Niyu Lai : రూ.1 లక్ష బడ్జెట్.. రూ.20 కోట్ల వసూళ్లు! అసలు ఈ సినిమాలో ఏముంది?
ఈ వార్తాకథనం ఏంటి
చైనాలో ఓ చిన్న యానిమేషన్ సినిమా ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలకు గట్టి పోటీ ఇస్తోంది. కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి సుమారు రూ.1 లక్ష బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం.. విడుదలైన తొలినాళ్లలో తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొంది. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయని, పాత్రల కదలికలు విచిత్రంగా ఉన్నాయని, కథ అర్థం కావడం లేదని నెటిజన్లు విమర్శించారు. అయితే అనూహ్యంగా అదే నెగెటివ్ ప్రచారం సినిమాకు కలిసొచ్చింది. ఇప్పుడు ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
వివరాలు
'నియు లై'.. మొదట్లో అంతా నెగెటివ్ టాక్!
'నియు లై'(Niu Lai)పేరుతో రూపొందిన ఈ యానిమేషన్ సినిమా నిడివి 86 నిమిషాలు. ఓ చిన్న దూడ, ఓ స్కైలార్క్ మధ్య సంబంధాన్ని కలల తరహా కథనంతో ఈ చిత్రంలో చూపించారు.
ఆగస్టు 5న చైనాలో విడుదలైన ఈ సినిమా.. తొలి పది రోజుల్లో కేవలం 7,700యువాన్లు మాత్రమే వసూలు చేసింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.04లక్షలు.
దేశవ్యాప్తంగా సుమారు 300 మంది మాత్రమే ఈ చిత్రానికి టికెట్లు కొనుగోలు చేశారు. ఇక విడుదలకు ముందు సినిమాకు ఎలాంటి పెద్దగా ప్రచారం చేయలేదు.
ప్రమోషన్ టూర్ నిర్వహించలేదు. కనీసం ట్రైలర్‌ను కూడా విడుదల చేయలేదు. సంప్రదాయ చైనీస్ ఇంక్-వాష్ శైలిలో రూపొందించిన ఓ పోస్టర్ మాత్రమే సినిమాకు ప్రధాన ప్రచారంగా నిలిచింది.
వివరాలు
సోషల్ మీడియాలో ట్రోలింగ్..
సినిమాలోని కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 'నియు లై' గురించి చర్చ మొదలైంది. అయితే ఎక్కువగా వచ్చిన స్పందన మాత్రం ప్రతికూలంగానే ఉంది.
గ్రాఫిక్స్, పాత్రల డిజైన్, వాయిస్ యాక్టింగ్, కథనం వంటి అంశాలపై నెటిజన్లు సెటైర్లు వేశారు. కొందరు ఈ సినిమాను విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్‌తో పోల్చారు.
మరికొందరు 'ఏఐ కంటే దారుణంగా ఉంది', '2026లో వచ్చిన చెత్త సినిమాల్లో ఇదొకటి' అంటూ కామెంట్లు చేశారు.
అయితే సినిమాకు వచ్చిన ఈ నెగెటివ్ ప్రచారమే చివరకు దాని బలంగా మారింది.
వివరాలు
'నిజంగానే ఇంత చెత్తగా ఉందా?' అని..
సోషల్ మీడియాలో సినిమాపై జరుగుతున్న ట్రోలింగ్‌ను చూసిన కొందరు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. 'నిజంగానే సినిమా ఇంత దారుణంగా ఉందా?' అనే ఆలోచనతో థియేటర్లకు వెళ్లడం మొదలుపెట్టారు.
దీంతో అనూహ్యంగా సినిమా కలెక్షన్లు పెరగడం ప్రారంభమైంది. చైనా టికెటింగ్ ప్లాట్‌ఫామ్ మావోయాన్ ప్రకారం.. 'నియు లై' ఇప్పటివరకు 14.9మిలియన్ యువాన్లకు పైగా వసూలు చేసింది.
అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.20 కోట్లకు పైమాటే. కేవలం రూ.1లక్ష బడ్జెట్‌తో రూపొందిన సినిమా ఇంత భారీ వసూళ్లు సాధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'ది ఒడిస్సీ', 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' వంటి చిత్రాల మధ్య కూడా 'నియు లై' బాక్సాఫీస్ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించడం విశేషం.
వివరాలు
ఐదేళ్లు.. ఇద్దరు వ్యక్తులు!
'నియు లై' వెనుక మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ సినిమాను కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి దాదాపు ఐదేళ్లపాటు రూపొందించినట్లు సమాచారం.
షిన్ యుమెంగ్, సన్ లిఫాంగ్ అనే ఈ ఇద్దరూ సినిమాలో పలు బాధ్యతలు నిర్వర్తించారు.
రచయితలు, దర్శకులు, నిర్మాతలుగానే కాకుండా వాయిస్ ఆర్టిస్టులుగా కూడా వీరే పనిచేశారు.
ఇంత తక్కువ మంది సిబ్బందితో ఓ పూర్తి స్థాయి యానిమేషన్ సినిమాను దాదాపు ఐదేళ్లలో పూర్తి చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాలు
పోస్టర్ ఒకలా.. సినిమా మరోలా!
విడుదలకు ముందు 'నియు లై'కి కనిపించిన ప్రధాన ప్రచార సాధనం సంప్రదాయ చైనీస్ ఇంక్-వాష్ శైలిలో రూపొందించిన అందమైన పోస్టర్ మాత్రమే.
ఆ పోస్టర్‌ను చూసినప్పుడు సినిమా ఎంతో నాణ్యంగా ఉండబోతోందనే అభిప్రాయం కలిగింది.
అయితే థియేటర్లలో కనిపించిన యానిమేషన్ మాత్రం పోస్టర్‌కు పూర్తి భిన్నంగా ఉండటంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.
సినిమా నాణ్యతపై అనుమానాలు ఉన్నప్పటికీ.. దర్శకుడితో ఉన్న స్నేహం కారణంగా ఓ డిస్ట్రిబ్యూటర్ ఈ చిత్రాన్ని విడుదల చేసినట్లు సమాచారం.
వివరాలు
అందరికీ చెత్త సినిమానే కాదు!
అయితే 'నియు లై'ను చూసిన ప్రతి ప్రేక్షకుడు సినిమా బాగోలేదనే అభిప్రాయంతో లేరు.
ఏఐ సాయంతో క్షణాల్లో మెరుగైన విజువల్స్ రూపొందించగలిగే ప్రస్తుత కాలంలో.. చేతితో రూపొందించిన, ముడి శైలిలో ఉన్న ఇలాంటి యానిమేషన్ తమకు కొత్త అనుభూతిని ఇస్తోందని కొందరు ప్రేక్షకులు చెబుతున్నారు.
అదే సమయంలో సినీ పరిశ్రమకు చెందిన కొందరు మాత్రం కథ, విజువల్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ సహా దాదాపు ప్రతి విభాగంలోనూ ఈ సినిమా బలహీనంగానే ఉందని అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా.. తొలుత ట్రోలింగ్‌కు గురైన 'నియు లై' అదే నెగెటివ్ పబ్లిసిటీని బాక్సాఫీస్ విజయంగా మార్చుకోవడం ఇప్పుడు చైనీస్ సినిమా వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.