2027 Kawasaki Z900: రూ. 9.99 లక్షలకే కవాసాకి Z900 నయా అప్డేటెడ్ మోడల్
ఈ వార్తాకథనం ఏంటి
కవాసాకి తన ప్రీమియం నేకెడ్ స్పోర్ట్స్ బైక్ Z900కు 2027 అప్‌డేట్‌ను భారత ఆటో మొబైల్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.9.99 లక్షలుగా నిర్ణయించింది. కొత్త అప్‌డేట్‌లో భాగంగా ధరను మార్చకుండా, రెండు కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేసింది. జీఎస్‌టీ విధానంలో మార్పులు వచ్చినప్పటికీ పాత మోడల్ ధరనే కొనసాగించడం విశేషం. అక్టోబర్ 29, 2026 నుంచి ఈ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇటీవల Z300ను విడుదల చేసిన కవాసాకి, ఇప్పుడు Z900కు కొత్త రూపాన్ని అందించింది.
Details
రెండు కొత్త రంగుల్లో Z900
2027 కవాసాకి Z900 రెండు కొత్త రంగుల ఎంపికల్లో లభిస్తుంది. ఎబోనీ విత్ మెటాలిక్ కార్బన్ గ్రే, మెటాలిక్ స్పార్క్ బ్లాక్ కలర్‌తో పాటు పెర్ల్ బ్లిజార్డ్ వైట్ విత్ ప్లాస్మా లైమ్ గ్రీన్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
ముఖ్యంగా తెలుపు, ఆకుపచ్చ కలయికలో ఉండే మోడల్‌కు కవాసాకి ప్రత్యేక గుర్తింపుగా నిలిచే లైమ్ గ్రీన్ ఫ్రేమ్ ఆకర్షణగా ఉంటుంది. 2026 మోడల్‌లో ఉన్న రెండు రంగులను ఈ కొత్త షేడ్స్ భర్తీ చేశాయి.
అయితే బైక్ డిజైన్‌లో మాత్రం మార్పులు చేయలేదు. ట్విన్ హెడ్‌ల్యాంప్స్, కండలు తిరిగినట్లుగా కనిపించే ఫ్యూయల్ ట్యాంక్, షార్ప్ టెయిల్ డిజైన్‌తో దూకుడైన రూపాన్ని కొనసాగించింది.
Details
948 సీసీ ఇంజిన్.. 124 హెచ్‌పీ పవర్
ఈ బైక్‌లో యాంత్రిక మార్పులు లేవు. ఇందులో 948 సీసీ లిక్విడ్ కూల్డ్, ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్‌ను కొనసాగించారు.
ఇది 9,500 ఆర్‌పీఎం వద్ద 124 హెచ్‌పీ గరిష్ఠ శక్తిని, 7,700 ఆర్‌పీఎం వద్ద 98.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు గేర్ల గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్ పనిచేస్తుంది.
వేగవంతమైన ప్రయాణంతో పాటు రైడింగ్ నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చే ఈ బైక్‌లో ఇంజిన్ పనితీరును మార్చకుండా, కొత్త రంగులకే పరిమితమైన అప్‌డేట్‌ను తీసుకొచ్చారు.
Details
ఆధునిక ఫీచర్లు.. రైడింగ్ మోడ్‌లు
Z900లో 5 అంగుళాల TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కార్నరింగ్‌కు అనుగుణంగా పనిచేసే ABS, ట్రాక్షన్ కంట్రోల్ కూడా అందించారు.
స్పోర్ట్, రోడ్, రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు రైడర్ అవసరాలకు అనుగుణంగా పవర్, ట్రాక్షన్ కంట్రోల్ సెట్టింగులను నిర్వహిస్తాయి.
ముందు భాగంలో 300 మి.మీ. డ్యూయల్ డిస్క్‌లు, వెనుక 250 మి.మీ. డిస్క్ బ్రేక్‌ను అందించారు.
అడ్జస్టబుల్ USD ఫోర్క్, బ్యాక్‌లింక్ మోనోషాక్ సస్పెన్షన్‌తో పాటు డన్‌లప్ స్పోర్ట్‌మ్యాక్స్ Q5A టైర్లు కూడా ఉన్నాయి.
మొత్తంగా, కొత్త రంగులతో వచ్చిన ఈ మోడల్‌లో పనితీరు, ఫీచర్ల పరంగా పాత వెర్షన్‌నే కొనసాగించారు.