Anupama Parameswaran: ఆ బాధలు తట్టుకోలేకపోయా.. సినిమాలు కూడా మానేయాలనుకున్నా: అనుపమ
ఈ వార్తాకథనం ఏంటి
నటి అనుపమ పరమేశ్వరన్ మరోసారి తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడారు. ఆమె నటించిన తాజా సినిమా 'క్రేజీ కల్యాణం' ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో తాను ఎదుర్కొన్న వేధింపులు, వాటి కారణంగా మానసికంగా ఎంతగా కుంగిపోయిందనే విషయాలను పంచుకున్నారు. ఒకానొక దశలో ఆ బాధలను తట్టుకోలేక సినిమాలకు స్వస్తి చెప్పాలని కూడా భావించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా అనుపమ తన అనుభవాలను గుర్తుచేసుకుంటూ.. ''అద్దంలో చూసుకున్నప్పుడు నేనేనా అనిపించేది. ప్రతిరోజూ జీవితాన్ని ఎంతో భారంగా నెట్టుకొచ్చాను. ఒక్కరోజు కూడా ప్రశాంతంగా, ఆనందంగా గడిచేది కాదు.
వివరాలు
ధైర్యంగా ముందుకు సాగా
నిరంతరం పోరాడాల్సి వచ్చేది. రోజు ముగిసే సమయానికి 'ఈరోజు బతికిపోయాను దేవుడా' అనిపించేది. అలా జీవితమే ఒక సవాలుగా మారిపోయింది.
అలాంటి పరిస్థితుల్లో నటనను కూడా వదిలేయాలని అనుకున్నా. కానీ, ధైర్యంగా ముందుకు సాగానని తెలిపారు.
అలాగే తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి బహిరంగంగా మాట్లాడితే విమర్శలు ఎదురవుతాయని మొదట భావించినట్లు అనుపమ చెప్పారు.
అయితే తన అంచనాలకు భిన్నంగా ఎంతోమంది తనకు మద్దతుగా నిలిచారని వెల్లడించారు. తన అనుభవాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా కనీసం కొందరిలోనైనా ధైర్యం నింపగలనని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
''నా అనుభవాలు కొందరిలో అయినా ధైర్యం నింపుతాయనుకుంటే.. నేను ఎన్ని విమర్శలకైనా సిద్ధమేనని అనుపమ పరమేశ్వరన్ స్పష్టం చేశారు.