Vikram: 4 ప్రాజెక్టులతో చియాన్ విక్రమ్ గ్రాండ్ రీఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
పాత్ర ఏదైనా సరే దానిలో పూర్తిగా లీనమైపోవడంలో విక్రమ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటీవల ఆయన నటించిన తంగలాన్, వీర ధీర శూరన్ చిత్రాలు నటుడిగా ప్రశంసలు అందించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని నమోదు చేయలేకపోయాయి. అయినప్పటికీ ఈ ఏడాది మాత్రం విక్రమ్ గట్టి కమ్‌బ్యాక్‌కు సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఒకేసారి నాలుగు కొత్త ప్రాజెక్టులను ప్రకటించి సినీ వర్గాల్లో ఆసక్తి రేపారు. తాజాగా తన అప్‌కమింగ్ చిత్రాలపై సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ఒక ప్రిపరేషన్‌లాంటిదే. ఈ సంవత్సరం నన్ను లోతుగా కదిలించే కథల కోసం ఎదురుచూస్తూ గడిపాను.
Details
త్వరలోనే అధికారిక ప్రకటన
నేను ఎంతో అభిమానించే దర్శకులతో విభిన్నమైన నాలుగు సినిమాలతో మీ ముందుకు రాబోతున్నాను" అని పేర్కొన్నారు. ఈ కొత్త ప్రయాణాలను అభిమానులతో పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉన్నానని వెల్లడించారు. అయితే ఆ నాలుగు చిత్రాల కథాంశాలు ఏమిటి? ఆ స్టార్ దర్శకులు ఎవరు? అనే విషయాలను మాత్రం సస్పెన్స్‌లోనే ఉంచారు. ఇదిలా ఉండగా, విక్రమ్ మార్క్ ప్రయోగాలు, మాస్ ఎలిమెంట్స్ ఈ ప్రాజెక్టుల్లో పుష్కలంగా ఉంటాయని టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కెరీర్‌లో ఎదురైన వరుస పరాజయాల తర్వాత ఈ నాలుగు చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించాలని విక్రమ్ కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.