Happy Birthday ANR: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు
తెలుగు సినిమాను ఏలిన హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు అగ్రగణ్యులు. వీరిద్దరూ తెలుగు సినిమాకు రెండు కళ్ళలాంటి వారు. మొన్నటివరకు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు మొదలవుతున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు 1923 సెప్టెంబర్ 20వ తేదీన క్రిష్ణా జిల్లాలోని గుడివాడ దగ్గర రామాపురం గ్రామంలో జన్మించారు. ఆయనకు చిన్నప్పుడు నాటకాల మీద విపరీతమైన ఇష్టం ఉండేది. ఆ ఇష్టమే సినిమాల వైపు నడిపించింది. 1941లో ధర్మపత్ని సినిమాలో మొదటిసారిగా అక్కినేని నటించారు. ఇందులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించిన అక్కినేని, ఆ తర్వాత 1944లో సీతారామ జననం సినిమాతో హీరోగా మారారు.
ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అక్కినేని
93ఏళ్ల వయసులోనూ నటించి, సినిమా అంటె తనకెంత ఇష్టమో అక్కినేని చాటుకున్నారు. తన సినిమా కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించారు. సాంఘీక చిత్రాలకు అక్కినేని పెట్టింది పేరు. సమాజంలో ఉన్న సమస్యలను కథాంశాలుగా సినిమాలు తెరకెక్కించారు. అప్పట్లో అమ్మాయిలకు చదువు అవసరం లేదని చెప్పేవారు. ఈ మాటకు వ్యతిరేకంగా చదువుకున్న అమ్మాయిలు అనే సినిమాను తీసారు. ఇక ప్రేమకథా చిత్రాల పేరెత్తగానే అందరికీ దేవదాసు, ప్రేమ్ నగర్ గుర్తొస్తాయి. ఇప్పటికీ వాటి ప్రభావం ఉందంటే, అప్పట్లో ఆ సినిమాలు ప్రేక్షకులను ఎంతలా అలరించాయో అర్థం చేసుకోవచ్చు.
అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం
తెలుగు సినిమా పరిశ్రమను చెన్నై నుండి హైదరాబాదుకు మార్చడంలో ఏఎన్నార్ పాత్ర ఎంతో ఉంది. చాలా తెలుగు సినిమాలు చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంటే, ఏఎన్నార్ మాత్రం తన సినిమాలు హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకోవాలని పట్టుబట్టారు. సినిమా షూటింగుల కోసం అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించారు. సినిమాకి సంబంధించిన ప్రతీ పనీ హైదరాబాద్ లోనే పూర్తి కావాలనీ, చెన్నై వెళ్లాల్సిన అవసరం ఉండొద్దని అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్ని ఏర్పాట్లు చేసారు. అంతేకాదు, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో సినిమాలను కూడా నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఇప్పటికీ సినిమాలు వస్తూనే ఉన్నాయి.
అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు
ఇక అవార్డుల విషయానికి వస్తే, పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, పురస్కారాలను ఏఎన్నార్ అందుకున్నారు. మూడు పద్మ అవార్డులను అందుకున్న మొదటి సినిమా నటుడిగా ఏఎన్నార్ నిలిచారు. ఇక సినిమా అవార్డులు, ప్రైవేట్ అవార్డులకు లెక్కే లేదు. ఈరోజు నుండి ఏఎన్నార్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కినేని కుటుంబం, అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటి నుండి 2024 సెప్టెంబర్ 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మరణం అంచుకు చేరే వరకు సినిమాను ప్రాణం చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావు, తెలుగు సినిమా ఉన్నంత కాలం ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతారు.