పెట్: పెంపుడు కుక్కను దాని తోక ఊపే విధానం ద్వారా అర్థం చేసుకోండి
కుక్కపిల్లల్ని పెంచుకునే వాళ్ళు వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ టైమ్ లో ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. దానికోసం తోక ఊపే విధానాన్ని మీరు గమనించాలి. తోక ఊపే విధానాన్ని బట్టి ఆ కుక్కపిల్ల ఏం ఆలోచిస్తుందో పసిగట్టవచ్చు. మీ పెంపుడు కుక్కపిల్ల వేగంగా తోకను ఊపితే అది టెన్షన్ లో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో అవి యాక్షన్ లోకి దిగే అవకాశం ఉంటుంది. అందుకే ఆ టైమ్ లో వాటి జోలికి వెళ్ళకుండా ఉండడమే ఉత్తమం. తోకను కిందకు వంచితే: మీ కుక్కపిల్ల తన తోకను పూర్తిగా కిందకు వంచితే అది అసౌకర్యంగా ఉందని తెలుసుకోవాలి. అభద్రతా భావంలో ఉందని అర్థం చేసుకోవాలి. ఒత్తిడికి లోనైందని తెలుసుకోవాలి.
పెంపుడు కుక్కపిల్లల మనస్తత్వాలు
తోకను కిందకు వంచి కాళ్ళలో ఇరికించుకుంటే: ఈ సందర్భంలో అది బాధగా ఉందని, తప్పు చేయడం వల్ల పశ్చాత్తప పడుతుందని తెలుసుకోవాలి. యజమాని నేర్పించాక కూడా కొన్ని విషయాల్లో తప్పులు చేస్తే ఇలా తోకను కాళ్ళలో ఇరికించుకుంటాయి. తోకను గుండ్రంగా తిప్పితే: ఇలా ఊపితే అవి సంతోషంగా ఉన్నాయని అర్థం. కొన్ని రోజులుగా కనబడకుండా పోయిన యజమాని, సడెన్ గా కనిపిస్తే ఆనందంతో తోకను గుండ్రంగా ఊపుతూ దగ్గరికి వెళ్తాయి. తోకను నిటారుగా నిలబెడితే: ఈ సందర్భంలో కుక్కపిల్లతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తోకను నిటారుగా నిలబెడితే అవి కోపంగా ఉన్నాయని అర్థం. వాటికి ఏదైతే కోపం తెప్పించిందో దాని మీద కోపం తీర్చుకోవడానికి రెడీగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.