మాజీ పోప్ బెనెడిక్ట్ అస్తమయం.. న్యూఇయర్ వేళ విషాదంలో క్యాథలిక్‌లు
క్యాథలిక్‌ల మత గురువు, మాజీ పోప్ బెనెడిక్ట్-16(95) కన్నుమూశారు. శనివారం ఉదయం 9:34 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారని వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ తెలిపారు. బెనెడిక్ట్ పార్థీవదేహం సెయింట్ పీటర్స్ బసిలికాలో సోమవారం నుంచి ప్రదర్శనకు ఉంచనున్నట్లు చెప్పారు. వాస్తవానికి బెనెడిక్ట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని వాటికన్ రెండు రోజుల క్రితం ప్రకటించింది. ఇది జరిగిన రెండు రోజులకే మాజీ పోప్ బెనెడిక్ట్ మరణించారు. దీంతో న్యూఇయర్ వేళ.. క్యాథలిక్‌లు ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది. 2005 నుంచి 2013 వరకు బెనెడిక్ట్ క్యాథలిక్ చర్చి నాయకుడిగా పనిచేశారు. ఆ తర్వాత పోప్ బాధ్యతల నుంచి తప్పుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు బెనెడిక్ట్.
బాధ్యతల నుంచి తప్పుకున్న ఏకైక పోప్ బెనెడిక్ట్ ..
600ఏళ్ల క్యాథలిక్ చర్చి చరిత్రలో బాధ్యతల నుంచి తప్పుకున్న ఏకైక పోప్‍గా బెనెడిక్ట్ అవతరించారు. ఒకసారి పోప్‌గా బాధ్యతలు చేపడితే.. చనిపోయే వరకు అదే పదవిలో కొనసాగుతారు. బెనెడిక్ట్ ఒక్కరే.. మధ్యలో బాధ్యతల నుంచి తప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే లైంగిక ఆరోపణల నేపథ్యంలోనే ఆయన బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. బెనెడిక్ట్ 1927లో జర్మనీలో జన్మించారు. ఆయన అసలు పేరు జోసెఫ్ అలోసియస్ రాట్ జింగర్. తన 14 సంవత్సరాల వయస్సులో హిట్లర్ సైన్యంలో చేరారు. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ సైన్యం తరఫున పనిచేశాడు. యుద్ధం ముగిసే సమయానికి సైన్యం నుంచి వైదొలిగారు. అమెరికన్ దళాల చేతిలో బంధీఅయి కొంతకాలం యుద్ధ ఖైదీగా కూడా ఉన్నారు.