భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం, నౌకాదళంలోకి ప్రవేశించిన సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ 'వగిర్'
భారత నౌకాదళం మరో ప్రధాన అస్త్రాన్ని తన అమ్ములపొదిలో చేర్చుకుంది. సముద్రగర్భంలో శత్రువు పాలిట మారణాస్త్రంగా భావిస్తున్న సబ్‌మెరైన్ ఐఎన్ఎస్ 'వగిర్'ను చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఆధ్వర్యంలో సోమవారం నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. స్వదేశీ పరిజ్ఞానంతో అధునాత హంగులతో తీర్చిదిద్దిన ఈ జలాంతర్గామి కల్వరి శ్రేణి సబ్‌మెరైన్‌లలో ఐదోవది కావడం గమనార్హం. ఐఎన్ఎస్ 'వగిర్' రాకతో భారత నావికా దళం మరింత బలపడింది. ఫ్రాన్స్ సహకారంతో ముంబయికి చెందిన మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ సంస్థ దీన్ని తీర్చిదిద్దింది. శత్రువులను అరికట్టడంతో పాటు భారత సముద్ర ప్రయోజనాలను కాపాడుతుందని నేవీ భావిస్తోంది. ఇందులో ఉండే ఐఎస్ఆర్ అనే ఇంటెలిజెన్స్ వ్యవస్థ నౌకాదళ సామర్థ్యాన్ని పెంచుతుందని నేవీ పేర్కొంది.
హిందూ మహాసముద్రంలో చైనాను దెబ్బకొట్టేందుకే వగిర్' ఎంట్రీ
హిందూ మహాసముద్రంలో చైనా నావికాదళం తమ కార్యకలాపాలను పెంచుతోంది. ఈ క్రమంలో డ్రాగన్‌ను దెబ్బకొట్టేందుకు అన్నిరకాల సాంకేతిక హంగులతో భారత్ ఐఎన్ఎస్ 'వగిర్'ను రూపొందించింది. 'వగిర్' అంటే ఇసుక సొరచేప అని అర్థం. ఇసుక సొరచేప సముద్రంలో ఎలాంటి శబ్ధం లేకుండా చాలా సైలెంట్‌గా వెళ్తుంది. అలాగే దానికి భయం అంటే తెలియదు. ఈ రెండు అంశాలు ఐఎన్ఎస్ 'వగిర్'లో ఉన్నాయి. అందుకే దానికి ఆ పేరు పెట్టారు. ఇందులో ఉండే అత్యుత్తమ సెన్సార్లు, శత్రువు జలాంతర్గాములు, నౌకలను సులభంగా గుర్తించగలవు. శత్రువును ధీటుగా ఎదుర్కొనేందుకు అత్యాధునిక వైర్ గైడెడ్ టార్పెడోలను ఇందులో అమర్చారు. అత్యంత శక్తివంతమైన డీజిల్ ఇంజిన్లు దీని సొంతం.