Loading...
Warangal MGM Hospital: వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో దసరా నుంచి ఓపీ సేవలు
వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో దసరా నుంచి ఓపీ సేవలు

Warangal MGM Hospital: వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో దసరా నుంచి ఓపీ సేవలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2026
09:59 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎంజీఎం ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో వరంగల్‌లో కొత్తగా నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలోకి వైద్య విభాగాలను వీలైనంత త్వరగా తరలించి సేవలు ప్రారంభిస్తామని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలుత దసరా రోజున కొత్త ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. నవంబరు నెలాఖరు లేదా డిసెంబరులోగా పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గురువారం మంత్రి సీతక్క, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ఓపీ సేవల ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేశారు.

వివరాలు 

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా..

అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవోలు జారీ చేసినప్పటికీ నిర్మాణాలను పూర్తిచేయకుండా భవనాన్ని అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు.

మొండిగోడల దశలో ఉన్న ఈ భవన నిర్మాణాన్ని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేశామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ బలరాం నాయక్‌, ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి, నాగరాజు, కుడా ఛైర్మన్‌ సుధారాణి, కలెక్టర్లు సత్యశారద, చాహత్‌ బాజ్‌పాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

వివరాలు 

2,208 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి

వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో 56 ఎకరాల విస్తీర్ణంలో ఈ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు.

రూ.1,150 కోట్ల వ్యయంతో 2021లో ప్రారంభమైన నిర్మాణ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి.

దశలవారీగా ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురానున్నారు. పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ఇక్కడ మొత్తం 2,208 పడకల సామర్థ్యంతో వైద్యసేవలు అందుతాయి.

ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి వచ్చే పేదలకు కూడా ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి.

అధునాతన వైద్య సదుపాయాలతో పెద్ద సంఖ్యలో రోగులకు చికిత్స అందించేందుకు ఈ ఆసుపత్రి ఉపయోగపడనుంది.

ADVERTISEMENT

వివరాలు 

తొలుత రెండు అంతస్తుల్లో ఓపీ సేవలు

మొత్తం 24 అంతస్తులతో నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో తొమ్మిది అంతస్తులను వైద్యసేవల కోసం వినియోగించాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.

పై అంతస్తుల్లో వైద్యుల విభాగాలు, వైద్య విద్యకు సంబంధించిన విభాగాలను ఏర్పాటు చేయనున్నారు.

ప్రస్తుతం ఆరు అంతస్తుల్లో పనులు పూర్తయ్యాయి. మిగిలిన అంతస్తుల్లో ఇంకా కొన్ని సివిల్‌ పనులు కొనసాగాల్సి ఉంది.

మరోవైపు ఎంజీఎం ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో అక్కడ తరచూ ఏదో ఒక ఘటన చోటుచేసుకుంటోంది.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పాత ఆసుపత్రిలోని వైద్యసేవలను వీలైనంత త్వరగా కొత్త భవనానికి మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ADVERTISEMENT

వివరాలు 

తొలుత రెండు అంతస్తుల్లో ఓపీ సేవలు

దీంతో సీఎంవో అధికారులు, వైద్యశాఖ ఉన్నతాధికారులు కొత్త ఆసుపత్రిని సందర్శించి పనులు వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షించారు. రాత్రింబవళ్లు పనులు జరిగేలా చర్యలు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో దసరా రోజున రెండు అంతస్తుల్లో 22 విభాగాలకు సంబంధించిన ఓపీ సేవలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మిగిలిన ఏర్పాట్లు పూర్తయ్యే కొద్దీ ఇతర వైద్య విభాగాలను కూడా దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

వివరాలు 

మొత్తం 37 విభాగాల్లో వైద్యసేవలు

సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మొత్తం 37 విభాగాల్లో వైద్యసేవలు అందించనున్నారు.

వీటితో పాటు అవయవదానం, అవయవ మార్పిడి, సంతానలేమి సమస్యలకు చికిత్స అందించే ప్రత్యేక విభాగాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఈ విభాగాలు అందుబాటులోకి వస్తే ఆయా సమస్యలతో బాధపడుతున్న రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఉంది.

ADVERTISEMENT