Loading...
Asia Cup: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్‌.. ఆసియా కప్‌ ఫైనల్లోకి టీమిండియా
బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్‌.. ఆసియా కప్‌ ఫైనల్లోకి టీమిండియా

Asia Cup: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్‌.. ఆసియా కప్‌ ఫైనల్లోకి టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 11, 2026
09:21 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల ఆసియా కప్‌ 2026లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. దుబాయ్‌ వేదికగా జరిగిన సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత ఓపెనర్‌ షఫాలీ వర్మ (64) అద్భుత హాఫ్‌ సెంచరీతో చెలరేగగా.. ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

వివరాలు

భారత బౌలర్ల ధాటికి బంగ్లా బ్యాటర్లు విలవిల

150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు. ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ బంగ్లా బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు.

భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్‌ బ్యాటర్లలో ఎవరూ క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయారు. బంగ్లాదేశ్‌ తరఫున షోర్నా అక్తర్‌ (22*) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్‌ పతనాన్ని శాసించగా.. నందని శర్మ రెండు వికెట్లు తీసుకుంది.

దీంతో బంగ్లాదేశ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. 40 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించిన టీమిండియా.. ఈ విజయంతో ఆసియా కప్‌ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

వివరాలు

షఫాలీ వర్మ విధ్వంసక బ్యాటింగ్

అంతకుముందు టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

ఓపెనర్‌ స్మృతి మంధాన కేవలం 2 పరుగులకే వికెట్‌ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ తనదైన శైలిలో బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగింది.

బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు సాధించింది. కేవలం 40 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 పరుగులు చేసి భారత జట్టు భారీ స్కోరుకు బాటలు వేసింది. ఆమెకు జతగా ప్రతిక రావల్‌ 20 పరుగులతో రాణించింది.

చివర్లో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (24*), రిచా ఘోష్‌ (21), దీప్తి శర్మ (13) వేగంగా పరుగులు సాధించారు.

ADVERTISEMENT

వివరాలు

ఫైనల్లో ఎవరితో?

దీంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగుల మంచి స్కోరును నమోదు చేసింది.

ఆసియా కప్‌లో ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకున్న టీమిండియా.. రెండో సెమీఫైనల్‌ ఫలితం కోసం ఎదురుచూడనుంది.

రేపు (సెప్టెంబరు 11) జరిగే రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్‌, శ్రీలంక తలపడనున్నాయి.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించే జట్టుతో ఆదివారం జరిగే ఫైనల్లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.

ADVERTISEMENT