Loading...
Ranabaali Review: రణబాలి మూవీ రివ్యూ.. విజయ్ దేవరకొండ నట విశ్వరూపం.. కానీ అదే మైనస్!
రణబాలి మూవీ రివ్యూ.. విజయ్ దేవరకొండ నట విశ్వరూపం.. కానీ అదే మైనస్!

Ranabaali Review: రణబాలి మూవీ రివ్యూ.. విజయ్ దేవరకొండ నట విశ్వరూపం.. కానీ అదే మైనస్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 16, 2026
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'టాక్సీవాలా' మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో వీరిద్దరి స్థాయికి మించిన హిట్‌గా ఆ చిత్రం నిలిచింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ 'రణబాలి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జోడీ. నిజ జీవితంలోనూ జంటగా ఉన్న వీరిద్దరూ వెండితెరపై కలిసి కనిపించడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? విజయ్ నటన, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం ఎలా ఉన్నాయి? కథలోని బలాలు, బలహీనతలు ఏంటి? ఇప్పుడు సమీక్షలో చూద్దాం.

వివరాలు

కథేంటి?

భద్ర మల్లన్న తాత ఆశీర్వాదంతోనే రాజమ్మ (ఈశ్వరీరావు) రణబాలికి (విజయ్ దేవరకొండ) జన్మనిస్తుంది.

పుట్టిన క్షణంలోనే చావును జయించి, తిరిగి పునర్జన్మ ఎత్తిన వ్యక్తిగా రణబాలిని చూపించారు. మొరటుతనం, మొండితనం కలిగిన రణబాలి సింగనమల ప్రాంతానికి కాపలాదారుడిగా ఉంటాడు.

కేవలం రెండు పుష్కరాల ఆయుష్షు మాత్రమే ఉన్నప్పటికీ, ఆ ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. మరోవైపు, రణబాలి చావు ఘడియలు దగ్గరపడుతున్నాయని భావించిన రాజమ్మ.. అతడికి త్వరగా పెళ్లి చేయాలని నిర్ణయిస్తుంది.

అలా జయమ్మ (రష్మిక మందన్నా)తో రణబాలి వివాహం జరుగుతుంది. ఇదే సమయంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రిటీష్ అధికారుల ఆగడాలు మితిమీరుతుంటాయి.

వివరాలు

రణబాలి సాగించిన పోరాటమే కథ

కొత్తగా వచ్చిన కరువు రాక్షసుడిగా కమిషనర్ థియోడర్ హెక్టర్ (ఆర్నాల్డో వోస్లో)ను చూపించారు. ప్రజలపై పన్నుల మీద పన్నులు విధిస్తూ, వారి వద్ద ఉన్న ధాన్యాన్ని సైతం లాక్కుంటుంటారు.

కరువు కాటకాల కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతుంటారు. బ్రిటీష్ అధికారుల ఆధీనంలో ఉన్న ధాన్యాన్ని ప్రజలకు పంచిపెట్టేందుకు రణబాలి రంగంలోకి దిగుతాడు.

ఆ తర్వాత రణబాలి సాగించిన పోరాటం ఏమిటి? ఈ ప్రయాణంలో అతడి కోసం జయమ్మ చేసిన త్యాగం ఏంటి? భద్ర మల్లన్న ప్రసాదించిన ఆయుష్షును చివరకు రణబాలి స్వీకరిస్తాడా? కరువు రాక్షసుడిని అంతమొందించగలుగుతాడా? లేదా? అనేదే మిగతా కథ.

ADVERTISEMENT

వివరాలు

కథనం ఎలా ఉంది?

'రణబాలి' కోసం దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ గట్టిగానే పరిశోధన చేసినట్లు కనిపిస్తుంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో కరువు కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడం, అప్పటి కాలంలో బ్రిటీష్ పాలకులు చేసిన అరాచకాలను తెరపైకి తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నించారు.

