560 మృతదేహాల అవయవాలను అక్రమంగా అమ్మిన మహిళకు 20ఏళ్ల జైలు శిక్ష
560 శవాలకు చెందిన అవయవాలను అక్రమంగా విక్రయించిన ఘటన ఆమెరికాలోని కొలోరాడోలో వెలుగుచూసింది. ఈ కేసులో ఓ మహిళకు 20ఏళ్లు, ఆమె తల్లికి 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. కొలోరాడో రాష్ట్రంలోని మోంట్రోస్‌లో మేగస్ హెస్(46) అనే మహిళ.. శ్మశాన వాటికతో పాటు అవయవదాన కార్యక్రమాలను నిర్వహించేది. మేగస్ హెస్‌కు ఆమె తల్లి షిర్లే కోచ్ కూడా సహకరిస్తూ ఉండేది. తల్లీకూతుళ్లు సంపాదన మీద మోజుతో.. మృతదేహాల అవయవాలను అక్రమంగా విక్రయించడం మొదలు పెట్టారు. మృతదేహాల బంధువులే అవయవదానం చేస్తున్నట్లుగా నకలీ పత్రాలను సృష్టించి.. ఈ అక్రమానికి పాల్పడ్డారు.
విచిత్రంగా భుజాలు, వెన్నుముక కూడా అమ్మేశారు
కొన్నాళ్లకు తల్లీకూతుళ్లు దందా బయటపడింది. మీడియా కూడా వీరిపై వరుస పరిశోధనాత్మక కథనాలు రాసింది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ తల్లీకూతుళ్లు స్థావరాలపై దాడి చేయడంతో మరిన్ని విషయాలు వెలుగలోకి వచ్చాయి. వీరు కళ్లు, కిడ్నీ, లివర్ వంటి అవయవాలనే కాకుండా.. విచిత్రంగా భుజాలు, వెన్నుముక, మోకాళ్లు, పాదలను విక్రయించినట్లు తెలిసి అధికారులు ముక్కున వేలేసుకున్నారు. అనంతరం తల్లీకూతుళ్లను అరెస్టు చేశారు. అరెస్టు అయ్యే నాటికే వీరు దాదాపు 560శవాలకు సంబంధించిన అవయవాలను విక్రయించినట్లు పోలీసులు చెప్పారు. పోలీసుల విచారణలో తల్లీకూతుళ్లు నేరాన్ని అంగీకరించారు. ఈ దారుణానికి పాల్పడ.. మేగస్ హెస్‌కు 20ఏళ్లు, ఆమె తల్లికి 15ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ.. ఫెడరల్ కోర్టు తీర్పును వెలువరించింది.