Epic Movie Review Telugu: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య 'ఎపిక్' ఎలా ఉంది?
ఈ వార్తాకథనం ఏంటి
'బేబీ' సినిమాతో హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ఇక '#90s' వెబ్ సిరీస్‌తో ట్రెండ్ సృష్టించారు దర్శకుడు ఆదిత్య హాసన్. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో రూపొందిన న్యూ ఏజ్ లవ్ డ్రామా 'ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్'. మరి ఈ శుక్రవారం (Epic First Semester Movie Release Date) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది? తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే.
వివరాలు
కథేంటంటే..
'#90s - ఎ మిడిల్ క్లాస్ బయోపిక్'లో కుటుంబంలో అందరికంటే చిన్నవాడైన ఆదిత్య (ఆనంద్ దేవరకొండ) చుట్టూ ఈ కథ సాగుతుంది.
సినిమా దర్శకుడు కావాలనేది అతడి కల. చిత్ర పరిశ్రమలో స్థిరపడాలనే లక్ష్యంతో ప్రయత్నాలు చేస్తుంటాడు.
అయితే మధ్యతరగతి కుటుంబాల్లో కనిపించే ప్లాన్-బి ఆలోచనల్లో భాగంగా పైచదువుల కోసం లండన్ బయలుదేరతాడు.
అక్కడికి వెళ్లినా అతడి మనసు నిండా సినిమా ఆలోచనలే ఉంటాయి. తాను చేరిన విశ్వవిద్యాలయంలోనే తెలుగమ్మాయి కడలి (వైష్ణవి చైతన్య) పరిచయం అవుతుంది.
తొలి రోజే ఇద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. ఆ తర్వాత సహజీవనం చేస్తారు. వేర్వేరు నేపథ్యాలకు చెందిన ఆ ఇద్దరి మధ్య బంధం ఎక్కడివరకు వెళ్లింది?
వివరాలు
ఎలా ఉందంటే..
జీవితంలో ఇంకా స్థిరపడని ఆదిత్య ప్రేమ, పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? పెళ్లి చేసుకోవాలన్న తల్లిదండ్రుల ఒత్తిడికి కడలి తలొగ్గిందా? తదితర విషయాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
నవతరం ఆధునిక జీవనశైలిని, వారి మధ్య ఉండే బంధాలను, గందరగోళాలను, కుటుంబాల నుంచి, సమాజం నుంచి ఎదుర్కొంటున్న ఒత్తిళ్లను ఆవిష్కరించిన కథ ఇది.
దీన్ని కేవలం కథ అని చెప్పడం కంటే ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ప్రయాణంగా చెప్పడం సరైనదేమో అనిపిస్తుంది. చదువుల కోసం వెళ్లిన ఇద్దరి జీవితాన్ని దర్శకుడు తనదైన కోణంలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
ఆ జంటలో ప్రేక్షకులు తమను తాము చూసుకునేలా కొన్ని సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి.
వివరాలు
ఆసక్తికరంగా కథ
అయితే వాళ్లు తీసుకునే నిర్ణయాలు, వారిలో కనిపించే గందరగోళాలకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవ్వడం మాత్రం కష్టం.
దర్శకుడు ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి ప్రేమకథగా కానీ, సహజీవనానికి సంబంధించిన కథగా కానీ కాకుండా.. ఓ జంట ఎదుర్కొన్న వాస్తవ పరిస్థితుల్లా మలిచారు.
దాంతో సాధారణ సినిమా కథల్లో కనిపించే భిన్న పార్శ్వాలు, ఆసక్తిని రేకెత్తించే విరామం, సుఖాంతమైన ముగింపు ఈ సినిమాలో కనిపించవు.
తెరపై కనిపించే ప్రధాన జంట ప్రయాణంతో మమేకమై సినిమా చూస్తేనే సంతృప్తి లభిస్తుంది.
అదే దీన్ని ఓ కథలా చూడటం మొదలుపెడితే మాత్రం చాలావరకు సాగదీత వ్యవహారంలా అనిపిస్తుంది. అయితే ఈ కథలో దర్శకుడు ప్రస్తావించిన అంశాలు తక్కువేమీ కాదు.
వివరాలు
సినిమా సరదా సన్నివేశాలు
సమాజంలోని కులాల పట్టింపుల దగ్గర్నుంచి.. అమ్మాయిలు శారీరకంగా, సామాజికంగా ఎదుర్కొనే సమస్యలు, అబ్బాయిలు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల వరకు చాలా అంశాలను ఇందులో చూపించారు.
వాటన్నింటినీ దర్శకుడు పైపైనే స్పృశిస్తూ ఆలోచింపజేసే ప్రయత్నం చేశారు కానీ, ఏ ఒక్క అంశంలోనూ మరీ లోతుగా వెళ్లలేదు.
'#90s - ఎ మిడిల్ క్లాస్ బయోపిక్' ప్రపంచం నుంచే ఈ కథ మొదలవుతుంది. లెక్కల మాస్టర్ చంద్రశేఖర్ ఇల్లు, ఆ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే కష్టాలను పరిచయం చేస్తూనే ఆదిత్య కథలోకి తీసుకెళ్తుంది.
