గుడి గోపురంపై కుప్పకూలిన విమానం
మధ్యప్రదేశ్‌లోని రేవాలో శిక్షణ విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పైలట్ అక్కడికక్కడే మృతి చెందగా.. శిక్షణ తీసుకున్నంటున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాముల ఈ ప్రమాదం జరిగినట్లు రేవా ఎస్పీ నవనీత్ భాసిన్ తెలిపారు. ప్రైవేట్ కంపెనీకి చెందిన శిక్షణ విమానం చోర్హాటా ఎయిర్‌స్ట్రిప్ నుంచి వెళ్తుండగా.. రేవా జిల్లాలోని ఉమ్రీ గ్రామంలోని దేవాలయం గోపురానికి ఢీకొంది. దీంతో ఆ విమానం అక్కడే కూలిపోయింది. ఈ క్రమంలో మంటల చెలరేగడంతో.. పైలట్ స్పాట్‌లోనే మృతి చెందారు. ప్రమాదం విషయాన్నిస్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పొగమంచే కారణమా?
శిక్షణ విమానం కుప్పకూలినట్లు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏం జరిగిందనే విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. వాతావరణం అనుకూలించకే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పొగమంచే ప్రమాదానికి కారణమై ఉంటుందని ఎస్పీ నవనీత్ భాసిన్ తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ట్రైనీ పైలట్ సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.