Mackenzie Kaifiyats: మీ ఊరి సరిహద్దుల నుంచి పన్నుల వరకు.. కైఫీయత్‌లలో సమగ్ర సమాచారం
ఈ వార్తాకథనం ఏంటి
మీ ఊరి పేరు ఎలా వచ్చింది? ఒకప్పుడు ఆ గ్రామాన్ని ఎవరు పాలించారు? అక్కడి దేవాలయాలను ఎవరు నిర్మించారు? వాటి నిర్వహణకు భూములను ఎవరు దానం చేశారు? ఇలాంటి వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే మెకంజీ కైఫీయత్‌లను వెతకండి. అందులో మీ గ్రామానికి సంబంధించిన సమాచారం కూడా ఉండొచ్చు. వాటి ద్వారా మీ ఊరి పూర్వ చరిత్రను తెలుసుకునే అవకాశం ఉంది. అయితే కైఫీయత్‌లను చదవడం అంత సులభం కాదు. చాలా వరకు అవి గ్రాంథిక భాషలో ఉంటాయి. కొన్ని కైఫీయత్‌లలో సంస్కృత శ్లోకాలు,మరికొన్నింటిలో తెలుగు పద్యాలు కూడా కనిపిస్తాయి. ఆన్‌లైన్‌లో 'కైఫీయత్‌లు' అని వెతికితే వీటికి సంబంధించిన విస్తృత సమాచారం అందుబాటులోకి వస్తుంది.
వివరాలు
కైఫీయత్ అంటే ఏమిటి?
ఇందులో 17, 18వ శతాబ్దాల్లో రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు గ్రామాల చరిత్ర ఇందులో నమోదైంది.
'కైఫీయత్' అనే పదానికి మూలం అరబిక్ భాషలోని 'కైఫ్' అనే పదం. అరబిక్‌లో 'కైఫ్' అంటే 'పరిస్థితి ఏంటి?' అనే అర్థం వస్తుంది.
ఆ తర్వాత ఈ పదం ఉర్దూ, పర్షియన్ భాషల్లోకి చేరింది. కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీ, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనా కాలాల్లో గ్రామ కరణాలు రాసిన గ్రామ వివరాల నివేదికలు, దండకవిలెలను కైఫీయత్‌లుగా పిలిచేవారు.
ఒక గ్రామానికి సంబంధించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ సమాచారాన్ని సమగ్రంగా క్రోడీకరించి రాసిన ప్రధాన రికార్డు పుస్తకమే గ్రామ కైఫీయత్.
వివరాలు
కైఫీయత్‌లలో ఏముంటుంది?
గ్రామ కరణాలు తరతరాలుగా నమోదు చేసిన చరిత్ర ఇందులో కనిపిస్తుంది. తాటి ఆకులపై ఘటంతో రాసి, కట్టలుగా కట్టిన తాళపత్ర గ్రంథాలు కూడా వీటిలో ఉన్నాయి.
సాధారణ చరిత్ర పుస్తకాలు ప్రధానంగా రాజ్యాలు, రాజులు, అప్పటి రాజకీయ పరిస్థితుల గురించి వివరిస్తాయి.
అయితే దండకవిలెలు, గ్రామ కైఫీయత్‌లు మాత్రం గ్రామీణ ప్రజల జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు, నాటి న్యాయ వ్యవస్థ, సామాజిక ఆచారాలు, సంస్కృతికి సంబంధించిన వివరాలను అందిస్తాయి.
