పూరీ జగన్నాథ రథ యాత్ర ఎప్పుడు మొదలు కానుంది? తేదీ, సమయం వివరాలివే?
ఒడిషాలోని పూరీ నగరంలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం జగన్నాథ ఆలయం. ప్రాచీన కాలానికి చెందిన ఈ దేవాలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయంలో కృష్ణుడు, సుభద్ర, బలరామ దేవుళ్ళు దర్శనమిస్తారు. ప్రతీ ఏడాది జూన్ లేదా జులై నెలల్లో శుక్లపక్షం రెండవ రోజున జగన్నాథ రథ యాత్ర జరుగుతుంది. ఆ రథయాత్ర వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. వడ్రంగి వారిచే తయారైన మూడు రథాలను పూరీ వీధుల్లో తిప్పుతారు. శ్రీకృష్ణుడిని నిలబెట్టిన నండిగోష అనే రథం 45.6అడుగుల ఎత్తు కలిగి ఉండి 16చక్రాలను కలిగి ఉంటుంది. బలరాముడిని నిలబెట్టిన రథం 45అడుగుల 4అంగుళాల ఎత్తులో 14చక్రాలు, సుభద్రను నిలబెట్టిన రథం 42అడుగుల 3అంగుళాల ఎత్తులో 12చక్రాలు కలిగి ఉంటాయి.
తొమ్మిది రోజుల పండగ
జగన్నాథ గుడి నుండి మొదలయ్యే రథయాత్ర తర్వాతి రోజు గుండిచా గుడి వరకు సాగుతుంది. గుండిచా గుడి దగ్గర ఏడురోజుల పాటు రథాన్ని ఉంచుతారు. ఆ తర్వాత మళ్ళీ మరో రోజులో జగన్నాథ ఆలయానికి రథాన్ని తీసుకువస్తారు. మొత్తం తొమ్మిది రోజుల పాటు పండగ సాగుతుంది కాబట్టి నవదిన యాత్ర అంటారు. ఈ సంవత్సరం జూన్ 20వ తేదీన రాత్రి 10:04గంటలకు మొదలై మరుసటిరోజు సాయంత్రం 7:09గంటలకు రథయాత్ర పూర్తవుతుంది. జగన్నాథ యాత్రకు భక్తులు చాలామంది వస్తారు. దేశ విదేశాల నుండి తరలివస్తుంటారు. రథయాత్ర జరిగే సమయంలో పూరీ వీధులన్నీ జగన్నాథ నామ స్మరణంలో మారుమోగుతుంటాయి. పూరీకి వెళ్ళాలనుకుంటే బస్సు, రైలు, విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.