Hyderabad: హీమోఫీలియా గర్భిణికి సురక్షిత ప్రసవం.. గాంధీ వైద్యుల అరుదైన ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ లో రక్తస్రావ లోపంతో బాధపడుతున్న ఓ గర్భిణికి సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి గాంధీ ఆసుపత్రి వైద్యులు తల్లీబిడ్డలను కాపాడారు. సాధారణంగా ఈ చికిత్సకు రూ.40 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉండగా.. వైద్యులు ఉచితంగా చికిత్స అందించారు. హీమోఫీలియా (ఫ్యాక్టర్-7 లోపం) వ్యాధితో బాధపడుతున్న గర్భిణికి ప్రసవ సమయం దగ్గరపడింది. ఈ వ్యాధి ఉన్న గర్భిణులకు ప్రసవం అత్యంత క్లిష్టమైనదని వైద్యులు తెలిపారు. ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరిగి హేమరేజ్ షాక్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో అవయవాలు విఫలమై ప్రాణాంతక పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితి పుట్టబోయే బిడ్డకూ ప్రాణాపాయంగా మారే ప్రమాదం ఉంటుంది.
వివరాలు
తల్లీబిడ్డ సురక్షితం
ఈ విషయం నేషనల్ హెల్త్ మిషన్, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో గర్భిణికి ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు.
ప్రసవ సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు ఫ్యాక్టర్-7 ఇంజక్షన్లతో పాటు అవసరమైన రక్త నిల్వలను ముందుగానే అందుబాటులో ఉంచారు.
ఈ ఏర్పాట్ల మధ్య శుక్రవారం గాంధీ ఆసుపత్రిలో గర్భిణికి విజయవంతంగా ప్రసవం నిర్వహించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
ఈ సందర్భంగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి చికిత్స పొందుతున్న బాలింతను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.