AP Urban Polls: పట్టణ ఎన్నికల్లో కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే?
ఈ వార్తాకథనం ఏంటి
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాల ప్రక్రియ సుహృద్భావ వాతావరణంలో ముగిసింది. సుదీర్ఘ చర్చల అనంతరం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు (భాజపా) ఒక అంగీకారానికి వచ్చాయి. తొలుత తెదేపా, జనసేన మధ్య సీట్ల కేటాయింపుపై కొంత ప్రతిష్టంభన ఏర్పడినా.. చివరకు ఇరు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో సమస్యను పరిష్కరించుకున్నాయి. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకుంటూ మూడు పార్టీలు సీట్ల సర్దుబాటును పూర్తి చేశాయి. ఏ పార్టీ ఏ ప్రాంతం నుంచి పోటీ చేయాలనే అంశాన్ని గురువారం రాత్రి ప్రకటించాయి.
వివరాలు
మొత్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో..
రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థల్లో మేయర్ పదవుల కోసం తెదేపా 11, జనసేన 4, భాజపా 2 చోట్ల పోటీ చేయనున్నాయి.
మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఛైర్పర్సన్ పదవులకు తెదేపా 78, జనసేన 21, భాజపా 7 స్థానాల్లో పోటీ చేస్తాయి.
మొత్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో తెదేపా 89, జనసేన 25, భాజపా 9 చోట్ల బరిలోకి దిగనున్నాయి.
మొత్తం స్థానాల్లో జనసేనకు 20.33 శాతం, భాజపాకు 7.32 శాతం కేటాయించారు.
మేయర్ లేదా ఛైర్మన్ పదవిని ఒక పార్టీకి కేటాయిస్తే.. డిప్యూటీ మేయర్ లేదా వైస్ ఛైర్మన్ పదవిని మరో పార్టీకి ఇచ్చేలా కూడా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది.
వివరాలు
కార్యకర్తల ఆకాంక్షలకు ప్రాధాన్యం
పట్టణ స్థానిక సంస్థల్లో సీట్ల పంపకాలపై కూటమి పార్టీల ముఖ్య నేతలు సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు విస్తృతంగా చర్చలు జరిపారు.
ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై తెదేపా,జనసేన మధ్య తొలుత ఏకాభిప్రాయం కుదరలేదు.
ఎక్కువ స్థానాలు కేటాయించాలని జనసేన కోరగా.. వివిధ రాజకీయ సమీకరణాల దృష్ట్యా అన్ని స్థానాలు ఇవ్వడం సాధ్యం కాదని తెదేపా తెలిపింది.
దీంతో చర్చల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడింది.ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనే ఉత్కంఠ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తల్లో నెలకొంది.
సోమవారం నుంచి బుధవారం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో జనసేన, భాజపా నేతలు చర్చలు జరిపారు.
మరోవైపు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో తెదేపా నేతలు సమావేశమయ్యారు.
వివరాలు
పెద్దాపురంలో తెదేపాకు అవకాశం
బుధవారం ముఖ్యమంత్రితో జనసేన నేతలు జరిపిన చర్చల్లో సీట్ల సర్దుబాటుపై దాదాపుగా అవగాహన కుదిరింది.
దీనికి కొనసాగింపుగా గురువారం ముఖ్యమంత్రితో జనసేన, భాజపా నేతలు మరోసారి చర్చలు జరపడంతో పంపకాల ప్రక్రియ పూర్తయింది.
పెద్దాపురం మున్సిపాలిటీని జనసేనకు కేటాయించనున్నట్లు సంకేతాలు రావడంతో అక్కడి తెదేపా కార్యకర్తలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు.
వారి అభిప్రాయాలను, ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత పెద్దాపురంలో తెదేపా పోటీ చేసేందుకు జనసేన అంగీకరించింది.
ఏలూరు మేయర్ పదవిని జనసేన కోరింది. ఈ ప్రతిపాదనపై అక్కడి తెదేపా శ్రేణుల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది.
అయినప్పటికీ పార్టీ నాయకత్వం కార్యకర్తలకు నచ్చజెప్పి, జనసేన పోటీ చేసేందుకు మార్గం సుగమం చేసింది.
వివరాలు
నేటి నుంచి అభ్యర్థుల ప్రకటన
కార్పొరేషన్ల మేయర్ పదవులు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్మన్ స్థానాలకు కూటమి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా దాదాపు పూర్తయింది.
శుక్రవారం నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఆయా జిల్లాల్లోనే ఖరారు చేసి, అక్కడే అధికారికంగా ప్రకటిస్తారు.
డివిజన్లు, వార్డుల సర్దుబాటుపై చర్చలు
మరోవైపు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లోని డివిజన్లు, వార్డుల కేటాయింపుపై జిల్లాల స్థాయిలో మూడు పార్టీల నేతలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు.
తెదేపా, జనసేన, భాజపా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. శుక్ర, శనివారాల్లో డివిజన్లు, వార్డుల సర్దుబాటును పూర్తి చేయాలని భావిస్తున్నారు.
వివరాలు
కార్పొరేషన్లలో పోటీ చేసే కూటమి పార్టీల వివరాలు
తెదేపా: విజయనగరం, విశాఖపట్నం, మచిలీపట్నం, మంగళగిరి-తాడేపల్లి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి, చిత్తూరు నగరపాలక సంస్థల్లో పోటీ చేయనుంది.
జనసేన: శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ నగరపాలక సంస్థల్లో బరిలోకి దిగనుంది.
భాజపా: రాజమహేంద్రవరం, అనంతపురం నగరపాలక సంస్థల్లో పోటీ చేయనుంది.