Gaza Reconstruction: గాజా పునర్నిర్మాణానికి 100 కోట్ల డాలర్ల భారీ నిధి.. 65 దేశాల భాగస్వామ్యం
ఈ వార్తాకథనం ఏంటి
గాజాలో సహాయక చర్యలను వేగవంతం చేయడంతో పాటు యుద్ధ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణానికి 100 కోట్ల డాలర్ల (1 బిలియన్ డాలర్ల) ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని యూరోపియన్ యూనియన్ సమన్వయం చేయనుండగా, గాజా ప్రజలకు అత్యవసర సేవలు తిరిగి అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. బెల్జియంలోని బ్రసెల్స్‌లో నిర్వహించిన పాలస్తీనా విరాళ దాతల సమావేశం అనంతరం యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షురాలు కజా కల్లాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. గాజాలో తీవ్రంగా దెబ్బతిన్న మౌలిక వసతులను పునరుద్ధరించేందుకు ఈ నిధిని వినియోగించనున్నట్లు ఆమె తెలిపారు.
వివరాలు
ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఈ నిధి
ఈ నిధి ద్వారా తాగునీటి సదుపాయాల పునరుద్ధరణ, పారిశుధ్య వ్యవస్థల మెరుగుదల, శిథిలాల తొలగింపు, వైద్య సేవల పునరుద్ధరణ, ఇంధన సరఫరా, వ్యవసాయ రంగానికి మద్దతు, ఆహార సరఫరా వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం వంటి కీలక కార్యక్రమాలను చేపట్టనున్నారు.
ఈ నిధి ఏర్పాటులో అమెరికా, ఐక్యరాజ్యసమితి (ఐరాస)తో పాటు ప్రపంచంలోని 65 దేశాల ప్రభుత్వాలు భాగస్వామ్యం కానున్నాయి.
అంతర్జాతీయ సహకారంతో గాజాలో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడంతో పాటు ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఈ నిధి ఉపయోగపడుతుందని యూరోపియన్ యూనియన్ ఆశాభావం వ్యక్తం చేసింది.