చలికాలంలో రూమ్ హీటర్స్ ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ప్రస్తుతం చలి చాలా ఎక్కువగా ఉంది. మద్యాహ్నం పూట కూడా చలిగాలులు వీస్తున్నాయి. ఈ టైమ్ లో రూమ్ హీటర్ ఉన్న వాళ్ళు వెచ్చగా నిద్రపోతారు. అలాంటి వారు రూమ్ హీటర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రంతా రూమ్ హీటర్ ఆన్ చేసుకుని పడుకోకూడదు. అది ఒక్కోసారి మరణానికి కారణం కావచ్చు. రాత్రంతా రూమ్ హీటర్ ఎందుకు ఆన్ చేయకూడదో తెలుసుకుందాం. చర్మ సమస్యలు: రూమ్ హీటర్ వల్ల గదంతా వేడిగా మారుతుంది. దానివల్ల చర్మంపై తేమ మాయమవుతుంది. అప్పుడు దురద, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. రూమ్ హీటర్ నుండి కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువు వెలువడుతుంది. ఒక్కోసారి ప్రాణాలు పోయే అవకాశం ఉంది.
రూమ్ హీటర్స్ వల్ల జరిగే ప్రమాదాలు
అగ్ని ప్రమాదాలు: ఎక్కువ సేపు రూమ్ హీటర్స్ ని ఆన్ చేసి ఉంచడం వల్ల గదిలో ఉండే కర్టెన్ లు, తాత్కాలికంగా గదిలో వేలాడే ఎలక్ట్రిక్ వైర్ లు అంటుకునే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతల్లో మార్పులు: గదిలోకి వచ్చినపుడు వేడిగా, మళ్ళీ గదిలోంచి బయటకు వెళ్ళినపుడు చల్లగా ఉండడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రతల్లో మార్పు వస్తుంది. అది రోగనిరోధక శక్తిని బలహీనం చేస్తుంది. అంతేకాదు, జలుబు, జ్వరం, ఒళ్ళునొప్పులు, గొంతు సమస్యలు వస్తాయి. హీటర్స్ ఎక్కువ ఎలక్ట్రిసిటీని వాడుకుంటాయి. దానివల్ల ఒక్కోసారి వైర్ లలో ఏదైనా తేడా జరిగి ఎలక్ట్రిక్ షాక్ తగలవచ్చు. అందుకే రూమ్ హీటర్ వాడుతున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రంతా హీటర్ ని ఆన్ చేసి నిద్రపోవద్దు.