Sampradayini suppini suddapoosani review: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని.. శివాజీ-లయ కాంబో ఆకట్టుకుందా?
ఈ వార్తాకథనం ఏంటి
వరుస సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోంది ETV Win. విజయవంతమైన #90s వెబ్‌సిరీస్ తర్వాత శివాజీతో కలిసి చేసిన రెండో ప్రాజెక్ట్ సంప్రదాయిని సుప్పినీ సుద్దపూసనీ. ఈ చిత్రాన్ని శివాజీ స్వయంగా నిర్మించడం, దాదాపు 20 ఏళ్ల తర్వాత లయతో కలిసి నటించడం, టీజర్, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండటం వల్ల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా కథ ఏమిటి? ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది?
Details
కథ ఏమిటంటే..
కథలో శ్రీరామ్ (Shivaji) నిజాయితీ గల పంచాయతీ కార్యదర్శి. కొత్తకోట సమీపంలోని హర్షిలి హిల్స్‌లో భార్య ఉత్తర (Laya), కొడుకు బిట్టు అలియాస్ నితిన్ (రోహన్)తో కలిసి జీవిస్తుంటాడు. అయితే రీల్స్ పిచ్చితో తింగరి పనులు చేసే తన కొడుకు వల్ల శ్రీరామ్‌కు తరచూ తలనొప్పులు వస్తుంటాయి. ఓ దీపావళి రోజున వారి ఇంటికి ఆ ఊరి ఎస్సై విక్రమ్ వాసుదేవ్ (ప్రిన్స్) వస్తాడు. అతనికి మహిళలపై అసహజమైన ఆసక్తి ఉంటుంది. అప్పటికే శ్రీరామ్‌తో ఒకసారి గొడవ జరిగిన కారణంగా అతనిపై విక్రమ్‌కు పగ ఉంటుంది. శ్రీరామ్ ఇంట్లో లేడని తెలుసుకున్న విక్రమ్, ఉత్తరపై చెడు ఉద్దేశంతో ప్రయత్నించాలనుకుంటాడు.
Details
కానిస్టేబుల్ సుధీర్ పాత్ర ఏమిటి?
అయితే అనూహ్యంగా శ్రీరామ్ కొడుకు చేతిలోనే ఆ ఎస్సై హత్యకు గురవుతాడు. ఈ ఘటన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఆ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి శ్రీరామ్ ఏం చేశాడు? మూడో కంటికి తెలియకుండా ఆ శవాన్ని మాయం చేయడానికి వాళ్లు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? నిజంగా ఆ హత్యకు శ్రీరామ్ కొడుక్కి సంబంధం ఉందా? లేక ఇంకేదైనా మలుపు ఉందా? ఇదిలా ఉండగా రూ.కోటి డబ్బుతో ఉన్న తన గిఫ్ట్ బ్యాగ్ పోయిందని ఆరోపిస్తూ స్థానిక ఎమ్మెల్యే తిమ్మప్ప (Sharath Lohithaswa) గ్యాంగ్ కూడా శ్రీరామ్‌ను వెంటాడుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కానిస్టేబుల్ సుధీర్ (Dhanraj) పాత్ర ఏమిటి? అన్నదే కథలోని అసలు మలుపు.
Details
ఎలా సాగిందంటే...
సాంప్రదాయంగా కనిపించే భర్త, సుప్పనాతితనంతో ఉండే భార్య, బయటకు సుద్దపూసలా కనిపిస్తూ లోపల దొంగపనులు చేసే పోలీస్—ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. దర్శకుడు సుధీర్ దీనిని వినోదాత్మకంగా సాగే డార్క్ క్రైమ్ థ్రిల్లర్‌గా చూపించే ప్రయత్నం చేశారు. ప్రేక్షకులను నవ్వించడంలోనూ, కొంత థ్రిల్ పంచడంలోనూ దర్శకుడు ఫర్వాలేదనిపిస్తాడు. కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా, ప్రధాన పాత్రల స్వభావాన్ని పరిచయం చేసే విధానం ఆరంభంలో మంచి వినోదాన్ని అందిస్తుంది. కథానాయకుడి నిజాయితీ, అతని భార్య-కొడుకుల విచిత్ర స్వభావాలను చూపిస్తూ సినిమాను ప్రారంభించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. ఎస్సై విక్రమ్ హత్యకు గురైన క్షణం నుంచి సినిమా థ్రిల్లర్ జానర్‌లోకి మలుపు తిరుగుతుంది.
Details
అలీ కామెడీ ట్రాక్ సూపర్బ్
ఓవైపు శవాన్ని మాయం చేయడానికి హీరో-హీరోయిన్ వేసే ఎత్తుగడలు, మరోవైపు ఎమ్మెల్యే గిఫ్ట్ బ్యాగ్ కోసం అతని అనుచరులు చేసే వెతుకులాట మొదట్లో ఆసక్తిని పెంచుతాయి. కొంతసేపటి తర్వాత కథ, కథనంలో పట్టు కొద్దిగా సడలిన భావన కలుగుతుంది. అయినప్పటికీ విరామ సన్నివేశాలు ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచుతాయి. హీరో తన కారులో ఉన్న శవాన్ని ఎలా మాయం చేస్తాడు? ఎమ్మెల్యే అనుచరుల నుంచి ఎలా తప్పించుకుంటాడు? అన్నదే రెండో భాగానికి ప్రధాన ఆసక్తి. ఇలాంటి కథలో క్రైమ్ చుట్టూ ఎక్కువ టెన్షన్ నిర్మించాల్సిన అవసరం ఉంటుంది. ఆ అంశం కొంత మేర తగ్గినట్టు అనిపిస్తుంది. మధ్యలో వచ్చే అలీ కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు ఉపశమనం కలిగిస్తుంది. ప్రీక్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది.
Details
ఎవరెలా చేశారంటే...
శ్రీరామ్ తరహా పాత్రలు శివాజీకి కొత్తేమీ కాదు. తన అనుభవంతో ఈ పాత్రను సహజంగా చూపించారు. లయతో ఆయన కెమిస్ట్రీ బాగుంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. రీల్స్ పిచ్చితో అల్లరి చేసే యువకుడిగా రోహన్ పాత్ర వినోదాన్ని అందిస్తుంది. ప్రిన్స్, అలీ, శరత్ లోహితాస్వా వంటి పాత్రలు తమ పరిధి మేరకు కనిపిస్తాయి. చివర్లో ధనరాజ్ పాత్ర సర్‌ప్రైజ్ ఫ్యాక్టర్‌గా నిలుస్తుంది. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ రాసుకున్న కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా, కొన్ని వినోదాత్మక సన్నివేశాలతో ముందుకు నడిపించారు. క్లైమాక్స్‌లో బండ్ల గణేష్ పాడిన 'పాయ..' పాట సినిమాకు జోష్‌ను తెస్తుంది.
Details
బలాలు
శివాజీ - లయ కెమిస్ట్రీ విరామ సన్నివేశాలు ప్రీక్లైమాక్స్ ట్విస్ట్ బలహీనతలు కొత్తదనం లేని కథ నెమ్మదిగా సాగే కథనం చివరిగా: కొన్ని నవ్వులు, కొంత థ్రిల్ అందించే డార్క్ క్రైమ్ థ్రిల్లర్.