చంద్రుడిపై రష్యా ల్యాండర్ లూనా-25 ఎక్కడ కూలిందో గుర్తించిన నాసా: ఫోటోలు విడుదల
చంద్రుడి మీద అన్వేషణ చేయడానికి భారతదేశం చంద్రయాన్-3 ప్రయోగించి సక్సెస్ అయ్యింది. ఈ ప్రయోగంలో చంద్రుడి దక్షిణ ధ్రువం మీద చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ దిగింది. ప్రపంచంలోనే ఇప్పటివరకు ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణ ధృవం మీద దిగలేదు. అయితే చంద్రాయన్ 3 చంద్రుడి వైపు వెళ్తున్న సమయంలో లూనా- 25 పేరుతో చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకు అంతరిక్ష వ్యోమ నౌకను రష్యా పంపింది. ఈ వ్యోమనౌక చంద్రుడి ఉపరితలానికి కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే కూలిపోయింది. దీంతో భారతదేశం కన్నా ముందుగా చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగు పెట్టాలన్న రష్యా కల నెరవేరలేదు.
లూనా-25 కూలిన చోట పెద్ద గొయ్యి
రష్యా కు చెందిన లూనా- 25 చంద్రుడి మీద ఎక్కడ కూలిపోయిందో తెలియజేస్తూ నాసా కొన్ని ఫోటోలు విడుదల చేసింది. ఈ ఫోటోలలో, లూనా-25 కూలిపోయిన చోట పెద్ద గొయ్యి కనిపిస్తుంది. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఆర్బిటార్ సాయంతో నాసా ఈ ఫోటోలను తీసింది. లూనా- 25 కూలిపోవడానికి ముందు చంద్రుడి మీద అలాంటి గొయ్యి కనిపించలేదని, కూలిన తర్వాతే గొయ్యి ఏర్పడిందని, అందువల్ల ఆ గొయ్యి లూనా- 25 కూలిపోవడం వల్లే ఏర్పడి ఉండొచ్చని నాసా అభిప్రాయపడుతోంది.