దర్శకుడు కావాలనుకునే ఆదిత్యను తండ్రి చీవాట్లు పెట్టడం, మరోవైపు స్నేహితులు ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపించడం వంటి సన్నివేశాలతో సినిమా సరదాగా సాగుతుంది.
ఆదిత్య లండన్‌లో అడుగుపెట్టిన తర్వాత మరింత సందడి మొదలవుతుంది.
వివరాలు
కామెడీ పండించిన కథానాయకుడు
నాయకానాయికల పరిచయం, తొలి రోజే ఒకే గదిని పంచుకోవడం, ఆ గదిని తనకు ఇచ్చిన స్నేహితుడు ఆ విషయం చూసి ఆశ్చర్యపోవడం వంటి సన్నివేశాలు, సంభాషణలు మంచి హాస్యాన్ని పంచుతాయి.
ఊళ్లో ఉన్న స్నేహితుడితో కథానాయకుడు మాట్లాడిన ప్రతిసారీ నవ్వులు పండుతాయి.
ప్రథమార్ధంలో అమ్మాయిలకు సొంత ఇంటి నుంచే ఎదురయ్యే ఒత్తిళ్లను అడ్రస్ చేయగా.. ద్వితీయార్ధంలో అబ్బాయిల 24 ఏళ్లు, అమ్మాయిల 24 ఏళ్లు ఒకటి కాదంటూ కుర్రాళ్ల సంఘర్షణను ప్రస్తావించిన తీరు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది.
తొలి అర్ధభాగంలో సినిమాలో ఎక్కువగా నవ్వులు పండితే.. మలిభాగంలో భావోద్వేగాల మోతాదు ఎక్కువగా ఉంటుంది.
వివరాలు
తన
అయితే నాయకానాయికల ప్రేమ ప్రయాణం, కథానాయకుడు తన తల్లిదండ్రులు, స్నేహితుడితో సంభాషించడం మినహా సినిమాలో మరో అంశం పెద్దగా ఉండదు.
దాంతో కథ మరీ పలచగా, అక్కడక్కడే తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. '#90s' సిరీస్ (90s Middle Class Biopic) ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుంది.
ఈ సినిమా మాత్రం పెద్దలు మాత్రమే చూసే అంశాలతో రూపొందింది. పతాక సన్నివేశాలు కూడా కథను అసంపూర్ణంగా చెప్పిన భావనను కలిగిస్తాయి.
ఇందులోని చాలా సన్నివేశాలు 'సఖి', 'ఓకే బంగారం' వంటి సినిమాలను గుర్తు చేస్తుంటాయి.
వివరాలు
ఎవరెలా చేశారంటే..
ఆదిత్య, కడలి పాత్రల్లో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జీవించారు. ఇద్దరి నటనలోనూ పరిణతి కనిపిస్తుంది.
సహజంగానే ఆనంద్ దేవరకొండ అమాయకత్వం నిండిన పాత్రల్లో కనిపిస్తుంటారు. ఇందులో ఆ మోతాదు మరీ ఎక్కువ.
ప్రతి సన్నివేశంలోనూ సహజమైన నటనను ప్రదర్శించారు. 'బేబీ' (Baby Movie) తర్వాత అంతకుమించిన గాఢత ఉన్న కడలి పాత్రలో వైష్ణవి చైతన్య ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది.
ఆమె ఇందులో మరింత అందంగా కనిపించారు. కథానాయకుడి తల్లిదండ్రులుగా శివాజీ, వాసుకి పోషించిన పాత్రలు సినిమాకు కీలకం.
వారి సన్నివేశాలు పరిమితంగానే ఉన్నప్పటికీ.. సినిమాపై బలమైన ప్రభావం చూపిస్తాయి.
దర్శకుడు కల్యాణ్ శంకర్ కథానాయకుడి స్నేహితుడైన సింజిత్ పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్ర తెరపై కనిపించిన ప్రతిసారీ నవ్వులు పండుతాయి.
వివరాలు
సాంకేతిక విభాగాలు..
సాంకేతిక విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. హేషమ్ పాటలు, నేపథ్య సంగీతం, అజీమ్ మహమ్మద్ విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు ఆదిత్య హాసన్ (Epic First Semester Movie Director) కథను నడిపించిన తీరులోనూ, ఆయన మలిచిన సన్నివేశాల్లోనూ సినిమాకు తగ్గ వేగం కనిపించలేదు.
రెండు సెమిస్టర్లుగా కథను చెప్పాలనే ప్రయత్నంలో కథను పరిపూర్ణంగా చెప్పలేకపోయారేమో అనిపిస్తుంది.
అయితే ఆయన రాసిన సంభాషణలు మాత్రం చాలా బాగున్నాయి.
వివరాలు
బలాలు
ప్రథమార్థం
హాస్యం
నటీనటుల
యాక్టింగ్
బలహీనతలు
సాగదీత సన్నివేశాలు
అసంపూర్ణంగా అనిపించే కథ