Oregon School Shooting: అమెరికాలోని ఓరెగాన్ పాఠశాలలో కాల్పులు.. ముగ్గురు చిన్నారులు సహా నలుగురి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రంలో పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు, ఒక ఉపాధ్యాయుడు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు పాల్పడినట్లు భావిస్తున్న వ్యక్తి పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. వాయువ్య అమెరికాలోని ఓరెగాన్ రాష్ట్రం బెండ్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత ఓ కారుపై కాల్పులు జరిగినట్లు సమాచారం అందిందని, ఆ తర్వాత కొద్ది నిమిషాల వ్యవధిలోనే పాఠశాల లోపల కాల్పులు జరుగుతున్నట్లు పలు అత్యవసర ఫోన్కాల్స్ వచ్చాయని బెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతినిధి షీలా మిల్లర్ వెల్లడించారు.
వివరాలు
అనుమానితుడిని ఎవరు కాల్చి చంపారనే విషయమై స్పష్టత లేదు
స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు సమాచారం అందడంతో పోలీసులు కొన్ని నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఆ తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తిని కాల్చి చంపినట్లు పోలీసు వైర్లెస్ రేడియోలో సమాచారం ప్రసారమైంది.
అయితే, అనుమానితుడిని ఎవరు కాల్చి చంపారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదని షీలా మిల్లర్ తెలిపారు.
ఘటనా స్థలంలో ఉన్న పౌరుల్లో ఎవరైనా కాల్పులు జరిపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో ఐదు, ఎనిమిది, పదకొండు సంవత్సరాల వయసున్న ముగ్గురు చిన్నారులు మరణించారని చెప్పారు.
కనీసం ఇద్దరిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా వివరాలు తెలియరాలేదన్నారు.
వివరాలు
కాల్పులకు పాల్పడింది 16 ఏళ్ల బాలుడని స్థానిక మీడియా కథనాలు
కాల్పులకు పాల్పడిన వ్యక్తి 16 ఏళ్ల బాలుడని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
అయితే, ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
బెండ్లోని సిల్వర్ రైల్ ఎలిమెంటరీ పాఠశాలలో 400 నుంచి 450 మంది విద్యార్థులు చదువుకుంటుండగా, 40 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారని షీలా మిల్లర్ తెలిపారు.
కాల్పుల ఘటన అనంతరం పాఠశాలను ఖాళీ చేయించారు.
విద్యార్థులను బస్సుల్లో మరో ప్రాంతానికి తరలించి, అక్కడ వారి కుటుంబ సభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకున్నట్లు బెండ్-లా పైన్ స్కూల్ డిస్ట్రిక్ట్ వెల్లడించింది.
మరోవైపు, సమీపంలోని ఓ చర్చి వద్ద తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఆందోళనగా ఎదురుచూశారు.
వివరాలు
స్టీవెన్ కుక్ తీవ్ర దిగ్భ్రాంతి
ఈ సందర్భంగా డ్రూ షార్ప్ అనే వ్యక్తి సీబీఎస్ న్యూస్తో మాట్లాడుతూ.. తన బిడ్డ క్షేమంగా ఉంటాడని, అతడికి ఏమీ కాదనే నమ్మకం ఉందని చెప్పారు. తన కుమారుడు ఐదో తరగతి చదువుతున్నట్లు వెల్లడించారు.
ఈ దారుణ ఘటనపై బెండ్-లా పైన్ స్కూల్స్ సూపరింటెండెంట్ స్టీవెన్ కుక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటన తమను తీవ్ర వేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలతో పాటు ఈ ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ సానుభూతి తెలిపారు.
తాము అనుభవిస్తున్న బాధను మాటల్లో వివరించలేమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటన నేపథ్యంలో జిల్లాలోని బెండ్-లా పైన్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
వివరాలు
అభివృద్ధి చెందిన దేశాల్లో తుపాకీ హింస
పోర్ట్లాండ్ నగరానికి ఆగ్నేయంగా సుమారు 170 మైళ్ల దూరంలో ఉన్న ఈ పాఠశాలలో కిండర్గార్టెన్ నుంచి ఐదో తరగతి వరకు విద్యాబోధన జరుగుతుంది.
అమెరికాలో తుపాకీ హింస తరచూ వార్తల్లో నిలుస్తోంది. తుపాకులు సులభంగా అందుబాటులో ఉండటం వల్ల ప్రతి ఏడాది వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో తుపాకీ హింస కారణంగా అత్యధిక మరణాలు నమోదవుతున్న దేశాల్లో అమెరికా ముందుంది.
ఆ దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన పాఠశాల కాల్పుల ఘటనల్లో ఒకటైన వర్జీనియా టెక్ దాడి 2007 ఏప్రిల్ 16న జరిగింది.
దక్షిణ కొరియాకు చెందిన విద్యార్థి సీంగ్-హుయ్ చో జరిపిన కాల్పుల్లో 32 మంది మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు.
వివరాలు
అభివృద్ధి చెందిన దేశాల్లో తుపాకీ హింస
అనంతరం నిందితుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గన్ వయొలెన్స్ ఆర్కైవ్ గణాంకాల ప్రకారం.. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మందిపై కాల్పులు జరిపిన ఘటనలను మాస్ షూటింగ్లుగా పరిగణిస్తారు.
ఈ నిర్వచనం ప్రకారం, ఈ ఏడాది ఇప్పటివరకు అమెరికాలో 360కి పైగా సామూహిక కాల్పుల ఘటనలు నమోదయ్యాయి.