S Saraswathi Review: 'ఎస్ సరస్వతి' రివ్యూ.. మంచి పాయింట్‌తో వచ్చిన థ్రిల్లర్.. కానీ పూర్తి స్థాయిలో మెప్పించిందా?
ఈ వార్తాకథనం ఏంటి
నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా మారి రూపొందించిన చిత్రం 'ఎస్ సరస్వతి'. తమిళ నటి అయినా ఇటీవల కాలంలో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించిన ఆమె, ఈ సినిమాను నేరుగా తెలుగులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం. మొదట ఈ చిత్రానికి 'సరస్వతి' అనే టైటిల్ పెట్టగా, విడుదలకు ఒక రోజు ముందు సెన్సార్ అభ్యంతరాల కారణంగా దాన్ని 'ఎస్ సరస్వతి'గా మార్చి రిలీజ్ చేశారు. వరలక్ష్మి మొదటిసారి దర్శకత్వం వహించడం, అలాగే ప్రచార కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించింది అనేది ఇప్పుడు చూద్దాం.
Details
కథ ఏమిటంటే
లక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. ఆగస్టు 15న తన కుమార్తె 12 ఏళ్ల సరస్వతి పుట్టినరోజు. ఆ రోజు ఉదయం ఆమెను స్కూల్‌లో దింపి ఆసుపత్రికి వెళుతుంది. తిరిగి వచ్చేసరికి స్కూల్‌లో తన కుమార్తె కనిపించదు. స్కూల్ యాజమాన్యం అయితే "మీ కుమార్తె మా స్కూల్లో చదవడం లేదు" అంటూ బాధ్యత తప్పించుకుంటుంది. అయితే అదే రోజు రాత్రి ప్రిన్సిపల్ గదిలో నుంచి సరస్వతి ఫోన్ చేయడంతో లక్ష్మి అక్కడికి వెళుతుంది. అక్కడికి వెళ్లిన తరువాత తన కుమార్తెను ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి చంపినట్టు తెలిసి తీవ్రంగా కుంగిపోతుంది. కుమార్తె పరువు పోకూడదనే ఆలోచనతో ఆమె శవాన్ని స్వయంగా స్మశానానికి తీసుకెళ్లి పూడ్చిపెడుతుంది.
Details
ప్రియమణి, రాధికా శరత్ కుమార్ పాత్రలు ఏమిటంటే
తరువాత ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. పోలీసులు వచ్చి వెతికినా శవం కనిపించదు. దీంతో వారు ఈ కేసును పెద్దగా పట్టించుకోరు. అయినా న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించిన లక్ష్మి చివరికి లాయర్ రామానుజం (Prakash Raj)ను ఆశ్రయిస్తుంది. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఆయన ఈ కేసును స్వీకరించి కోర్టులో కేసు వేస్తాడు. అసలు సరస్వతిపై అత్యాచారం చేసిన వారు ఎవరు? కోర్టులో రామానుజం ఏమి నిరూపించాడు? లక్ష్మి తన భర్త (Jiiva) నుంచి ఎందుకు విడిపోయింది? అలాగే సినిమాలో కనిపించే ప్రియమణి, రాధికా శరత్ కుమార్ పాత్రల ప్రాధాన్యం ఏమిటి? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే.
Details
విశ్లేషణ
సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తేనే కథ సారాంశం ప్రేక్షకులకు సులభంగా అర్థమవుతుంది. కుమార్తె మిస్ అవ్వడం, ఆ తర్వాత ఆమెకు న్యాయం చేయడానికి తల్లి చేసే పోరాటం అనే అంశం స్పష్టంగా తెలుస్తుంది. అయితే సినిమా మొదలైన కొద్దిసేపటికే ప్రేక్షకులలో ఆసక్తిని పెంచడంలో దర్శకురాలిగా వరలక్ష్మి శరత్ కుమార్ కొంతవరకు సక్సెస్ అయ్యింది. మొదటి సినిమా కావడంతో కొన్నిచోట్ల అనుభవలేమి కనిపించినా, కథను ఎంగేజింగ్‌గా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించింది. సినిమా ప్రారంభం తర్వాత కథ ఏ దిశగా వెళుతుందో ముందుగానే ఊహించగలిగినా, ఎక్కడా పూర్తిగా పట్టు కోల్పోకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించింది. అయితే కొన్నిచోట్ల లాజిక్‌కు అందని సన్నివేశాలు, అవసరం లేని సీన్స్ ఉన్నాయనే భావన కలుగుతుంది.
