జత కట్టకుండానే పిల్లల్ని కనే జంతువుల గురించి తెలుసుకోండి
సంతానం కలగడానికి ప్రత్యుత్పత్తి ఖచ్చితంగా అవసరమని అందరికీ తెలుసు. కానీ ప్రత్యుత్పత్తి జరపకుండానే కొన్ని జీవులు పిల్లల్ని కంటాయని ఎంతమందికి తెలుసు? తాజాగా కోస్టారికాలోని ఒక జూలో, మగ మొసలితో జతకట్టకుండానే పిల్ల మొసలికి ఆడమొసలి జన్మనిచ్చింది. మొసలి జాతుల్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి. 16సంవత్సరాలుగా మగ మొసలికి దూరంగా ఉన్న ఆడ మొసలి, గర్భం దాల్చి గుడ్డు పెట్టింది. ఆ పిల్ల మొసలి 99.9% తల్లి మొసలి జన్యు లక్షణాలను పోలి ఉండడం విశేషం. జతకట్టకుండానే తల్లిగా మారడాన్ని వర్జిన్ బర్త్ అంటారు. సాధారణంగా కొన్ని పక్షులు, చేపలు, సరిసృపాల్లో ఇలాంటి లక్షణం కనిపిస్తుంది.
వర్జిన్ బర్త్ ఎలా జరుగుతుంది?
జత కట్టకుండానే పిల్లల్ని కనడాన్ని శాస్త్రీయంగా పార్థినోజెనిసిస్ అంటారు. వర్జిన్ బర్త్ సంభవించే జీవుల్లో ప్రత్యుత్పత్తి కణాలైనా గామెట్లు అభివృద్ధి చెందుతాయి. ఈ గామెట్లు, కణాల విభజన ద్వారా ఏర్పడతాయి. ఈ ప్రాసెస్ లో రెండు క్రోమోజోములు ఉన్న కణం రెండు చిన్న కణాలుగా విడిపోతుంది. ఈ చిన్న కణాలే తర్వాత పిండంగా అభివృద్ధి చెందుతాయి. 2001లో ఒక షార్క్ చేప, మగ షార్క్ తో జత కట్టకుండానే పిల్ల షార్క్ కు జన్మనిచ్చింది. కాకపోతే ఈ బేబీ షార్క్ ఎక్కువ రోజులు బ్రతకలేకపోయింది. 2006లో బ్రిటన్ లోని ఒక జూలో, రెండు ఆడ కొమోడో డ్రాగన్లు, మగవాటితో జతకట్టకుండానే గుడ్లు పెట్టాయి. ఈ గుడ్లు కొన్నిరోజుల తర్వాత ఆరోగ్యవంతమైన పిల్లలుగా మారాయి.
మనుషుల్లో వర్జిన్ బర్త్ సాధ్యమా?
కొన్ని కొన్ని జంతువుల్లో కనిపించినట్టు మనుషుల్లో ఇలాంటి వర్జిన్ బర్త్ అస్సలు సాధ్యం కాదు. ఎందుకంటే అండంలో విభజన జరగాలంటే ఖచ్చితంగా వీర్యం కావాలి. మరో విషయం ఏంటంటే అండంలో క్రోమోజోములు సగం మాత్రమే ఉంటాయి. పిండం బతకాలంటే కావాల్సినంత డీఎన్ఏ ఉండాలి. వీర్యకణాల ప్రమేయం లేకుండా ఇది సాధ్యపడదు.