Godavari: తగ్గుముఖం పట్టిన గోదావరి వరద.. ధవళేశ్వరం వద్ద ఇంకా అప్రమత్తత
ఈ వార్తాకథనం ఏంటి
ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి నది క్రమంగా తగ్గుముఖం పడుతోంది. భద్రాచలం వద్ద ఆదివారం నుంచే వరద తగ్గడం ప్రారంభమైనప్పటికీ, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రభావం కొనసాగింది. ఆదివారం ఉదయం 8 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 15 అడుగులకు చేరగా, అక్కడి నుంచి గరిష్ఠంగా 14.61 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఇదే స్థాయిలో కొనసాగిన వరద, ఆ తర్వాత క్రమంగా తగ్గింది.
వివరాలు
తొలి ప్రమాద హెచ్చరికలు జారీ
రాత్రి 11 గంటలకు నీటిమట్టం 14.40 అడుగులకు చేరగా, 13.67 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
అధికారుల సమాచారం ప్రకారం, అర్ధరాత్రి తర్వాత ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను, సోమవారం ఉదయానికి తొలి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించే అవకాశం ఉంది.
మరోవైపు భద్రాచలం వద్ద వరద వేగంగా తగ్గడంతో అక్కడ అమల్లో ఉన్న మూడు ప్రమాద హెచ్చరికలను పూర్తిగా ఉపసంహరించారు.
వివరాలు
పోలవరం జిల్లాలో 72 గ్రామాలపై వరద ప్రభావం
గోదావరి, శబరి నదులు ఆదివారం వరకు ఉద్ధృతంగా ప్రవహించడంతో పోలవరం జిల్లాలోని కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక, చింతూరు మండలాల్లోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
నాలుగు మండలాల్లోని 44 రహదారులపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రభావంతో మొత్తం 72 గ్రామాలు, 44 ఆవాసాలు ముంపులో చిక్కుకున్నాయి.
12,499 కుటుంబాలకు చెందిన 32,180 మంది వరద ప్రభావానికి గురయ్యారు. 971 ఇళ్లు నీటమునిగాయి.
భద్రతా చర్యల్లో భాగంగా 750 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించగా, 149 మంది గర్భిణులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సామాజిక ఆసుపత్రులకు తరలించారు.
వరద ధాటికి వీఆర్‌పురం మండలంలో 13, కూనవరం మండలంలో 8, చింతూరులో 3, ఎటపాకలో 3 రహదారులు దెబ్బతిన్నాయి.
వివరాలు
చింతూరు పరిసరాల్లో ముంపు నీరు తగ్గుముఖం
ఆదివారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.10 అడుగులు, చింతూరు వద్ద శబరి నది నీటిమట్టం 37.60 అడుగులుగా నమోదైంది.
సాయంత్రం 3 గంటల నుంచి గ్రామాల్లోని ముంపు నీరు తగ్గడం ప్రారంభమైందని, అర్ధరాత్రి నాటికి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే అవకాశముందని చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొక్వాల్ తెలిపారు.
వివరాలు
జలదిగ్బంధంలోనే కోనసీమ లంక గ్రామాలు
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం రాత్రి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం చేరడంతో దాని ప్రభావం ఆదివారం ఉదయం నుంచి అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలపై పడింది.
జిల్లాలో 22 రహదారులు ముంపునకు గురయ్యాయి.
అయినవిల్లి, పి.గన్నవరం, మామిడికుదురు, ముమ్మిడివరం మండలాల్లోని పలు కాజ్‌వేలు, రహదారులు నీటమునిగిపోవడంతో ప్రజలు ట్రాక్టర్లు, పడవల ద్వారా రాకపోకలు సాగించారు.
బోడసకుర్రు, ముమ్మిడివరం ప్రాంతాల్లోని నాలుగు ఆవాసాలు ముంపులో చిక్కుకున్నాయి. సోమవారం సాయంత్రానికి కోనసీమలో సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వివరాలు
శ్రీశైలానికి భారీగా చేరుతున్న వరద నీరు
ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి కృష్ణా నది వరద ఉద్ధృతంగా చేరుతోంది.
ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచి 1,52,186 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం రిజర్వాయర్‌లోకి ప్రవహిస్తోంది.
ఆదివారం సాయంత్రం 6 గంటల నాటికి శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 849.70 అడుగులు, నీటి నిల్వ 79.45 టీఎంసీలుగా నమోదైంది.
వివరాలు
నేడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.