Vijayawada: బెజవాడ దుర్గమ్మ లడ్డూ.. కావాలా భక్తా? ఇక ఇలా పొందండి!
ఈ వార్తాకథనం ఏంటి
త్వరలో జరగనున్న కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం లడ్డూ ప్రసాదం అందించేందుకు ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. భక్తులు సులభంగా లడ్డూ ప్రసాదాన్ని పొందేలా ఈ యంత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ యంత్రాల ఏర్పాటుకు సంబంధించి కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు వివిధ సంస్థలతో సంప్రదింపులు జరిపి యంత్రాలను ఖరారు చేశారు. ఒక్కో యంత్రంలో రూ.100 విలువైన లడ్డూ పెట్టెలు 400 వరకు నిల్వ చేయవచ్చు.
వివరాలు
టచ్‌స్క్రీన్‌పై బాక్సుల సంఖ్య నమోదు
లడ్డూ ప్రసాదం తీసుకోవాలనుకునే భక్తులు ముందుగా యంత్రంపై ఉండే టచ్‌స్క్రీన్‌లో తమకు కావాల్సిన లడ్డూ బాక్సుల సంఖ్యను నమోదు చేయాలి.
అనంతరం నగదు చెల్లింపునకు బదులుగా యూపీఐ ఆప్షన్‌ను ఎంచుకుంటే.. యంత్రంపై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
ఆ క్యూఆర్ కోడ్‌ను మొబైల్ ఫోన్‌తో స్కాన్ చేసి డబ్బులు చెల్లించాలి. చెల్లింపు పూర్తయిన తర్వాత యంత్రంలోని కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చే ప్రసాదం బాక్సులను భక్తులు తీసుకోవచ్చు.
వివరాలు
రైల్వేస్టేషన్, బస్టాండ్, ఆలయం వద్ద ఏర్పాటు
భక్తులకు సులభంగా అందుబాటులో ఉండేలా ఈ లడ్డూ ప్రసాదం యంత్రాలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు.
రైల్వేస్టేషన్, బస్టాండ్ పరిసరాలతో పాటు ఆలయంలోని క్యూలైన్ల సమీపంలోనూ వీటిని అందుబాటులో ఉంచనున్నారు.
దీంతో ఉత్సవాలకు వచ్చే భక్తులు క్యూలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా లడ్డూ ప్రసాదాన్ని పొందే అవకాశం ఉంటుంది.