Details
న్యాయం కోసం పోరాటం
కొన్ని కెమెరా యాంగిల్స్ కొత్తగా ట్రై చేసినా, అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ కాలేదు. ప్రచార కంటెంట్ ప్రకారం చూస్తే ఈ సినిమా ఒక తల్లి తన కుమార్తెపై జరిగిన దారుణానికి న్యాయం కోసం చేసే పోరాటం అనిపిస్తుంది. కానీ అసలు సినిమాలో కథను పూర్తిగా స్క్రీన్‌ప్లే ఆధారంగా నడిపించారు. ఈ విధానం కొన్ని చోట్ల బాగా వర్కౌట్ కాగా, మరికొన్ని చోట్ల బోర్ కొట్టిస్తుంది. సినిమా ప్రధాన పాయింట్ మాత్రం ఆసక్తికరంగా ఉంది. దేశంలో జాతీయ జంతువు లేదా జాతీయ పక్షికి హాని కలిగిస్తే ఉండే శిక్ష కంటే, ఒక అమ్మాయిపై అఘాయిత్యం చేస్తే ఉండే శిక్ష తక్కువగా ఉండటం అనే అంశాన్ని సినిమాలో ప్రస్తావించారు.
Details
పూర్తిస్థాయిలో ఆవిష్కరించడంలో కొంత విఫలం
ఈ ఆలోచన కథలో బలంగా అనిపించినా, దాన్ని తెరపై పూర్తి స్థాయిలో ఆవిష్కరించడంలో దర్శకురాలు కొంత తడబడింది. అయినా ఇది మొదటి ప్రయత్నం కావడంతో వరలక్ష్మి చాలా వరకు సినిమాను సమర్థంగా మలచినట్టు అనిపిస్తుంది. మొదట థ్రిల్లర్‌గా మొదలైన కథ, తర్వాత మెడికల్ అంశాలు, ట్విస్టులతో ముందుకు సాగుతూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కొంతవరకు ఆ ప్రయత్నం ఫలించింది.
Details
నటీనటులు & సాంకేతిక వర్గం
నటీనటుల విషయానికి వస్తే లక్ష్మి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ బాగా ఒదిగిపోయింది. అతిథి పాత్రలో కనిపించిన జీవ తన పాత్రకు న్యాయం చేశాడు. ప్రకాష్ రాజ్ ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకున్నాడు. రాధికా శరత్ కుమార్, ప్రియమణి పాత్రలు కూడా ఈ సినిమాలో అతిథి పాత్రలుగానే కనిపిస్తాయి. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధిలో బాగా నటించారు. సాంకేతికంగా చూస్తే దర్శకురాలిగా వరలక్ష్మి తన ముద్ర వేయడానికి ప్రయత్నించింది. సంగీత దర్శకుడు ఎస్. తమన్ అందించిన సంగీతం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. గతంలో ఆయన చేసిన సినిమాలకు వాడని ట్యూన్స్‌ను ఇక్కడ ఉపయోగించినట్టుగా అనిపిస్తుంది.
Dteails
కొత్తగా అనిపించినా కెమెరా వర్క్
నేపథ్య సంగీతం కూడా అంతగా ప్రభావం చూపలేదు. పాటలు కూడా గుర్తుండిపోయేలా లేవు. కెమెరా వర్క్ కొత్తగా ప్రయత్నించినా, కొన్ని సన్నివేశాల్లో సాధారణ ప్రేక్షకులకు కొంచెం వింతగా అనిపిస్తుంది. అయినప్పటికీ తక్కువ సమయంలో ఈ స్థాయి అవుట్‌పుట్ తీసుకురావడంలో చిత్రబృందం కృషి కనిపిస్తుంది. నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. 'ఎస్ సరస్వతి' మంచి పాయింట్‌తో రూపొందిన సినిమా. కొన్ని చోట్ల ఆసక్తికరంగా సాగినా, మొత్తంగా చూస్తే పూర్తిస్థాయిలో థ్రిల్ పంచడంలో మాత్రం పూర్తిగా సక్సెస్ కాలేదు.