివారు ప్రాంతాల్లో నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు స్కాడా వ్యవస్థ ఏర్పాటు కోసం మరో రూ.300 కోట్లు కేటాయించాలని సూచించారు.

తాడిగడపలో నీటి సరఫరా సమస్యను పరిష్కరించేందుకు రూ.150 కోట్లతో పనులు చేపట్టాలని ప్రతిపాదించారు.

వివరాలు 

ప్రధాన ప్రతిపాదనలు ఇవే..

నెల్లూరులో పరిశ్రమలకు శుద్ధి చేసిన మురుగునీటిని అందించే ప్రాజెక్టు కోసం రూ.200 కోట్లు ప్రతిపాదించారు.

అలాగే, మురుగునీటి కాలువల నిర్మాణానికి మరో రూ.130 కోట్లు కేటాయించాలని సూచించారు.

రాజమహేంద్రవరంలో రెండు ప్రాంతాల్లో మల్టీలెవల్‌ కార్‌ పార్కింగ్‌ సదుపాయాలు, గోదావరి రివర్‌ ఫ్రంట్‌, మల్టీ ఫంక్షనల్‌ కమర్షియల్‌ హబ్‌ను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు రూ.240 కోట్లు ప్రతిపాదించారు.

గుంటూరులో మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి రూ.300 కోట్లు కేటాయించాలని సూచించారు.

పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్‌ను పీపీపీ విధానంలో నిర్మించేందుకు రూ.118 కోట్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు మరో రూ.53.65 కోట్లు ప్రతిపాదించారు.

ADVERTISEMENT

వివరాలు 

పట్టణ స్థానిక సంస్థలదే నిధుల బాధ్యత

యూసీఎఫ్‌ రెండో దశలో చేపట్టనున్న ప్రాజెక్టుల అంచనా వ్యయంలో పట్టణ స్థానిక సంస్థలు తమ వాటా నిధులను సమకూర్చుకోవాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. అవసరమైన రుణాలను సమీకరించే బాధ్యతను కూడా అవే చేపట్టాలని పేర్కొంది.

ఇప్పటికే తొలి దశలో నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం

అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ తొలి దశలో విశాఖపట్నం, తాడేపల్లి-మంగళగిరి నగరపాలక సంస్థల్లో నాలుగు ప్రాజెక్టులకు ఇప్పటికే ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.1,990.83 కోట్లు.

ADVERTISEMENT