అయితే సినిమా ఎక్కడా పూర్తిస్థాయి డాక్యుమెంటరీని చూస్తున్నామనే భావన కలిగించదు. చారిత్రక అంశాలను తెరకెక్కించే క్రమంలో దర్శకుడు కొంత స్వేచ్ఛ తీసుకున్నట్లు కనిపిస్తుంది.

అయితే కథలో కొత్తదనం మాత్రం పెద్దగా కనిపించదు. టీజర్, ట్రైలర్ చూసినప్పుడే సినిమా ఏ దిశగా సాగుతుందో చాలావరకు అర్థమవుతుంది.

ఆ తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని చివరి వరకు కొనసాగించడంలో చిత్రం పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదనిపిస్తుంది. కథలోని మలుపులు కూడా ప్రేక్షకులు ముందుగానే ఊహించేలా ఉంటాయి.

ADVERTISEMENT

వివరాలు

కథ కొత్తగా అనిపించకపోవచ్చు

బ్రిటీష్ పాలకుల అణచివేత, దానికి వ్యతిరేకంగా ఓ యోధుడు తిరుగుబాటు చేయడం, చివరకు శత్రువులను అంతమొందించడం.. ఇదే ప్రధాన కథాంశం.

ఇలాంటి కథలతో గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇటీవలి కాలంలో మనం 'సైరా నరసింహారెడ్డి' వంటి చిత్రాలను చూశాం.

అందువల్ల 'రణబాలి' కథ ప్రేక్షకులకు పూర్తిగా కొత్తగా అనిపించకపోవచ్చు.

అయితే కథలో కొత్తదనం లేకపోయినా రాహుల్ సంకృత్యాన్ విజన్, మేకింగ్ మాత్రం ఆకట్టుకుంటాయి.

భారీ నేపథ్యాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం మెప్పిస్తుంది. కానీ నెమ్మదిగా సాగే కథనం, ఎక్కువ నిడివి కారణంగా సినిమా అందరికీ నచ్చకపోవచ్చు.

వివరాలు

ఫస్టాఫ్ బెటర్.. సెకండాఫ్‌లో ల్యాగ్!

సినిమా ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కొంత బెటర్‌గా అనిపిస్తుంది. రణబాలి ఎంట్రీ, అతడి పరిచయ పోరాట సన్నివేశం ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటాయి.

ఆ తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రిటీష్ అధికారుల ఆగడాలను చూపించిన తీరు కథకు బలాన్నిస్తుంది.

జయమ్మ పాత్ర ప్రవేశంతో కథలో రొమాంటిక్ టచ్ వస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా మధ్య సాగే ట్రాక్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది.

వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగుంది. చాలా సందర్భాల్లో నేపథ్య సంగీతం సన్నివేశాలను మరింత ఎలివేట్ చేస్తుంది.

అయితే సెకండాఫ్ విషయానికి వస్తే సినిమా సాగదీసినట్లు అనిపిస్తుంది.

వివరాలు

కొన్నిసీన్లు సాగదీత

కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి నిడివితో సాగుతాయి. దీంతో కొంతమంది ప్రేక్షకులకు 'ఇంకెంతసేపు?' అనే భావన కలిగే అవకాశం ఉంది.

ఓ దశలో సినిమా ముగిసిందని అనిపించినా, కథ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఈ ల్యాగ్ సినిమాకు ప్రధానమైన మైనస్‌గా నిలుస్తుంది.

క్లైమాక్స్‌లో దైవిక భావనను తీసుకొచ్చేందుకు దర్శకుడు ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. 'కాంతార'లో కనిపించిన దైవిక అంశాలను, 'ది ప్యారడైజ్'లో ప్రస్తావించిన ధూమావతి కాన్సెప్ట్‌ను గుర్తు చేసేలా ఇందులో భద్ర మల్లన్న అంశాన్ని ఉపయోగించినట్లు అనిపిస్తుంది.

