BWF World Championships: రిటర్న్ టికెట్‌తో వచ్చి.. లక్ష్యకు షాకిచ్చాడు.. ఎవరీ 18 ఏళ్ల కుర్రాడు?
ఈ వార్తాకథనం ఏంటి
సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships)లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. టోర్నీలో పతకం సాధిస్తాడని భావించిన లక్ష్య.. రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. 18 ఏళ్ల అమెరికా యువ షట్లర్ గారెట్ టాన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. పెద్దగా అంచనాలు లేకుండా ఈ ఛాంపియన్‌షిప్‌లో అడుగుపెట్టిన టాన్.. శుక్రవారం తిరిగి వెళ్లేందుకు రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. అయితే లక్ష్యసేన్‌ను ఓడించి ప్రీక్వార్టర్స్‌కు చేరుకోవడంతో ఇప్పుడు అతడి పేరు మార్మోగుతోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 92వ స్థానంలో ఉన్న గారెట్ టాన్.. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో 14వ సీడ్ లక్ష్యసేన్‌తో తలపడ్డాడు.
వివరాలు
73 నిమిషాల పాటు సాగిన మ్యాచ్..
దాదాపు 73 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో టాన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు.
కోర్టులో వేగంగా కదులుతూ లక్ష్యపై ఒత్తిడి పెంచాడు. తొలి గేమ్‌ను 19-21తో కోల్పోయినప్పటికీ.. రెండో గేమ్‌లో టాన్ మరింత పుంజుకున్నాడు.
లక్ష్యసేన్ తీవ్రంగా పోరాడినా.. టాన్ దూకుడును అడ్డుకోవడం కష్టమైంది.
దీంతో 21-19, 21-17తో వరుసగా రెండు గేమ్‌లను గెలిచిన టాన్.. మ్యాచ్‌ను సొంతం చేసుకుని ప్రీక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు.
మ్యాచ్ అనంతరం గారెట్ టాన్ మాట్లాడుతూ.. ''శుక్రవారం నేను తిరిగి వెళ్లాల్సి ఉంది.
అందుకోసం రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలని నేనూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అంటూ నవ్వుతూ చెప్పాడు. టాన్ కెరీర్‌లో ఇదే తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్.
వివరాలు
ఎనిమిదేళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్‌లో శిక్షణ..
ఇక ప్రీక్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన మాజీ ఛాంపియన్ కున్లావుట్ విటిడ్సార్న్‌తో అతడు తలపడనున్నాడు.
కాలిఫోర్నియాకు చెందిన గారెట్ టాన్.. ఎనిమిదేళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు.
14 ఏళ్ల వయసు నుంచే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఒక దశలో జూనియర్ ప్రపంచ నంబర్ వన్‌గా కూడా నిలిచాడు.
గతేడాది పాన్ ఆమ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. ఈ ఏడాదే సీనియర్ సర్క్యూట్‌లోకి అడుగుపెట్టాడు.
మార్చిలో జరిగిన బ్రెజిల్ ఇంటర్నేషనల్, జులైలో జరిగిన సైపాన్ ఇంటర్నేషనల్ టోర్నీల్లో సెమీఫైనల్ వరకు చేరుకున్నాడు.