IMF: 2023లో భారత వృద్ధి 6.1శాతంగా అంచనా, 2022తో పోలిస్తే 0.7శాతం తక్కువ
2023 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి 6.1 శాతంగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మంగళవారం జనవరికి సంబంధించిన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌ను విడుదల చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థలో కొంత మందగమనాన్ని నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.8శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ప్రకటించింది. ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ పియరీ-ఒలివియర్ గౌరించాస్ మాట్లాడుతూ, మాంద్యం ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సెంట్రల్ బ్యాంకులు పురోగతి సాధిస్తున్నాయని, అయితే ధరలను అరికట్టడానికి మరింత కృషి అవసరమని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం, చైనాలో కరోనా విజృంభణ వల్ల కొత్త అంతరాయాలు రావచ్చని చెప్పారు.
భారత్ విషయంలో అక్టోబర్ అంచనాలు మారలేదు: ఐఎంఎఫ్
2022లో ప్రపంచ వృద్ధి 3.4 శాతంగా ఉంటుందని, 2023లో 2.9 శాతానికి పడిపోతుందని, ఆ తర్వాత 2024లో తిరిగి 3.1 శాతానికి పెరుగుతుందని అంచనా ఐఎంఎఫ్ అంచనా వేసింది. భారతదేశ వృద్ధికి సంబంధించి అక్టోబరులో తాము చేసిన అంచనాలు మారలేదని పేర్కొంది. భారత వృద్ధి 2022లో 6.8 శాతం అని, 2023లో 6.1 శాతానికి క్షీణిస్తుందని, 2024లో తిరిగి 6.8 శాతానికి చేరుకుంటుందని ఐఎంఎఫ్ చెప్పింది. ఆసియాలో అభివృద్ధి చెందుతున్నదేశాల వృద్ధి 2023లో 5.3 శాతం, 2024లో 5.2 శాతానికి చేరుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. 2022లో ఊహించిన దానికంటే చైనా వృద్ధి రేటు 4.3 శాతానికి పడిపోయిందని చెప్పింది.