చివర్లో విజయ్ దేవరకొండ పూనకంతో చేసే తాండవం ఆయన అభిమానులను ఆకట్టుకునే అవకాశం ఉంది.

వివరాలు

టెక్నికల్‌గా ఎలా ఉంది?

సాంకేతిక విభాగం 'రణబాలి'కి అతిపెద్ద బలం అని చెప్పొచ్చు. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఆలోచనలకు అనుగుణంగా ఆయా విభాగాలు చక్కగా పనిచేశాయి.

ముఖ్యంగా సంగీతం, నేపథ్య సంగీతం టాప్ నాచ్‌లో ఉన్నాయి. కీలక సన్నివేశాలకు బీజీఎం మంచి ఎలివేషన్ ఇస్తుంది. విజువల్స్ ప్రేక్షకులను 1870 ప్రాంతానికి తీసుకెళ్లేలా ఉంటాయి. అప్పటి కాలాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్స్‌ను రూపొందించారు.

నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సినిమా కోసం నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా భారీగా పెట్టుబడి పెట్టినట్లు తెరపై కనిపిస్తుంది.

అయితే సంభాషణలు మాత్రం మరీ గొప్పగా అనిపించవు. కొన్ని చోట్ల డైలాగ్స్ మరింత బలంగా ఉంటే సన్నివేశాలు ఇంకాస్త ప్రభావవంతంగా ఉండేవి.

ఇక సినిమాలోని 'ఏందయ్య సామీ' పాట మాత్రం ప్రేక్షకులకు మంచి ట్రీట్‌గా నిలుస్తుంది.

వివరాలు

నటీనటుల ప్రదర్శన ఎలా ఉంది?

విజయ్ దేవరకొండ తన గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచారు. రణబాలి పాత్ర కోసం ఆయన తనను తాను మార్చుకున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది.

పాత్రకు తగ్గట్టుగా కనిపించడమే కాకుండా, మాటలు పలికించే విధానంలోనూ భిన్నత్వాన్ని చూపించారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో విజయ్ తనదైన శైలిలో విధ్వంసం సృష్టించారు.

భావోద్వేగ సన్నివేశాల్లోనూ పాత్రకు న్యాయం చేశారు. జయమ్మగా రష్మిక మందన్నా తన పాత్ర పరిధిలో చక్కగా నటించారు.

విజయ్, రష్మిక ఇద్దరినీ తెరపై కలిసి చూస్తుంటే అభిమానులకు ముచ్చటేస్తుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

బ్రిటీష్ అధికారులుగా నటించిన నటులు తమ పాత్రల్లో క్రూరత్వాన్ని బాగా ప్రదర్శించారు.

వివరాలు

చివరగా.. 'రణబాలి' ఎలా ఉంది?

ఇక ఈశ్వరీరావు, మదునందన్, లాల్, కిషోర్ కుమార్, కోట జయరాం తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

'రణబాలి' సాంకేతికంగా అద్భుతంగా రూపొందిన చిత్రం. దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ విజన్, ఆయన మేకింగ్, విజయ్ దేవరకొండ నటన సినిమాకు ప్రధాన బలాలు.

ముఖ్యంగా విజయ్ తన పాత్రలో చూపించిన వైవిధ్యం, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటాయి.

అయితే నెమ్మదిగా సాగే కథనం, సెకండాఫ్‌లో ల్యాగ్, ఎక్కువ నిడివి, ముందుగానే ఊహించగలిగే కథ సినిమాకు ప్రతికూల అంశాలుగా నిలుస్తాయి.

మాస్ ప్రేక్షకులు ఆశించే హై మూమెంట్స్ కూడా ఆశించిన స్థాయిలో కనిపించకపోవచ్చు. అందువల్ల ఈ సినిమా కమర్షియల్‌గా ఏ స్థాయికి చేరుకుంటుందనేది ఇప్పుడే చెప్పడం కష్టం.

ADVERTISEMENT