వివరాలు
గ్రామ కైఫీయత్‌లలో సాధారణంగా ఈ అంశాలు నమోదై ఉంటాయి:
గ్రామ సరిహద్దులు, చెరువులు, కాలువలు, బీడు భూములు, వ్యవసాయ భూముల వివరాలు. గ్రామంలో వసూలు చేసిన పన్నులు, అప్పటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన సమాచారం. గ్రామాన్ని ఎప్పుడు, ఎవరు పాలించారు అనే వివరాలు. ఆయా కాలాల్లో జారీ చేసిన రాగి రేకుల శాసనాల ప్రస్తావనలు. గ్రామంలోని వృత్తులు, జాతరలు, సామాజిక ఆచారాలు. దేవాలయాల నిర్మాణం, వాటికి కేటాయించిన లేదా దానం చేసిన భూముల వివరాలు. కరవు కాటకాలు, దండయాత్రలు, ఇతర ముఖ్యమైన సంఘటనల నమోదు.
అందువల్ల గ్రామ కైఫీయత్‌లు కేవలం పాలకుల చరిత్రను మాత్రమే కాకుండా.. నాటి ప్రజల జీవన విధానాన్ని, గ్రామాల అభివృద్ధిని, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి.
వివరాలు
రూపకల్పనలో మెకంజీ కీలక పాత్ర
ఈ కైఫీయత్‌లను సేకరించి, వాటి ఆధారంగా సమాచారాన్ని నమోదు చేయించడంలో ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున బ్రిటిష్ పాలనలో భారతదేశ తొలి సర్వేయర్ జనరల్‌గా పనిచేసిన కల్నల్ కొలిన్ మెకంజీ కీలక పాత్ర పోషించారు.
తెలుగు పండితుల సహకారంతో వేల సంఖ్యలో ఉన్న తాళపత్ర దండకవిలెలను పరిశీలించి, వాటిలోని సమాచారాన్ని నమోదు చేయించారు.
ఈ చారిత్రక ఆధారాలను భద్రపరచడంలో, తాళపత్రాలపై ఉన్న సమాచారాన్ని కాగితాలపైకి తీసుకురావడంలో భాషావేత్త సీపీ బ్రౌన్ కూడా ముఖ్యమైన సేవలు అందించారు.
వివిధ జిల్లాలకు చెందిన గ్రామ కైఫీయత్‌లను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ శాఖ ముద్రించింది.
వీటిలో అప్పటి ఉమ్మడి జిల్లాల్లోని గ్రామాల వివరాలు పొందుపరిచారు. ఈ పుస్తకాల్లో జిల్లాల వారీగా విభాగాలు ఉన్నాయి.
వివరాలు
వట్టిచెరుకూరు భూములకు లభించిన పరిష్కారం
కైఫీయత్‌లను ఆధారంగా చేసుకుని గ్రామాల వారీ చరిత్రను వికీపీడియాలోనూ నమోదు చేశారు. ఈ ప్రక్రియలో యర్రా రామారావు కీలక పాత్ర పోషించారు.
గ్రామ కైఫీయత్‌లు కేవలం చరిత్ర తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా.. కొన్ని సందర్భాల్లో ప్రస్తుత సమస్యలకు పరిష్కారం చూపే ఆధారాలుగానూ ఉపయోగపడుతున్నాయి.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ఇందుకు ఒక ఉదాహరణ కనిపించింది. ఆ గ్రామంలో ఇళ్ల స్థలాలు గ్రామకంఠం పరిధిలోనే ఉన్నప్పటికీ.. అధికారులు వాటిని 22ఎ నిషేధిత జాబితాలో చేర్చారు.
వివరాలు
వట్టిచెరుకూరు భూములకు లభించిన పరిష్కారం
ఆ భూములను ఆ జాబితా నుంచి తొలగించాలని గ్రామస్థులు 120 ఏళ్లకు పైగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది.
అయితే 1722 సంవత్సరంలోనే వట్టిచెరుకూరులో గ్రామం ఉన్నట్లు కైఫీయత్‌ల ద్వారా వెల్లడైంది.
ఈ చారిత్రక ఆధారాలను పరిశీలించిన ప్రభుత్వం ఇటీవల ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించింది. దీంతో అక్కడి ప్రజలకు ఊరట లభించింది.