Hyderabad: రైల్వే మార్గంలో సాంకేతిక లోపం.. నిలిచిపోయిన ఇంటర్‌సిటీ రైలు
ఈ వార్తాకథనం ఏంటి
సాంకేతిక లోపం కారణంగా ఆదివారం రాత్రి పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మల్కాజిగిరి ఆర్పీఎఫ్ సీఐ సంజీవరావు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలి, లాలాగూడ, సీ-క్యాబిన్ మార్గంలోని ఓహెచ్ (ఓవర్ హెడ్ ఇంజిన్) వైర్లలో విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. దీంతో రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఓహెచ్ వైరు తెగిపడింది. ఈ ఘటనతో విజయవాడ నుంచి లింగంపల్లికి వస్తున్న ఇంటర్‌సిటీ రైలు నగరంలోని ఆలుగడ్డ బావి వద్ద నిలిచిపోయింది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే పలు రైళ్లపైనా దీని ప్రభావం పడింది. ఓహెచ్ వైరు దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోగా.. సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. అర్ధరాత్రి దాటే సమయానికి ఓహెచ్‌ను సిబ్బంది సరిచేసి, రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు.
వివరాలు
చీకట్లో 1.5 కి.మీ. నడిచిన ప్రయాణికులు
రైలు ఎంతకీ కదలకపోవడంతో కొందరు ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. దీంతో వారు రోడ్డు మార్గంలో నగరంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
సుమారు కిలోమీటరున్నర దూరం చీకట్లో, చెట్ల మధ్య నడుచుకుంటూ వెళ్లి బస్సులు రాకపోకలు సాగించే ప్రాంతానికి చేరుకున్నారు.
అక్కడి నుంచి బస్సుల్లో తమ గమ్యస్థానాలకు బయల్దేరారు. అయితే లగేజీతో ఉన్నవారు, పిల్లలతో ప్రయాణిస్తున్నవారు, వృద్ధులు మాత్రం రైలును వదిలి వెళ్లలేకపోయారు.
వారు రైలులోనే ఉండి ఓహెచ్ మరమ్మతులు పూర్తయ్యే వరకు వేచి చూశారు. మరమ్మతులు పూర్తయిన అనంతరం రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.