LOADING...
Belgium Goalkeeper: ఇక నిద్ర కూడా ప్రశాంతంగా పట్టదేమో.. బెల్జియం గోల్‌కీపర్‌పై విమర్శల వర్షం
ఇక నిద్ర కూడా ప్రశాంతంగా పట్టదేమో.. బెల్జియం గోల్‌కీపర్‌పై విమర్శల వర్షం

Belgium Goalkeeper: ఇక నిద్ర కూడా ప్రశాంతంగా పట్టదేమో.. బెల్జియం గోల్‌కీపర్‌పై విమర్శల వర్షం

వ్రాసిన వారు Moogati Shabari
Jul 11, 2026
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

మ్యాచ్ ముగియడానికి మరో రెండు నిమిషాలే మిగిలి ఉన్నాయి. ఆ సమయానికి స్కోరు సమంగా ఉండటంతో పోరు పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లే అవకాశాలు కనిపించాయి. అయితే, కీలక సమయంలో జరిగిన ఒక చిన్న పొరపాటు బెల్జియం ఆశలను పూర్తిగా ఛిద్రం చేసింది. ఆ తప్పిదంతో జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించగా, గోల్‌కీపర్ సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది? ఫిఫా ప్రపంచకప్ 2026 క్వార్టర్‌ఫైనల్లో స్పెయిన్, బెల్జియం జట్లు తలపడ్డాయి. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు ఇరు జట్లు విజయమే లక్ష్యంగా పోరాడాయి. చివరకు స్పెయిన్ 2-1 గోల్స్ తేడాతో బెల్జియాన్ని ఓడించి సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది.

వివరాలు

మైకెల్ మెరినో అద్భుతమైన గోల్..

అయితే ఈ విజయాన్ని స్పెయిన్ సాధించిన ఘనతగా చెప్పడం కంటే, బెల్జియం చేసిన కీలక తప్పిదమే మ్యాచ్ ఫలితాన్ని మార్చిందని చెప్పడం సరైనదని ఫుట్‌ బాల్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 87వ నిమిషం వరకు ఇరు జట్లు 1-1తో సమంగా కొనసాగాయి. 88వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు మైకెల్ మెరినో గోల్ నమోదు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ గోల్‌కు ముందు జరిగిన పరిణామమే బెల్జియానికి పెద్ద దెబ్బగా మారింది. స్పెయిన్ డిఫెండర్ పౌ కుబర్సి గోల్‌పోస్ట్ వైపు పంపిన బంతిని బెల్జియం గోల్‌కీపర్ సెన్నె లామెన్స్ సురక్షితంగా అందుకోవడంలో విఫలమయ్యాడు. బంతి జారిపోవడంతో అక్కడే అప్రమత్తంగా ఉన్న మైకెల్ మెరినో వెంటనే దానిని గోల్‌గా మలిచి స్పెయిన్‌కు కీలక ఆధిక్యాన్ని అందించాడు.

వివరాలు

నెట్టింట తీవ్ర విమర్శలు..

వాస్తవానికి బెల్జియం ప్రధాన గోల్‌కీపర్ తిబౌట్ కోర్టోయిస్ గాయపడటంతో 70వ నిమిషంలో సెన్నె లామెన్స్ ప్రత్యామ్నాయ ఆటగాడిగా మైదానంలోకి వచ్చాడు. అయితే చివరి క్షణాల్లో జరిగిన అతని పొరపాటు బెల్జియం ప్రపంచకప్ ప్రయాణానికి ముగింపు పలికింది. ఈ ఓటమికి లామెన్స్‌నే కారణమంటూ బెల్జియం అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. "ఈ తప్పిదం తర్వాత నీకు ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు" అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా, మరికొందరు మాత్రం ఒకే తప్పిదంతో ఆటగాడిని తప్పుబట్టడం సరికాదని, అతనికి అండగా నిలుస్తున్నారు.

Advertisement