Loading...
AP Municipal Elections: ఏపీ మున్సిపల్ పోరు.. 8 స్థానాల్లో ఛైర్‌పర్సన్ల ఏకగ్రీవం
ఏపీ మున్సిపల్ పోరు.. 8 స్థానాల్లో ఛైర్‌పర్సన్ల ఏకగ్రీవం

AP Municipal Elections: ఏపీ మున్సిపల్ పోరు.. 8 స్థానాల్లో ఛైర్‌పర్సన్ల ఏకగ్రీవం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలోని పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైకాపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఛైర్‌పర్సన్‌ ఎన్నికలు కూటమి పార్టీలకు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శి, పిడుగురాళ్ల, ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీలతోపాటు గురజాల, కమలాపురం నగర పంచాయతీల్లో వైకాపా తరఫున అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు. దీంతో ఆయా స్థానాల్లో కూటమి అభ్యర్థులే బరిలో నిలిచారు. డమ్మీ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకుంటే ఈ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.

వివరాలు 

జమ్మలమడుగు, గుత్తిలో నామినేషన్లు వేయని వైసీపీ అభ్యర్థులు

వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు, అనంతపురం జిల్లా గుత్తిలో మాత్రం పరిస్థితి కొంత భిన్నంగా ఉంది.

ఈ రెండు చోట్ల వైకాపా అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులు కాకుండా ఇతరులు నామినేషన్లు దాఖలు చేశారు.

జమ్మలమడుగులో వైకాపా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి భార్య ఇందిరను, గుత్తిలో అంజలిని ఛైర్‌పర్సన్‌ అభ్యర్థులుగా పార్టీ ప్రకటించింది.

అయితే వారిద్దరూ నామినేషన్లు వేయలేదు. వైకాపాకు చెందిన మరికొందరు నాయకులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

వీరు పోటీ నుంచి తప్పుకుంటే ఈ రెండు చోట్లా ఎన్నికలు ఏకగ్రీవం కావచ్చు. లేకపోతే ఎన్నికలు జరిగే అవకాశమున్నా ఫలితం ఏకపక్షంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

పలు మున్సిపాలిటీల్లో వైకాపా నిల్‌.. కూటమికి ఏకగ్రీవ ఛాన్స్

ప్రకాశం జిల్లాలోని దర్శి, పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మున్సిపాలిటీలతోపాటు గురజాల నగర పంచాయతీలో వైకాపా తరఫున ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.

ఆయా ఛైర్‌పర్సన్‌ స్థానాలకు కూటమి పార్టీల అభ్యర్థులే నామినేషన్లు వేశారు.

అక్కడ నామినేషన్లు దాఖలు చేసిన డమ్మీ అభ్యర్థులు ఉపసంహరించుకుంటే కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

ఇదే పరిస్థితి వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఎర్రగుంట్ల, మైదుకూరు మున్సిపాలిటీలు, కమలాపురం నగర పంచాయతీలోనూ కనిపిస్తోంది.

అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీల్లో కూడా వైకాపా తరఫున నామినేషన్లు దాఖలు కాలేదు.

ఈ ప్రాంతాల్లో కూటమి అభ్యర్థులే నామినేషన్లు వేశారు. డమ్మీ అభ్యర్థులు పోటీ నుంచి వైదొలిగితే ఛైర్‌పర్సన్‌ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

కంచుకోటల్లోనూ వైకాపాకు అభ్యర్థుల కొరత

గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకులపై హింస, బెదిరింపులకు పాల్పడటం, బోగస్‌ కేసులు నమోదు చేయడం, కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా అడ్డుకోవడం వంటి చర్యలతో వైకాపా వందల సంఖ్యలో స్థానాలను ఏకగ్రీవం చేసుకుందని విమర్శలు ఉన్నాయి.

అయితే ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఒకప్పుడు తమకు కంచుకోటలుగా భావించిన పులివెందుల, పుంగనూరు, కమలాపురం, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల వంటి ప్రాంతాల్లోనే పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది.

ఛైర్‌పర్సన్‌ స్థానాలకు కూడా అభ్యర్థులు లభించకపోవడాన్ని వైకాపా నాయకులు ఊహించలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తమకు పట్టున్న నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ముందుకు రావాలని కోరినా స్పందన కరవైనట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

పుంగనూరులో పోటీకి దూరం

గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, బెదిరింపుల నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళన కూడా అభ్యర్థుల కొరతకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

దశాబ్దాలుగా వైఎస్‌ కుటుంబ ఆధిపత్యంలో ఉన్న పులివెందుల మున్సిపాలిటీలోనూ సగం స్థానాల్లో వైకాపా అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బలమైన పట్టున్న పుంగనూరులోనూ పరిస్థితి మారింది.

గతంలో ప్రత్యర్థులను అణచివేస్తూ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారని విమర్శలు ఎదుర్కొన్న ఆయన, ఈసారి తాము పోటీ చేయడం లేదని స్వయంగా ప్రకటించాల్సి వచ్చింది.

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలి రెండు రోజులు వైకాపా అధినేత జగన్‌ బెంగళూరులో ఉన్నారు.

వివరాలు 

388కిపైగా వార్డుల్లో వైకాపా నామినేషన్లు లేవు

చివరి రోజున అమరావతికి చేరుకుని పార్టీ నాయకులతో సమీక్షలు నిర్వహించినప్పటికీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించలేకపోయారు.

దీంతో పలు మున్సిపాలిటీల్లో వైకాపా పోటీకి దూరమైన పరిస్థితి ఏర్పడింది.

తొలి విడతలో ఎన్నికలు జరగనున్న 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో 388కిపైగా వార్డులకు వైకాపా తరఫున నామినేషన్లు దాఖలు కాలేదు.

నామినేషన్లకు చివరి రోజైన ఆదివారం రాత్రి వరకు అందిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

పూర్తి స్థాయి సమాచారం అందిన తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

ADVERTISEMENT