పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్
పశ్చిమ బెంగాల్‌లో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 కేసులు వెలుగుచూశాయి. అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు బెంగాల్ ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెప్పింది. ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన ఈ నలుగురి నుంచి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. దీంతో వీరిలో బీఎఫ్-7 వేరియంట్ ఉన్నట్లు తేలినట్లు ఆరోగ్యశాఖకు చెందిన ఓ అధికారి వివరించారు. బీఎఫ్-7 వేరియంట్ సోకిన నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. వీరిది నాడియా జిల్లా. మరొకరు బిహార్‌కు చెందిన వ్యక్తి ప్రస్తుతం కోల్‌కతాలో నివసిస్తున్నారు.
సన్నిహితంగా ఉన్న 33మంది గుర్తింపు
బీఎఫ్-7 వేరియంట్ సోకిన నలుగురితో సన్నిహితంగా ఉన్న 33మందిని గుర్తించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. ప్రస్తుతం వారి నమూనాలను పరీక్షలకు పంపినట్లు వివరించారు. అందరి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. చైనాతో పాటు ఇతర దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలను కేంద్ర తప్పని సరి చేసింది. డిసెంబర్ నుంచి అంతర్జాతీయ ప్రయాణికులకు పరీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగానే కోల్‌కతా విమానాశ్రయంలో కరోనా పరీక్షలు చేసి.. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ఈ క్రమంలోనే నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ ఉన్నట్లు తేలింది. వారం రోజుల క్రితం కూడా కోల్‌కతా విమానాశ్రయంలో ఒక విదేశీ పౌరుడితో సహా ఇద్దరిలో ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్ ఉన్నట్లు తేలింది.