Yemen: యెమెన్ అధ్యక్ష భవనంపై హౌతీల దాడులు.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
యెమెన్‌లోని ఏడెన్ నగరంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వ భవనంపై హౌతీలు గురువారం దాడులకు పాల్పడ్డారు. మాషిక్ ప్యాలెస్ సమీపంలో రెండు పేలుళ్లు సంభవించగా,భద్రతా గేటు వద్ద మరో రెండు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. మొత్తం కనీసం ఆరు పేలుళ్లు జరిగినట్లు ఓ అధికారి వెల్లడించారు. ఈ ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా,మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడులకు తామే బాధ్యులమని హౌతీలు ప్రకటించుకున్నారు. క్షిపణులు, డ్రోన్ల దాడులతో భయాందోళనలకు గురైన ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. దాడులు జరిగిన సమయంలో యెమెన్ ప్రధాని షాయా మొహ్సిన్ అల్-జిందానీతో పాటు ప్రభుత్వంలోని పలువురు కీలక నేతలు భవనంలోనే ఉన్నారు. అయితే,ప్రధాని సహా నేతలంతా సురక్షితంగా బయటపడ్డారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
వివరాలు
జెడ్డా విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం
అంతర్జాతీయ గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా మద్దతుగా నిలుస్తుండగా, హౌతీలకు ఇరాన్ అండగా ఉంటున్న విషయం తెలిసిందే.
మదీనా ప్రావిన్స్పైకి ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణిని గురువారం ఉదయం మార్గమధ్యంలోనే అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో జెడ్డా విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కొన్ని విమానాలను రద్దు చేయగా, మరికొన్ని ఆలస్యంగా నడిచాయి.
వివరాలు
మక్కా, మదీనాలపై దాడులు చేయబొం: హౌతీలు
అయితే, మదీనా ప్రావిన్స్‌పై జరిగిన క్షిపణి దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని హౌతీలు స్పష్టం చేశారు.
సౌదీ అరేబియాలోని పవిత్ర నగరాలైన మక్కా, మదీనాలపై దాడులు చేయబోమని గతంలోనే ప్రకటించినట్లు గుర్తుచేశారు.
మరోవైపు, సౌదీ అరేబియాలో కీలక సైనిక స్థావరం ఉన్న ఖమిస్ ప్రాంతంలో ఓ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.
యెమెన్ ప్రభుత్వంపై జరిగిన దాడులు, సౌదీ అరేబియా చేసిన ప్రకటనలతో ఈ ప్రాంతంలో భద్రతాపరమైన ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.