Loading...
Andhra Pradesh: పేదలకు గుడ్‌న్యూస్‌.. 3,034 గ్రామాల్లో 1.25 లక్షల మందికి ఇళ్లస్థలాలు
పేదలకు గుడ్‌న్యూస్‌.. 3,034 గ్రామాల్లో 1.25 లక్షల మందికి ఇళ్లస్థలాలు

Andhra Pradesh: పేదలకు గుడ్‌న్యూస్‌.. 3,034 గ్రామాల్లో 1.25 లక్షల మందికి ఇళ్లస్థలాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2026
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్లస్థలం లేని పేదలకు కొత్తగా ఇంటి స్థలాలు కేటాయించేందుకు రెవెన్యూ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటివరకు అందిన దరఖాస్తులను పరిశీలించి, విచారణ పూర్తిచేసిన అనంతరం 1,24,873మందికి కొత్తగా ఇళ్లస్థలాలు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబానికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున స్థలాలు కేటాయించాలంటే మొత్తం 4,800 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని రెవెన్యూ శాఖ తేల్చింది. ఇందుకోసం సుమారు రూ.1,800 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. నవంబరు నుంచి భూసేకరణ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఇళ్లస్థలాలు లేని పేదల వివరాలను కూడా సేకరించి, అర్హుల జాబితాను రూపొందించనున్నారు.

వివరాలు

41 శాతం దరఖాస్తులు తిరస్కరణ

ఇళ్లస్థలాల కోసం రెవెన్యూ శాఖ ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 4,59,051 మంది దరఖాస్తు చేసుకున్నారు.

వీటిలో 1,43,496 మందిని అర్హులుగా, 1,88,861 మందిని అనర్హులుగా అధికారులు నిర్ధారించారు. దీంతో మొత్తం దరఖాస్తుల్లో 41 శాతం తిరస్కరణకు గురయ్యాయి.

కొన్ని జిల్లాల్లో తిరస్కరించిన దరఖాస్తుల శాతం 50కి పైగానే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మరో 1,26,694 దరఖాస్తులపై విచారణ జరపాల్సి ఉంది.

వివరాలు

వైసీపీ హయాంలో లోతట్టు ప్రాంతాల్లో భూముల సేకరణ

వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్కో సెంటు చొప్పున ఇళ్లస్థలాలు పంపిణీ చేసేందుకు భూములను సేకరించారు.

అయితే వాటిలో చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల్లో ఉండటంతో, ఇళ్ల నిర్మాణానికి అనువుగా మార్చేందుకు మెరక తోలాల్సి వస్తోంది.

ఇందుకు పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుండటంతో, ఆ భూములను అభివృద్ధి చేయడం కంటే కొత్తగా భూములను సేకరించడమే మేలనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది.

ఇప్పటికే ఇళ్ల పట్టాలు పొందిన వారిలో చాలామంది ఆయా స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా లేరు. అలాంటి వారు కోరితే ప్రస్తుతం ఇచ్చిన పట్టాలను రద్దుచేసి, కొత్తగా స్థలాలను కేటాయించనున్నారు.

ADVERTISEMENT

వివరాలు

పరిహారాన్ని ఇంకా చెల్లించలేదు

మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లస్థలాల కోసం భూములను సేకరించినప్పటికీ, వాటికి సంబంధించిన పరిహారాన్ని ఇంకా చెల్లించలేదు.

అలాంటి భూముల్లో నిర్మాణాలకు అనువైన వాటిని గుర్తించి, పరిహారం చెల్లించిన అనంతరం అర్హులైన పేదలకు స్థలాలు కేటాయించి, ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ల సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

అలాగే వైకాపా ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్లస్థలాల్లో 43,498 పట్టాలు అనర్హులకు ఇచ్చినట్లు గుర్తించారు.

దీంతో వాటిని రద్దు చేశారు. ప్రస్తుతం రద్దయిన ఆ స్థలాలను ఇతర అర్హులకు కేటాయించనున్నారు.

ADVERTISEMENT

వివరాలు

తొలివిడతలో 1.25 లక్షల మందికి స్థలాలు

రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లులేని పేదలు సుమారు 2.50 లక్షల మంది ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇప్పటివరకు అందిన దరఖాస్తులపై విచారణ పూర్తిచేసిన తర్వాత తొలివిడతలో 1.43 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే 2.56 లక్షల ప్లాట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

వీటిలో 1,692గ్రామాల్లోని స్థలాలను తీసుకునేందుకు 18,623మంది మాత్రమే అంగీకరించారు. దీంతో మిగిలిన 1,24,873 మందికి 3,034గ్రామాల్లో కొత్తగా భూములు సేకరించి ఇళ్లస్థలాలు ఇవ్వాల్సి ఉంటుంది.

భూసేకరణలో భాగంగా సగటున ఎకరాకు రూ.37.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు.

అక్టోబరు నాటికి అర్హుల తుది జాబితాను రూపొందించి, నవంబరు నుంచి భూసేకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు రెవెన్యూ శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

ADVERTISEMENT