Hanuma Vihari: హనుమ విహారిపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ విచారణ
హనుమ విహారి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ACA) మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. హనుమ విహారిపై ఏసీఏ విచారణ ప్రారంభించింది. తనను కెప్టెన్సీకి రాజీనామా చేయవలసిందిగా ఏసీఏ ఒత్తిడి చేసిందని హనుమ విహారి ఆరోపించిన విషయం తెలిసిందే. ఏసీఏలో రాజకీయ జోక్యం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ 'దుష్ప్రవర్తన' కారణంగా తాను మళ్లీ జట్టు కోసం ఆడబోనని విహారి స్పష్టం చేశారు. విహారి వ్యాఖ్యలపై ఏసీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏసీఏ సిబ్బంది, నిర్వాహకుల అందిన ఫిర్యాదు మేరకు మేనేజ్ మెంట్ విచారణను ప్రారంభించింది. విహారిపై ఏసీఏ విమర్శలు గుప్పించింది. విహారి బూతులు తిడతాడని, అతని తీరు దారుణంగా ఉందని తోటి ఆటగాళ్లు నుంచి ఫిర్యాదులు అందినట్లు ఏసీఏ వెల్లడించింది.